iDreamPost

హర్షాను దువ్వుతున్న బాబు

హర్షాను దువ్వుతున్న బాబు

2019 ఎన్నికల్లో ఘోర ఓటమి, ఆ తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరూ జారీ పోతుండడంతో టీడీపీ క్రమేణా బలహీనపడుతోంది. ఈ క్రమంలో పార్టీలోకి వచ్చే వారిని చేర్చుకునేందుకు ఆ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వైఎస్సార్‌సీపీతో విభేదించే వారిపై ముందుగా కన్నేసింది. ఈ క్రమంలోనే అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌కు టీడీపీ గాలం వేస్తోంది. హర్షకుమార్‌ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగిన హర్షకుమార్‌ దళిత నేతగా పేరొందారు. అధికారంలో ఉన్నా లేకపోయినా దళిత సమస్యలపై ఆయన పోరాటాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న హర్షకుమార్‌కు 1983లోనే అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం వచ్చింది. విశాఖ జిల్లా పాయకరావు పేట నుంచి పోటీ చేశారు. నాటి ఎన్టీఆర్‌ హవాలో ఓటమి చవిచూవారు. ఆ తర్వాత 2004 వరకు కూడా పోటీ చేసే అవకాశం లభించలేదు. 2002లో రాజమహేంద్రవరం నరగపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆయన దూకుడే ఆ ఎన్నికల్లో నష్టం చేకూర్చింది. ఓటమి చవి చూశారు.

సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ 2004లో పోటీ చేసే అవకాశం వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అప్పట్లో కూడా వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పెట్టిన సమైక్యాంధ్ర పార్టీ తరఫున అమలాపురం ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో సన్నిహితంగా మెలిగారు. ముద్రగడ సొంత గ్రామం కిర్లంపూడిలో అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణ చేసేలా వారి మధ్య స్నేహం సాగింది. కాపు, దళిత కాంబినేషన్‌లో ముద్రగడ, హర్షకుమార్‌లు కలసి కొత్త పార్టీ పెడుతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు.

ఆ తర్వాత ఆయన వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవహరించారు. ఆ పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవంతో ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. చంద్రబాబు కాళ్లకు మొక్కి సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో అమలాపురం ఎంపీ టిక్కెట్‌ ఆశించినా దక్కలేదు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి కుమారుడికి టీడీపీ టిక్కెట్‌ కేటాయించింది. ఎన్నికలు జరగకముందే టీడీపీ నుంచి హర్షకుమార్‌ బయటకు వచ్చారు.

ఇటీవల రాజమహేంద్రవరం కోర్టు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో కేసు నమోదైంది. పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాదాపు 48 రోజులపాటు జైలు జీవితం గడిపారు. జైలులో ఉన్నప్పుడు టీడీపీ తాజా మాజీ ప్రజా ప్రతినిధులు హర్షకుమార్‌ను పరామర్శించారు. నిమ్మకాయల చినరాజప్పు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, జవహర్‌ తదితరులు పరామర్శించారు. చంద్రబాబు కూడా ఫోన్‌లో పరామర్శించారని వినికిడి. బయటకొచ్చిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా హర్షకుమార్‌ విమర్శలు చేశారు. తనపై కావాలనే కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని విమర్శించారు.

అధికార పార్టీని విమర్శించడంతోపాటు బలమైన దళిత నేత కావడంతో హర్షకుమార్‌ను పార్టీలోకి చేర్చుకునేందుకే టీడీపీ నేతలు క్యూ కట్టారని ప్రచారం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ చేసిన మోసం హర్షకుమార్‌తోపాటు ఆయన అనుచరులను వెంటాడుతోంది. టికెట్‌ ఇస్తామని చెప్పి పార్టీలో చేర్చుకుని ద్రోహం చేశారని ఇప్పటికీ నాటి ఘనటనను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మళ్లీ హర్షకుమార్‌ చంద్రబాబును నమ్ముతారా..? ఆ పార్టీలో చేరుతారా..? టీడీపీ నేతల ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయి..? అనేది వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి