iDreamPost

తరువాత ఎవరు? తెలుగు తమ్ముళ్లలో టెన్షన్…

తరువాత ఎవరు? తెలుగు తమ్ముళ్లలో టెన్షన్…

నేరుగా టీడీపీ అధినేతనే ఐటీ దాడులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో లభించిన ఆధారాలతో అలజడి రేగింది. ఆ తర్వాత అది కొంత సర్థుమణిగినట్టు కనిపిస్తున్న సమయంలో సిట్ అంటూ ఏపీ ప్రభుత్వం సీన్ లోకి వచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా అడుగులు వేసేందుకు సన్నద్దమవుతున్న సమయంలోనే సీబీఐ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ క్యాబినెట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అందులోనూ హెరిటేజ్ నుంచి కొనుగోళ్లతో పాటుగా ఫైబర్ నెట్ బండారం బయటపెడతామంటూ ప్రభుత్వం చెబుతున్న తరుణంలో చినబాబుకి చిక్కులు వస్తాయా అనే సందేహాలు కనిపించాయి. అవి పూర్తిగా సమసిపోకుండానే హఠాత్తుగా ఈఎస్ఐ స్కామ్ ని బయటకు తీశారు. నాలుగు నెలల క్రితమే విజిలెన్స్ బయటపెట్టిన విషయంపై వేగంగా అడుగులు వేస్తూ ఏకంగా అచ్చెన్నాయుడు అరెస్ట్ వరకూ రావడంతో టీడీపీకి తలనొప్పులు తీవ్రం అయ్యాయి.

Also Read:జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అరెస్ట్

చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉంటూ, టీడీపీలో కీలక నేతగా ఎదిగిన అచ్చెన్నాయుడి అరెస్ట్ ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనంగా మారబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో ప్రభుత్వం పావులు కదుపుతుండగా కేవలం కులం కోణంలో రాజకీయం చేయాలని చూడడం ద్వారా టీడీపీ తన బేలాతనం చాటుకోవడం చాలామందిని విస్మయానికి, కొన్ని పార్టీల నుంచి విమర్శలకు కారణం అవుతోంది. అదే సమయంలో ప్రభుత్వ దూకుడు చూస్తుంటే మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశలో ఉందనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. అదే టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తమ్ముళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది.

ఏపీలో ఇప్పటికే అమరావతి స్కామ్ లో మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు మీద కేసులు నమోదయ్యాయి. పోలవరం, ఇతర కాంట్రాక్టుల విషయంలో మరో ముఖ్య నేత యనమల కుటుంబీకుల పేర్లు వినిపించాయి. ఇక యరపతినేని మైనింగ్ వ్యవహారం, జేసీ బ్రదర్స్ కేసుల బండారం వంటి అనేక వ్యవహారాలు ఉన్నాయి. నకిలీ ఇన్సురెన్సుల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ,ఆయన కొడుకును పోలీసులు ఈ ఉదయం ఆరెస్ట్ చేశారు.

Also Read:అవినీతి నాయకుడిని అరెస్టు చేస్తే గగ్గోలెందుకు..?: నాటి పాపం ఊరికే పోదు: నాగబాబు సంచలన వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో ఎవరి మీద తదుపరి చర్య ఉంటుందన్నదే ఇప్పుడు ఊహాగానాలకు ఆస్కారం ఇస్తోంది. టీడీపీ నేతల్లోనూ పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తోంది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు వ్యవహారంలో బీసీ, బీసీ అంటూ టీడీపీ బలంగా ప్రస్తావించడం ద్వారా తదుపరి మరో బీసీ నేత మీద కూడా ఇతర వర్గాలకు చెందిన అవినీతి వ్యవహారంలో చర్యలకు పూనుకోవచ్చనే అంచనాలు కొందరు వేస్తున్నారు. అదే జరిగితే హెరిటేజ్ ఫుడ్స్, చంద్రన్న కానుకల వ్యవహారంలో నాటి పౌరసరఫరాల శాఖకి ప్రాతినిధ్యం వహించిన ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత పేర్లు ప్రస్తావనకు రావచ్చని భావిస్తున్నారు.

అందుకు భిన్నంగా గతంలోనే మందుల కొనుగోళ్లలో వినిపించిన ఐఆర్ఎస్ అధికారి గోపీనాథ్ వ్యవహారం ముందుకు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని అంటున్నారు. డిప్యూటేషన్ మీద ఏపీ సర్వీసులకు వచ్చిన ఆయన ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా పనిచేసిన కాలంలో అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలున్నాయి. ఆయనకు తోడుగా యనమల మరో అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ పేరు కూడా పలు వ్యవహారాలతో ముడిపడి ఉంది. కాంట్రాక్టర్ అయిన టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడయిన మహేష్ ఇటీవల వైసీపీ నేతల మీద నోరు పారేసుకోవడంలో కొంత పేరు గడించారు. దాంతో ఆయన విషయం మీద దర్యాప్తు వేగవంతం అయితే గుట్టురట్టయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఏ కేసు ఫైలు దులిపినా అది యనమల అల్లుళ్లతో ముడిపడే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు.

Also Read:అచ్చెం నాయుడు తరువాత ఎవరు..?! ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోస్యం నిజమవుతుందా..?

అంతటితో సరిపెట్టకుండా నేరుగా చంద్రబాబుని కూడా చిక్కుల్లోకి నెట్టే వ్యవహారాలు వెలికి తీస్తారని కూడా కొందరు చెబుతున్నారు. ఏది జరిగినా అది టీడీపీ నేతల మెడకు చుట్టుకోవడం ఖాయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా అధికారంలో ఉన్న సమయంలో హద్దులు దాటేసినందుకు ఇప్పుడు ప్రతిఫలం చెల్లించుకోవాల్సి రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. పైగా ఈ అరెస్టుల కారణంగా టీడీపీ నేతలకు కాస్తయినా సానుభూతి ఆశిస్తే అందుకు భిన్నమైన వాతావరణం ఉండడంతో ఎటూ పాలుపోని పచ్చ పార్టీ నేతలు నానా హైరానా పడుతున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి