iDreamPost

విన్నూత్న కథలకు పట్టం కట్టిన ప్రేక్షకులు

విన్నూత్న కథలకు పట్టం కట్టిన ప్రేక్షకులు

సినిమా తీయడం అంటే ఆరు పాటలు ఐదు ఫైట్లు ఉండాలి అని కొలతలు వేసే రోజులు పోయాయి. విన్నూత్నంగా ఉంటే తప్ప ఒక మాదిరిగా ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించడం లేదు.

కొత్త తరహా కథా కథనాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కథ బాగుంది స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా ఉంటే తప్ప సినిమాలను పట్టించుకోవడం లేదు.. దానికి తోడు ఆన్లైన్ ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ లో సినిమాలు థియేటర్లలో విడుదలయిన కొంతకాలానికే అందుబాటులో ఉండటం వల్ల థియేటర్లకు వెళ్లే ప్రజలు తగ్గిపోతున్నారని కొందరి వాదన. కానీ మూస కథలకు దూరంగా ఉంటున్న తెలుగు ప్రేక్షకులు కొత్త తరహా కథలతో వచ్చే సినిమాలకు పట్టం కడుతున్నారనేది కాదనలేని నిజం.

అందుకు ఉదాహరణగా గతేడాది వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా,ఎవరు, ఖైదీ, మత్తు వదలరా సినిమాలను చెప్పుకోవచ్చు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాలు విడుదల తర్వాత సంచలనాలు సృష్టించాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా కొన్ని రోజుల వ్యవధిలో విడుదలయ్యాయి.. కానీ ఆహ్లదకరమైన కథా కథనాల వల్ల సంచలన విజయం సాధించాయి.

ఇన్విజిబుల్ గెస్ట్ ఆధారంగా అడవి శేష్ హీరోగా వచ్చిన “ఎవరు” ద్వారా అడవి శేష్ కు మరో విజయం దక్కింది. ముఖ్యంగా రెజీనా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

గత కొంతకాలంగా తెలుగులో హిట్ అనే పదానికి దూరంగా ఉండి మార్కెట్ కోల్పోయిన హీరో కార్తీ.. కానీ కథపై ఉన్న నమ్మకంతో హీరోయిన్, పాటలు లేకున్నా సరే ఖైదీ సినిమాలో నటించాడు. కార్తీని తెలుగులో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించిన మూవీగా ఖైదీ గుర్తింపు పొందింది. ఉత్కంఠ భరితమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కల్పించి తెలుగులో కార్తీ మార్కెట్ ను తిరిగి నిలబెట్టింది. కథనంతో ఎలా మేజిక్ చేయవచ్చో ఖైదీ నిరూపించింది.

2019 చివర్లో వచ్చిన మత్తు వదలరా కూడా సరికొత్త కథనంతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. కీరవాణి తనయుడు హీరోగా వచ్చిన ఈ సినిమా సరికొత్త కథలను తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారనే విషయాన్ని రుజువు చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో క్వాలిటీగా సినిమాను ఎలా రూపొందించవచ్చో చూపిస్తూ తెలుగులో రాబోయే నూతన దర్శకులకు పాఠంగా నిలిచింది.

కమర్షియల్ అంశాలు లేకపోయినా నూతన కథనాలు ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి పైన చెప్పుకున్న సినిమాలు ఉదాహరణగా నిలుస్తాయి. మూస ధోరణిలో రూపొందిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరైన ఫలితాలు రాబట్టలేక ఫెయిల్ అయితే పరిమిత బడ్జెట్ తో విన్నూత్న కథా కథనాలతో రూపొందిన పైన పేర్కొన్న ఐదు సినిమాలు కూడా ప్రేక్షకుల్లో మారుతున్న అభిరుచికి నిదర్శనంగా కనిపిస్తాయి. మూసకథలను రూపొందిస్తున్న పాతతరం దర్శకులను హెచ్చరిస్తాయి. ఇకనైనా పాటలు ఫైట్లు అంటూ లేని పోనీ సన్నివేశాలను ఇరికిస్తూ కథలను చెడగొడుతున్న కొందరు దర్శకులు ఆ కమర్షియల్ భ్రమలనుండి బయటకు వస్తే బాగుంటుందని మెజారిటీ ప్రేక్షకులు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి