iDreamPost

అదే జరిగితే.. బుద్ధా వెంకన్న ఆత్మహత్య చేసుకుంటారట..!

అదే జరిగితే.. బుద్ధా వెంకన్న ఆత్మహత్య చేసుకుంటారట..!

రాజకీయాల్లో రాణించాలంటే తెలివితేటలు, ప్రజాబలం ఉండాల్సిన అవసరం లేదు. పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకుంటే చాలు.. పదవులు వాటంతటకు అవే వస్తాయి. అధినాయకుడును మెప్పించేందుకు అహర్నిశలు పని చేసే వారిని‘భజన’ నాయకులుగా పిలుస్తుంటారు. అధినేతపై విశ్వాసం, విధేయత చూపడంలో ఒక్కొక్కరిది ఒక్కో సై్టల్‌. ఈ క్రమంలో కొంత మంది చేసే పనులు హాస్యాన్ని పండిస్తాయి. తమ చే ష్టలు ప్రజలకు వినోదాన్ని కలిగిస్తున్నా.. సదరు నాయకులు మాత్రం తమ దారి తమదే అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఇలాంటి నాయకులు అన్ని పార్టీలలో ఉన్నా.. తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాత్రం మొదటి స్థానంలో ఉంటారు. తమ అధినాయకుడు చంద్రబాబును మెప్పించేందుకు వెంకన్న చేసే పనులు, వ్యాఖ్యలు ప్రజలకు వినోదాన్ని పంచుతున్నాయనడంలో సందేహం లేదు.

తాజాగా బుద్ధా వెంకన్న తన స్వామి భక్తిని మరోమారు చాటుకున్నారు. రామతీర్థం ఘటనపై సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం.. అది కుట్రని ప్రాథమికంగా తేల్చింది. పలువురు టీడీపీ స్థానిక నేతలను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇది అటు తిరిగి.. ఇటు తిరిగి చంద్రబాబు వద్దకు వస్తుందన్న ఆందోళనలో ఆ పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే దేవాలయాలపై దాడులు అరికట్టాలంటూ.. గవర్నర్‌ను కలిసి ఓ వినతిపత్రం అందించారు. ఈ సమయంలో విలేకర్లతో మాట్లాడిన బుద్ధా వెంకన్న.. చంద్రబాబును ఈ కేసులో ఇరికిస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇంటి వద్దే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అంతే కాదు చంద్రబాబును టచ్‌ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని కూడా బుద్ధా వెంకన్న సెలవిచ్చారు.

ఏదైనా నేరం జరిగితే.. ఆధారాలు సేకరించిన తర్వాతనే పోలీసులు తమ పని మొదలుపెడతారు. రామతీర్ధం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీఐడీ చేత విచారణ జరిపిస్తోంది. దేవాలయాన్ని పరిశీలించిన సీఐడీ ఛీఫ్‌.. ఉద్దేశపూర్వకంగానే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అంచనా వేశారు. సీఐడీ విచారణ కొనసాగుతోన్న తరుణంలో టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 140 దేవాలయాల్లో దాడులు జరిగినట్లు ఫిర్యాదు చేయడం విశేషం. ఇక్కడే ప్రజలకు, పోలీసులకు అనేక అనుమానాలు వస్తున్నాయి. 140 దేవాయాలల్లో దాడులు జరిగినప్పుడు బయటకు రాని చంద్రబాబు.. రామతీర్థం ఘటనపైనే ఎందుకు అంత ఆసక్తి, శ్రద్ధ కనబరుస్తున్నారు..? కరోనా అంటూ ఇన్నాళ్లు హైదరాబాద్‌లోని ఇళ్లు దాటని బాబు.. ఇప్పుడు అవేమీ లెక్కచేయకుండా ఎందుకు బయటకు వచ్చారు..? ఇలాంటి సందేహాలే అందరిలోనూ కలుగుతున్నాయి. నిజానిజాలు తేలిన తర్వాతే బాధ్యులపై చర్యలుంటాయి. అయితే బుద్ధా వెంకన్న మాత్రం అప్పుడే చంద్రబాబుపై కేసు పెట్టినట్లు, అరెస్ట్‌ చేసేందుకు యత్నిస్తున్నట్లు భావించి.. స్వామి భక్తిని ముందుగానే చాటుకోవడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి