iDreamPost

రాజధాని విషయంలో తెలుగుదేశం యూ-టర్న్

రాజధాని విషయంలో తెలుగుదేశం యూ-టర్న్

మొన్నటిదాకా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ మాట్లాడిన విపక్ష పార్టీల స్వరం ఇప్పుడు మారుతోంది. అమరావతి పేరిట పెయిడ్‌ ఉద్యమం చేస్తున్న నేతలు ఇప్పుడిప్పుడే వాస్తవాన్ని గ్రహిస్తున్నట్లున్నారు. అందుకే కర్నూలులో హైకోర్టుకు తాము వ్యతిరేకం కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అమరావతి ముద్దు.. మూడు రాజధానులు వద్దు అన్న నేతలు.. ఇప్పుడు రెండు రాజధానులు ముద్దు అంటున్నారు. ఇక రేపో మాపో మూడు రాజధానులు ముద్దు అనే అవకాశం లేకపోలేదని ఆ పార్టీల నేతలే చెప్పుకుంటున్నారు. ఒకే రాజధాని అంటూ అమరావతి వాసులను రోడ్డు మీదకు తెచ్చి.. ఇప్పుడు మెల్లగా సైడ్‌ అవుతున్నారు. అప్పట్లో భూములిచ్చి, ఇప్పుడు రోడ్లెక్కి మోసపోవడం అమరావతి వాసుల వంతైంది.

అమరావతి వాసుల్లో పశ్చాత్తాపం..

అమరావతిలో భూములు కోల్పోయిన వారికి అన్ని విధాలా న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు చెబుతున్నా.. చంద్రబాబు మాయలో పడి ఆ మాటలు అమరావతి వాసులు చెవికెక్కించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు వ్యవహారం మొత్తం తెలుసుకొని.. ముందే ముఖ్యమంత్రి జగన్‌ మాట విని ఆయన్ను కలసి ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆ మేరకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే కొందరు రైతులు ఇటీవల ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీఎంను కలసిన విషయం తెలిసిందే. త్వరలోనే పెద్ద మొత్తంలో రైతులు సీఎంతో భేటీ కావడానికి ఎంపీ లావు కృష్ణదేవరాయలు ద్వారా రాయబారాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తొందరలోనే సీఎం కలసి తమ బాధలు చెప్పుకొని హామీలు పొందాలని చూస్తున్నారు.

ఉన్నత లక్ష్యంతోనే మూడు రాజధానులు..

రాష్ట్ర విభజన తర్వాత పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌పై ఆర్థిక భారం పడకూడదని, అభివృద్ధి, పరిపాలన రాష్ట్రమంతటా సమానంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించింది. అయితే జగన్‌ చేసే ఏ పనినైనా వ్యతిరేకించడమనే కాన్సెప్ట్‌తో మూకుమ్మడిగా ముందుకుపోతున్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు మూడు రాజధానులను వ్యతిరేకించాయి. అభివృద్ధి అంతటా ఒకే చోట కేంద్రీకృతం చేసుకుంటూ పోవడం వల్ల వచ్చే దుష్పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా అన్నీ అమరావతిలో ఉండాలంటూ మూర్ఖపు వాదన మొదలుపెట్టాయి. ఇందుకోసం అమరావతి రైతులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి. టీడీపీ మాయలో ఉండి మిగతా పార్టీలకు అప్పట్లో వాస్తవం బోధపడలేదు. విపక్ష పార్టీల స్వార్థపూరిత వైఖరిపై అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలో నిరసలను పెల్లుబికాయి. దీంతో అసలుకే మోసం వస్తుందని గ్రహించిన పార్టీలు మెల్లగా తమ పార్టీ నేతలతో కర్నూలులో ‘హైకోర్టు పెట్టాలంటూ తాము గతంలోనే చెప్పామంటూ’ చెప్పించడం మొదలుపెట్టాయి.

అమరావతి వాసులకు చంద్రబాబు డబుల్‌ దెబ్బ

చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తున్నట్లు ముందుగానే తన అనుచరులకు చెప్పేసి వేల ఎకరాల భూములను కొట్టేశారు. రాజధాని పేరిట అమరావతి వాసుల భూములనూ లాక్కున్నారు. ఆ సందర్భంగా చంద్రబాబు వారికి ఎన్నో మాయ మాటలు చెప్పారు. మీ భూములను అభివృద్ధి చేసి కోట్ల రూపాయల లాభం తీసుకొస్తానంటూ బురిడీ కొట్టించాడు. ఆ తర్వాత చంద్రబాబు రైతుల భూములను అడ్డుపెట్టుకొని తాను వేలకోట్లు సంపాదించాడు. ఐదేళ్లలో అమరావతిని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. కనీసం రోడ్డు కూడా వేయలేదు. దీంతో మోసపోవడం అమరావతి వాసుల వంతైంది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. అమరావతిలో రాజధాని ఎంత మాత్రం సాధ్యం కాదని నిపుణులతో నిర్ధారించి మూడు రాజధానులను ప్రకటించింది. అంతే మరోసారి చంద్రబాబులోకి మోసాల రాయుడు మళ్లీ బయటికి వచ్చాడు. అమరావతి ఉద్యమం పేరిట ఆ ప్రాంత వాసులను రెచ్చగొట్టాడు. 50 రోజులుగా ఆందోళనల పేరిట రోడ్లపై తిప్పుతున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి కర్నూలులో హైకోర్టుకు తాము వ్యతిరేకం కాదంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో మరోసారి చంద్రబాబు చేతిలో అమరావతి వాసులు దారుణ మోసానికి గురయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి