iDreamPost

పడకేసిన టాబ్లాయిడ్లు…తగ్గిన పేజీలు .!

పడకేసిన టాబ్లాయిడ్లు…తగ్గిన పేజీలు .!

పత్రికలు ఎదుర్కొంటున్న కరోనా కష్టాల గురించి ఇప్పటికే ఒకసారి చెప్పుకున్నాం..! కరోనా కారణంగా కొన్ని పత్రికలు ముద్రణను తాత్కాలికంగా నిలిపివేస్తే మిగిలిన పేపర్లు పేజీల సంఖ్యను తగ్గించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పత్రికలు టాబ్లాయిడ్లను నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో పత్రికా యాజమాన్యాలు ఇంకెలాంటి చర్యలు తీసుకుంటాయా అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టాబ్లాయిడ్లు వీటినే మినీలు..జిల్లా ఎడిషన్లు అని పిలుస్తుంటారు. పేపర్ చదివే వారందరికీ టాబ్లాయిడ్లు సుపరిచితమే. కాగా ఆంధ్రజ్యోతి ఇప్పటికే టాబ్లాయిడ్లను నిలిపివేసి మెయిన్లో నాలుగు పేజీలు జిల్లా వార్తలకు కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఈనాడు సైతం టాబ్లాయిడ్లను నిలిపివేయడం గమనార్హం. ఈనాడు జిల్లా వార్తల కోసం మెయిన్ లో రెండున్నర పేజీలను కేటాయించింది. ఇక మరో ప్రముఖ పత్రిక సాక్షి…పై రెండు పత్రికల దారిలోనే రేపటి నుంచి టాబ్లాయిడ్లను తాత్కాలికంగా నిలిపివేయనుంది. జిల్లా వార్తలను మూడు పేజీల్లో మెయిన్ లో అందించనుంది.

తెలుగు రాష్ట్రాల్లో పత్రికా పాఠకుల పెద్ద సంఖ్యలో ఉన్నారు. రోజూ పేపర్ చదివే అలవాటు లేకపోయినా కనీసం సినిమా పేజీల్లో ప్రచురితమయ్యే హీరోల బొమ్మల కోసం పత్రికలను చూసే వారు గ్రామీణ ప్రాంతాల్లో కోకొల్లలు. దీంతో సహజంగానే పత్రికల స్వరూపం పై జనాలకు ఓ అవగాహన ఉంది. ఐతే ఓ పాతిక, ముప్పై సంవత్సరాల వెనక్కి వెళితే పత్రికల్లో టాబ్లాయిడ్లు అనేవి మనకు కనిపించవు. కేవలం బ్రాడ్షీట్స్ లో వచ్చే మెయిన్లోనే జాతీయ, రాష్ట్ర వార్తలు వచ్చేవి. ఐతే 1989, జనవరి 26న ఈనాడు జిల్లా ఎడిషన్లకు శ్రీకారం చుట్టి…జిల్లా, జోన్, మండల వార్తలను ఇవ్వటం ప్రారంభించింది. తదనంతర కాలంలో మిగిలిన పత్రికలు సైతం టాబ్లాయిడ్లను ప్రారంభించాయి. కాగా అప్పటి నుంచి నిరంతరంగా సాగుతున్న టాబ్లాయిడ్లు కరోనా దెబ్బకు తాత్కాలికంగా నిలిచిపోవడం గమనార్హం.

Also Read :పత్రికలపై కరోనా దెబ్బ

ఎందుకు నిలిచిపోయాయి…? సాధారణ రోజుల్లో పత్రికలన్నీ 12 నుంచి 16 పేజీల మధ్యలో టాబ్లాయిడ్లను ప్రచురించేవి. ఐతే కరోనా మహమ్మారి కారణంగా సమాజం అంతా లాక్డౌన్ లోకి వెళ్ళిపోయింది. దీంతో వ్యవసాయ, వర్తక వాణిజ్య, వినోద కార్యకలాపాలన్నీ స్తంభించాయి. సభలు, సమావేశాలు మూగబోయాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వటంతో రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా గొడవల ఊసేలేకుండా పోయింది. ఆ కేసులు ఈ కేసులు అంటూ పోలీస్ స్టేషన్ కు ఎవరూ రావట్లేదు. దీంతో లా అండ్ ఆర్డర్ పోలీసులు సైతం రోడ్ల మీదకొచ్చి జనాలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా నియంత్రించే పనిలో నిమగ్నమయ్యారు. బయట ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో జోన్లు, జిల్లాల స్థాయిలో పేజీలకు సరిపడా వార్తలు దొరకట్లేదు. దీంతో పత్రికలు టాబ్లాయిడ్లకు తాత్కాలిక విరామం ప్రకటించక తప్పలేదు.

పత్రికల మనుగడలో యాడ్ రెవెన్యూ కీలకమైంది. టాబ్లాయిడ్లు, వాటిలోని జోన్ పేజీల ద్వారా పత్రికలకు సింహభాగం ఆదాయం సమకూరుతోంది. అయితే ఇప్పటికే నియోజకవర్గ, జిల్లా స్థాయిలో బుక్ చేసుకున్న ప్రకటనలను మెయిన్ పేజీల్లో ఇవ్వనున్నారు. ఈ మేరకు అన్ని పత్రికలు తమ తమ యాడ్ విభాగాలకు నూతన విధి విధానాలను ఖరారు చేశాయి.

మళ్ళీ వస్తాయా…! తాజా పరిస్థితులతో చాలా మందికి పత్రికలు మళ్లీ టాబ్లాయిడ్లను పునరుద్దరిస్తాయా…? అనే సందేహం కలగొచ్చు. ప్రస్తుతం పత్రికలు ఎన్ని రోజుల పాటు టాబ్లాయిడ్లను నిలిపివేస్తున్నామనే విషయాన్ని ప్రకటించినప్పటికీ..పరిస్థితులు కుదుటపడ్డాక మళ్లీ మినీలు ప్రారంభం కావటం ఖాయమని చెప్పొచ్చు. ఎందుకంటే పత్రికలను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేసి వాటి సర్క్యులేషన్ పెంచటంలో టాబ్లాయిడ్లదే కీలక పాత్ర. కాబట్టి చిన్న గ్యాప్ తీసుకొని టాబ్లాయిడ్లు మన ముందుకు తిరిగి రావడం ఖాయం..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి