iDreamPost

గతంలో చంద్రబాబు ఎన్నిసార్లు రాజీనామా చేశారు ?

గతంలో చంద్రబాబు ఎన్నిసార్లు రాజీనామా చేశారు ?

అనూహ్యంగా జరిగిన విశాఖ ఘటనపై మెరుపువేగంతో స్పందించిన ప్రభుత్వం బాధితులకు వైద్య సదుపాయం, ఎవరూ ఊహించనంతగా పరిహారం, భవిష్యత్తుపై భరోసా నింపి అందరి మన్ననలను పొందింది. ప్రతిపక్ష పార్టీలు మృతుల కుటుంబాలకు పాతిక లక్షలు, ఇరవై లక్షలు.. పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయగా అంతకు నాలుగు రెట్లు పరిహారాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించి వాళ్ళ నోళ్లకు శాశ్వతంగా తాళం వేశారు.

ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలో అర్థం కాక సిగపట్లు పడుతోంది. పరిహారం డిమాండ్ చేద్దామంటే మునుపెన్నడూ లేని విధంగా బాధితులకు వైసీపీ ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. పశువులకు, పంటలకు కూడా పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది. మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేద్దామంటే.. అత్యుత్తమ వైద్యం ప్రభుత్వమే పూర్తి ఉచితంగా అందిస్తోంది. ఫ్యాక్టరీని మరో ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేద్దామా అంటే.. ముందే ప్రభుత్వం ఆ ప్రకటన చేసింది. కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు అవసరమైతే ఫ్యాక్టరీని మరో ప్రాంతానికి తరలిస్తామని స్పష్టం చేసింది.

ప్రతిపక్షానికి పల్లెత్తు మాట అనేందుకు ఎక్కడ అవకాశం ఇవ్వని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుతో టిడిపి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అందుకే అర్థం పర్థం లేకుండా పరిశ్రమ శాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి రాజీనామా చేయడమే కాకుండా ఆయన పై, పరిశ్రమల శాఖ అధికారులు పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్లో మీడియాకు ఫీడ్ ఇస్తున్నారు.

ఏదైనా ఒక విషయం అడగాలన్నా, డిమాండ్ చేయాలన్నా.. సదరు వ్యక్తికి, పార్టీ కి అర్హత ఉందా లేదా అన్నది ముందు ఆలోచించుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తొలి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. తొమ్మిదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండి.. ఆవురావురమంటూ ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుక, మట్టి, మద్యం.. అన్ని రంగాల్లో అడ్డగోలు దోపిడీకి పాల్పడుతూ నిబంధనలను తుంగలో తొక్కారు. టిడిపి నేతల ధన దాహానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయారు. అమాయకుల ప్రాణాలకు అరకొర పరిహారం ప్రకటించి చేతులు దులుపుకున్నారు కానీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కేశినేని డిమాండ్ న్యాయసమ్మతం అయితే చంద్రబాబు ప్రభుత్వం లో జరిగిన ఘోర ప్రమాదాలకు ఎంతో మంది మంత్రులు రాజీనామా చేసి ఉండాల్సింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రచారం యావ కు 29 ప్రాణాలు బలయ్యాయి. ఈ ఘటనకు నిజంగా బాధ్యత వహించాలి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. అలా చేయకపోగా కనీసం సంబంధిత అధికారులపై నామమాత్రం కేసు కూడా నమోదు చేయలేదు. జస్టిస్ సోమయాజులు వేసిన ఏకసభ్య కమిషన్ ప్రమాద ఘటన కు భక్తులే కారణమని తీర్మానం చేసింది.

ఇక రాజధాని విజయవాడలో కృష్ణానది లో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా పర్యాటకులు తీసుకెళ్లే బోటు మునిగి దాదాపు పదుల సంఖ్యలో సామాన్య ప్రజలు మరణించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో ప్రమాదం జరిగింది. రాజధాని ప్రాంతంలో జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి, అప్పటి పర్యాటక శాఖ మంత్రి రాజీనామా చేసి ఉండాలి కానీ అది జరగలేదు.

తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం లో గోదావరి నది పాయ పై స్కూల్ విద్యార్థులు తీసుకెళ్లే పడవ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇందులో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేదు. ఈ ఘటనకు నిజంగా బాధ్యత వహిస్తూ ఉప ముఖ్యమంత్రి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేత నిమ్మకాయల చినరాజప్ప రాజీనామా చేసి ఉండాల్సింది. చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా అరాచకాలపై నిరసన వ్యక్తం చేస్తున్న బాధిత ప్రజలపై లారీల ద్వారా పట్టపగలే తొక్కించి చంపారు. ఈ ఘటనకు అప్పటి మంత్రి అమర్నాథరెడ్డి బాధ్యత వహించి రాజీనామా చేసి ఉండాల్సింది. కానీ అది జరగలేదు. కనీసం ఇసుక మాఫియాపై చర్యలు చేపట్టలేదు.

ఇక రాష్ట్ర రాజధాని విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ ఈ వ్యవహారంలో మహిళల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ అప్పటి మహిళా సంక్షేమ శాఖ మంత్రి , స్థానిక ఎంపీ అయిన కేశినేని నాని కూడా రాజీనామా చేసి ఉండాల్సింది కానీ అది కూడా జరగలేదు. ఈ దందా నడిపించిన వారిపై కనీస చర్యలు కూడా తీసుకోలేదు.

ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఘటనలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగాయి. ఇవన్నీ ఒకసారి కేశినేని నాని గుర్తు తెచ్చుకుంటే మంచిది. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోకుండా ఆ పార్టీ నాయకుడు గా వ్యవహరిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కూడా పరిశ్రమల శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఘటనపై మునుపెన్నడూ లేనివిధంగా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, బాధితుల పట్ల చూపిన ఈ ఔదార్యం రామకృష్ణ ఓసారి గుర్తు తెచ్చుకోవాలి. తన మిత్రుడు చంద్రబాబు పరిపాలన లో ఏనాడైనా ఇలా జరిగిందా లేదో ఒకసారి పరికించి చూసి ఇలాంటి డిమాండ్ చేయాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి