iDreamPost

చనిపోయిన వారిని తిరిగి చంపేస్తామ్… ?

చనిపోయిన వారిని తిరిగి చంపేస్తామ్… ?

ప్రతి పుట్టుకకు ఓ కారణం ఉంటుందంటుంటారు ..! ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, ప్రతి మరణానికీ ఓ కారణం ఉంటుంది. అది సహజమైంది కావొచ్చు.. అసహజమైంది కావొచ్చు…! ఐతే సదరు కారణాన్నిఏమార్చడం, మరోరకంగా చూపడం చేస్తే మాత్రం ఒక రకంగా సదరు వ్యక్తిని తిరిగి హత్య చేయడమే..! రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఇప్పుడిదే పనిలో ఉంది. ఎక్కడెవరు చనిపోయినా దాన్ని అమరావతితో ముడిపెట్టి శవరాజకీయం చేస్తోంది.

నాకు కసి తీరక పొతే చచ్చిన శవాన్ని లేపి మళ్ళీ చంపేస్తా… ! ఇది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బావమరిది, ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ సినిమాలోని ఓ డైలాగ్. దీన్ని విన్నప్పుడు చాలామందికి చనిపోయిన వాడిని మళ్ళీ ఎలా చంపుతారబ్బా అనే సందేహం కలిగుండొచ్చు. ఎవరైనా ఒక్కసారే పుడతారు ఒకసారే చనిపోతారు. ఐతే అది సినిమా… అందునా బాలకృష్ణ సినిమా కాబట్టి సర్దిచెప్పుకున్నాం. కాగా తాజాగా అయన బావగారి ఆధ్వర్యంలోని … స్వయంగా తనే ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ…చనిపోయిన వాళ్ళను తిరిగి హత్య చేయొచ్చని నిరూపిస్తోంది. దీంతో ఏపీలో శవరాజకీయాలకు తెరలేచినట్టయింది.

20 రోజులుగా అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ధర్నా చేస్తున్నవారిలో కొన్ని సంఘ విద్రోహశక్తులు పక్కా ప్రణాళికతో ప్రవేశించాయి. సందట్లో సడేమియా అన్నట్లు రైతుల ముసుగులో దాడులకు పాల్పడుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం చలించకపోవడంతో తెరవెనకున్న పెద్దలకు ఏంచేయాలో తోచినట్లులేదు దాంతో ప్లాన్ బికి పదునుపెడుతున్నారు.

అమెరికా అయినా అనకాపల్లి అయినా రోజూ ఎవరో ఒకరు చనిపోతుంటారు. దానికి అమరావతి సైతం మినహాయింపేమీ కాదు. తాజాగా రైతులు ఆందోళనలు చేస్తున్న సమయంలోనూ కొంత మంది మరణించారు. అయితే అంత మాత్రాన ఆ మరణాలన్నిటికీ అమరావతి రగడే కారణం అందామా..? కచ్చితంగా చనిపోయిన వారంతా రాజధాని మార్పును తట్టుకోలేకే చనిపోయారనేది వాస్తవదూరం. అంతెందుకు చంద్రబాబు అమరావతి ప్రాంతాన్నిఏపీ నూతన రాజధానిగా ప్రకటించిన సమయంలోను అక్కడ ఎవరో ఒకరు మరణించే ఉండుంటారు. వారంతా చంద్రబాబు తమ ప్రాంతాన్ని ఏపీ రాజధానిగా ప్రకటించడాన్ని తట్టుకోలేక గుండె పగిలి మరణించారందామా… ? సరే అమరావతి ప్రాంతంలో జరిగే మరణాలను టీడీపీ తన రాజఖీయ ఖాతాలో వేసుకుందని అనుకుందాం… ! ఎక్కడో ఒంగోలులో అమరావతికి పేరుతో టీడీపీ వాళ్ళు చేపట్టిన ర్యాలీలో గుండెపోటుతో వీడియోగ్రాఫర్‌ కమ్ రిపోర్టర్‌ హఠాన్మరణం చెందితే ఆ అంశాన్నీ రాజకీయానికి వాడుకోవాలనుకోవటం టీడీపీని, ఆ పార్టీ నాయకులను అభాసుపాలు చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి