iDreamPost

కరోనాపై ఊరటనిచ్చే వ్యాఖ్యలు.. నాలుగో వేవ్‌ వచ్చినా..

కరోనాపై ఊరటనిచ్చే వ్యాఖ్యలు.. నాలుగో వేవ్‌ వచ్చినా..

దేశంలో కరోనా నాలుగో వేవ్‌ వచ్చే అవకావం ఉందంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం హెచ్చరించగా.. ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజాగా ఆ ఆందోళనలు తగ్గేలా ఢిల్లీ ఎయిమ్స్‌ ఎపిడిమాలజీ విభాగం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎన్ని వేవ్‌లు వచ్చినా ఇకపై ప్రమాదం ఉండదని ఎయిమ్స్‌ ఎపిడిమాలజిస్ట్‌ డాక్టర్‌ సంజయ్‌ రాయ్‌ పేర్కొన్నారు. అయితే నాలుగో వేవ్‌ రాదని మాత్రం ఆయన చెప్పకపోవడం గమనార్హం. భారీ వ్యాక్సినేషన్, కరోనా రోగుల్లో వచ్చిన రోగనిరోధక శక్తి వల్ల ఇకపై వేవ్‌లు వచ్చినా ప్రభావం చూపవని ఆయన విశ్లేషించారు.

సెకండ్‌ వేవ్‌తో మేలు జరిగిందా..?

ఇప్పటివరకు దేశంలో మూడు కరోనా వేవ్‌లు వచ్చాయి. 2020 మార్చిలో మొదలైన కరోనా వైరస్‌ వ్యాప్తి.. ఆ ఏడాది మొదటి వేవ్‌ రూపంలో విజృంభించింది. కరోనాపై ఎవరికీ పెద్దగా అవగాహన లేకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. 2021 ఏప్రిల్, మే నెలల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చింది. కొత మ్యూటేషన్‌ డెల్టా ప్లస్‌ తీవ్ర ప్రభావం చూపింది. అత్యధిక కేసులు నమోదయ్యాయి. అత్యధిక మరణాలు సంభవించాయి. ఈ వేవ్‌ వల్ల ఇప్పుడు మంచే జరిగిందని ఢిల్లీ ఎయిమ్స్‌ అంటోంది. సెకండ్‌వేవ్‌లో కరోనా సోకిన రోగుల్లో రోగ నిరోధక శక్తి భారీగా పెరిగిందని, అది కరోనా కొత్త మ్యూటేషన్లను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతోందని వివరిస్తోంది.

థర్ట్‌ వేవ్‌లో కనిపించని ప్రభావం..

ఇప్పటివరకు కరోనాలో వెయ్యి కి పైగా మ్యూటేషన్లు వచ్చాయని ఢిల్లీ ఎయిమ్స్‌ చెబుతోంది. అయితే దేశంలో మూడు వేవ్‌లు మాత్రమే వచ్చాయి. మొదటి వేవ్‌లో కరోనా వైరస్, రెండో వేవ్‌లో డెల్టా ప్లస్, మూడో వేవ్‌లో ఒమిక్రాన్‌ల వల్ల వైరస్‌ వ్యాప్తి అధికంగా జరిగింది. మొదటి, రెండో వేవ్‌లలో మరణాలు సంభవించినా.. మూడో వేవ్‌లో మాత్రం వైరస్‌ వ్యాప్తి జరిగినా, దాని ప్రభావం మాత్రం తక్కువగా ఉంది. ఒమిక్రాన్‌ సోకిన వారు మూడు లేదా ఐదు రోజుల్లో కోలుకోవడం వైరస్‌ తీవ్రతను తెలియజేస్తోంది. సెకండ్‌ వేవ్‌ వల్ల దేశంలోని ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరగడం వల్లనే మూడో వేవ్‌లో ప్రజలు వైరస్‌ ప్రభావానికి ఎక్కువగా గురికాలేదు.

నాలుగో వేవ్‌ ఉన్నట్లేనా..?

ఎన్ని వేవ్‌లు వచ్చినా ఏమీకాదని మాత్రమే ఢిల్లీ ఎయిమ్స్‌ అంటోంది కానీ నాలుగో వేవ్‌ రాదని మాత్రం చెప్పడం లేదు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి దేశం బయటపడుతోంది. రోజు వారీ కేసులు మూడువేల దిగువున నమోదవుతున్నాయి. ఈ సమయంలో నాలుగో వేవ్‌ అంటూ కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రజల్లో నెలకొన్న ఆందోళన తగ్గించేందుకు ఎయిమ్స్‌ ప్రకటన ఉపయోగపడుతోంది. చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియాల్లో ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ స్టెల్త్‌ ఒమిక్రాన్‌ విశ్వరూపం చూపిస్తున్న తరుణంలో కరోనా వైరస్‌ నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదనే చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రపంచం కరోనా వైరస్‌ మధ్యలో ఉందని, వైరస్‌ ఇంకా పూర్తిగా పోలేదని, కొన్నాళ్లపాటు జాగ్రత్తలు తప్పనిసరి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలు ఈ సందర్భంగా గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి