iDreamPost

జిల్లాల ఏర్పాటులోనూ రెండు కళ్ల సిద్ధాంతం రాబోతోందా..?

జిల్లాల ఏర్పాటులోనూ రెండు కళ్ల సిద్ధాంతం రాబోతోందా..?

రాష్ట్ర విభజన నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు చిన్నా, పెద్దా ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో ఆలోచించి, రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంభించే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొత్త జిల్లాల ఏర్పాటులోనూ ఇదే తరహా విధానం అవలంభించబోతున్నారా..? జిల్లాల ఏర్పాటును రాజకీయం చేసి, అడ్డంకులు సృష్టించాలనుకుంటున్నారా..? అంటే ఆ పార్టీ ఎంపీ ప్రకటన ఇందుకు బలం చేకూరుస్తోంది.

కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు ఇటీవల శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్‌ నాయుడు ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటులో రాజకీయమే తనకు కనిపిస్తోదని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాను మూడు జిల్లాలకు విభజిస్తే.. తమ జిల్లాలో ఉన్న పోరాట స్ఫూర్తి దెబ్బతింటుందని చెప్పుకొచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కనిపించడం లేదన్నారు.

ఎంపీ ఇలా మాట్లాడడంతోనే పైన పేర్కొన్న సందేహాలు ప్రజల్లో వస్తున్నాయి. ఇంగ్లీష్‌ మీడియా, పేదలకు ఇళ్ల స్థలాలు, మూడు రాజధానులు.. ఇలా ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను అడ్డుకునేలా కోర్టుల్లో పిటిషన్లు వేసిన తెలుగుదేశం పార్టీ జిల్లాల ఏర్పాటును కూడా అడ్డుకునేందకు ఇదే తరహాలో వ్యవహరిస్తుందేమోనన్న సందేహాలు రామ్మోహన్‌ నాయుడు ప్రకటనతో నెలకొన్నాయి.

కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో నియామకాలు కూడా జరిగాయి. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను సెప్టెంబర్‌ 27వ తేదీన చంద్రబాబు నియమించారు. రాష్ట్రంలో 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలు ఉంటే.. 25 మంది అధ్యక్షులను ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుల విధానానికి స్వస్తి పలకడంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు చంద్రబాబు కూడా జై కొట్టారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం అంటూ చేసిన ప్రకటన చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని బయటపెడుతోంది.

తన విధానాలను ముందు పార్టీ నేతల చేత చెప్పించే చంద్రబాబు.. ఈ విషయంలో కూడా తన మాటలను ఎంపీ రామ్మోహన్‌ నాయుడు చేత పలికించారంటున్నారు పరిశీలకులు. రాబోయే రోజుల్లో చంద్రబాబే ఈ విషయం గురించి మాట్లాడితే కొత్త జిల్లాలపై వివాదం రేగడం, దానిపై కోర్టులకు వెళ్లడం తప్పకుండా జరుగుతుందనడంలో సందేహం లేదు. అదే చంద్రబాబు కొత్త జిల్లాల ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే.. ఈ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. ప్రభుత్వం అనుకున్న కాల వ్యవధిలోపు పూర్తవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి