iDreamPost

మినీ మున్సిపోల్స్‌ లో క్లీన్‌ స్వీప్‌​ దిశగా టీఆర్‌ఎస్‌

మినీ మున్సిపోల్స్‌ లో క్లీన్‌ స్వీప్‌​ దిశగా టీఆర్‌ఎస్‌

తెలంగాణలో జరుగుతున్న మినీ మున్సిపోల్స్‌​ లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటికే కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్‌, జడ్చర్ల మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న గులాబీ పార్టీ.. సిద్దిపేటలోనూ ముందంజలో ఉంది. గ్రేటర్‌​ వరంగల్‌​ మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఖమ్మం కార్పొరేషన్‌ లో మరోసారి అధికార పీఠాన్ని ఎక్కేలా కనిపిస్తోంది. రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో మొత్తం మినీ మున్సిపోల్స్‌ ను క్లీన్‌​ స్వీప్‌​ చేసేలా ఉంది.

60 డివిజన్లు ఉన్న ఖమ్మం కార్పొరేషన్ లో ఇప్పటిదాకా టీఆర్‌ఎస్‌ 15 సీట్లలో గెలిచింది. బీజేపీ ఒక సీటు దక్కించుకుంది. కాంగ్రెస్‌​ ఆరు సీట్లు గెలుచుకుంది. మిగతా పార్టీలు ఖాతా తెరవలేదు.

66 సీట్లు ఉన్న గ్రేటర్‌​ వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ 24 సీట్లలో విజయం సాధించింది. బీజేపీ 9, కాంగ్రెప్‌​ 4 సీట్లలో గెలిచాయి. ఇతరులు రెండు స్థానాలను దక్కించుకున్నారు.

సిద్దిపేటలో మొత్తం 43 స్థానాలు ఉండగా.. 20 వార్డుల రిజల్ట్‌ వచ్చింది. ఇందులో ఏకంగా 19 చోట్ల టీఆర్‌ఎస్‌ గెలుపు కేకపెట్టింది.​

అచ్చంపేట మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరింది. మొత్తం 20 వార్డులు ఉండగా.. టీఆర్‌ఎస్‌ 13 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్‌ 6, బీజేపీ 1 చోట విజయం సాధించాయి.

నకిరేకల్‌ కూడా గులాబీ పార్టీ వశమైంది. ఇక్కడ 20 వార్డుల్లో 11 వార్డులను టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఫార్వర్డ్‌ బ్లాక్‌ 6 సీట్లు, కాంగ్రెస్‌ 2 సీట్లు గెలుచుకున్నాయి. ఇంకో సీటులో ఇండిపెండెంట్‌ గెలిచారు. బీజేపీ ఖాతా తెరవలేదు.

కొత్తూరులోనూ టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరింది. ఇక్కడ 12 వార్డులు ఉండగా.. 7 చోట్ల కారు పార్టీ గెలిచింది. కాంగ్రెస్‌ 5 వార్డులు దక్కించుకుంది. 

జడ్చర్ల మున్సిపాలిటీ కూడా టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. ఇక్కడ 27 వార్డులు ఉండగా, 19 వార్డుల్లో ఫలితం వచ్చింది. ఇందులో టీఆర్‌ఎస్‌ 16 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 2, కాంగ్రెస్‌ 1 సీటులో గెలిచాయి. పూర్తి ఫలితాలు రాకముందే.. పీఠం దక్కించుకుంది.

బీజేపీలో చిచ్చుపెట్టిన ‘లింగోజీగూడ’ కాంగ్రెస్‌ కైవసం

ఇక గ్రేటర్‌ హైదరాబార్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో లింగోజిగూడకు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి రమేశ్ గౌడ్.. కార్పొరేటర్ గా బాధ్యతలు స్వీకరించకుండానే మరణించారు. అయితే రమేశ్ గౌడ్ కొడుకును ఏకగ్రీవం చేయాలని బీజేపీ భావించింది. దీంతో అభ్యర్థిని బరిలో నిలపొద్దని కోరుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఆధ్వర్యంలోని బీజేపీ లీడర్లు, రమేశ్ గౌడ్ కుటుంబ సభ్యులు కలిశారు. దీనికి టీఆర్‌ఎస్‌ ఒప్పుకుంది. అయితే ఈ విషయం బీజేపీలో చిచ్చురేపింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినైన తనకు తెలియకుండా టీఆర్‌ఎస్‌ లీడర్లను ఎలా కలుస్తారని బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణకు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే సదరు నేతలు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇంత గొడవకు కారణమైన లింగోజిగూడ డివిజన్‌ ను కాంగ్రెస్‌ గెలుచుకుంది. దీంతో జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌​ సభ్యుల బలం 3కు పెరిగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి