iDreamPost

తీరు మార్చుకోని టీడీపీ.. కొరడా ఝలిపించిన స్పీకర్‌..

తీరు మార్చుకోని టీడీపీ.. కొరడా ఝలిపించిన స్పీకర్‌..

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో రెండో రోజూ కార్యకలాపాలను అడ్డుకునేలా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారు. ఉదయం సభ మొదలైనప్పటి నుంచి పోడియం వద్దకు వెళ్లి టీడీపీ సభ్యులు ఆందోళనలు చేస్తున్నారు. నివర్‌ తుపాను వల్ల జరిగిన నష్టం, వారికి ప్రభుత్వం అందించే సాయం, ఇన్య్సూరెన్స్‌ పరిహారంపై నిన్న సభలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టంగా చెప్పినప్పటికీ.. మళ్లీ ఈ రోజు అదే అంశంపై చర్చ జరపాలంటూ టీడీపీ సభ్యులు డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు. ఆ సబ్జెక్ట్‌ ముగిసిందని, ఈ రోజు ఇతర అంశాలు, బిల్లులపై చర్చ చేపట్టాల్సి ఉందని స్పీకర్‌ తమ్మినేని సీతారం పదే పదే విజ్ఞప్తి చేసినా టీడీపీ సభ్యులు పోడియం వద్ద స్లోగన్లు ఇస్తూ సభకు అంతరాయం కల్పించేందుకు యత్నిస్తున్నారు.

టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన స్పీకర్‌.. వారి వారి సీట్లలో కూర్చొవాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా వారి తీరు మారకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును ఒక రోజుపాటు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. రైతులకు తమ ప్రభుత్వం ఏమి చేసిందో.. ఇన్య్సూరెన్స్‌ ఎలా చేస్తుందో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గణాంక సహితంగా మరోమారు వివరించారు. 2016 నుంచి ఇప్పటి వరకు పంటలకు బీమా ఎలా సాగింది..? ప్రభుత్వం వాటా ఎంత..? రైతుల వాటా ఎంత..? అనే వివరాలు సభలో ప్రదర్శించి మరీ సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. అయినా టీడీపీ సభ్యులు తీరు మార్చుకోలేదు.

టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యనే ప్రభుత్వం పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. వాటిపై చర్చ తర్వాత ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. సభ మధ్య మధ్యలో స్పీకర్‌.. టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ ప్రజా ప్రయోజనకరమైన బిల్లులు చాలా ఉన్నాయి. వాటిపై చర్చిద్దాం. మీరు మీ అభిప్రాయాలు చెప్పండి. అభ్యంతరాలు లేవనెత్తింది. అంతేకాని ఇది సరైన పద్ధతి కాదు. సభ నడవాలి. దయచేసి మీ సీట్లలో కూర్చొండి’’ అంటూ స్పీకర్‌ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. 11 గంటల సమయంలో టీ విరామం కోసం సభ వాయిదా పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి