iDreamPost

విధానాలు మార్చే అధికారం ప్రభుత్వాలకు లేదంటే ఎన్నికలు ఎందుకు..? – ధర్మాన

విధానాలు మార్చే అధికారం ప్రభుత్వాలకు లేదంటే ఎన్నికలు ఎందుకు..? – ధర్మాన

శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పరిధి ఏమిటో సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా పేర్కొందని సీనియర్‌ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఈ రోజు శాసన సభలో అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు.. ఇటీవల ఏపీ హైకోర్టు మూడు రాజధానుల అంశంపై ఇచ్చిన తీర్పును, చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. పలు అంశాల గురించి మాట్లాడారు. గత ప్రభుత్వాల విధానాలను నూతన ప్రభుత్వాలు మార్చకూడదు అంటే ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ధర్మాన ప్రశ్నించారు. ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటేనే.. పాత ప్రభుత్వ విధానాలు నచ్చలేదనే కదా..? అని వ్యాఖ్యానించారు. ఆయా వ్యవస్థల విధులు, అధికారం, భారత రాజ్యాంగం కల్పించిన అధికారాలను గుర్తు చేస్తూ.. వివిధ సందర్భాల్లో వివాదాలు ఏర్పడినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు ప్రస్తావించారు.

‘‘ ఎవరి పరిధి ఎంత అనేది న్యాయవ్యవస్థ పేర్కొనాలి. న్యాయస్థానం ఈ పరిపాలనా ప్రక్రియలో మిగతా రెండు విభాగాలతో సమానమైనది. మనం ఏ విభాగం కన్నా ఎక్కువ కాదని సుప్రీంకోర్టు చెప్పింది. మనం ఎక్కువ అనే భావన విడనాడాలి.శానస,న్యాయవ్యవస్థలు సమానమైనవని, స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇటువంటి స్వతంత్ర, న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడబడుతుంది. ఎప్పుడైతే న్యాయమూర్తులు శాసనసభ, అధికారుల బాధ్యతల్లో వేలు పెడతారో అపుడు ఓటర్లు, ప్రజా ప్రతినిధులు న్యాయమూర్తుల పనితనాన్ని సమీక్షిస్తారు. శాసనసభ సభ్యులు మాదిరిగా, అధికారుల మాదిరిగా న్యాయమూర్తులను కూడా ఎన్నుకుందామనే అభిప్రాయానికి వస్తారు. దీనివల్ల న్యాయవ్యవస్థ స్వేచ్ఛా స్వతంత్రాలకు భంగం కలుగుతుందని టాటా సెల్యూలర్‌ వెర్సస్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది.

రామ్‌దేవ్‌ వెర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో.. లెజిస్లేచర్, జ్యూడిషియరీ, ఎగ్జిక్యూటివ్‌ విభాగాలు ఒకదానిలో మరొకటి జోక్యం చేసుకోకుండా విధులు నిర్వహించాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్య రక్షణదారు.

రాజ్యాంగ వ్యతిరేకం అయితే తప్పా కోర్టులు జోక్యం చేసుకోరాదని జస్టిస్‌ జేఎస్‌ వర్మ ఒక ఉపన్యాసంలో చెప్పారు. చట్టాలు చేసే అధికారం న్యాయవ్యవస్థలకు లేదు. చట్టాలు అతిక్రమిస్తే జోక్యం చేసుకోవచ్చు. చట్టాలు చేసే అధికారం పార్లమెంట్, శాసన సభలకు ఉంటుంది. లేని చట్టాలను అమలు చేయమనే అధికారం న్యాయవ్యవస్థకు లేదని చెప్పారు. జడ్జిలు న్యాయాన్ని చెప్పగలరు కానీ చట్టాలను రూపొందించలేరని తెలిపారు.

వీకే రెడ్డి వెర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో.. జడ్జి తన ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించడానికి లెజిస్లేచర్‌గా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. న్యాయవ్యవస్థ ఒక బెల్‌ మాదిరిగా పనిచేయాలి. ఎగ్జిక్యూటివ్‌ తన బాధ్యతను విస్మరించి, నిద్రపోతున్నట్లు నటిస్తుంటే.. దాన్ని తట్టి లేపాలి.

గౌరవ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ప్రభుత్వాలు మారితే విధానాలు మారకూడదని వ్యాఖ్యానించింది. ఈ విషయం నాకు బాధ కలిగింది. దీనిపై పూర్వాపరాలు తెలుసుకోవాలని అనిపించింది. అందుకే హైకోర్టు వ్యాఖ్యలపై చర్చించాలని కోరాను. కోర్టు తీర్పు శాసనసభను అడ్డుకుంటుందా..? ఈ తీర్పు ఈ ప్రభుత్వానికే పరిమితమా..? లేక రాబోయే ప్రభుత్వాలకు కూడా వర్తిస్తుందా..? ప్రభుత్వం మారితే.. కొత్త విధానం తీసుకునే అధికారం లేదంటే.. ఈ వ్యవస్థ ఎందుకు..? ఎన్నికలు ఎందుకు..? మేనిఫెస్టోలు ఎందుకు..? ప్రజలు ఓటు ద్వారా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటే.. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు నచ్చలేదని. అలాంటిది కొత్త ప్రభుత్వం కొత్త పాలసీని తయారు చేయడానికి లేదంటే ఎలా..? అందుకే నేను చర్చించాలని సీఎంకు లేఖ రాశాను.

ఒక కొత్త విధానం చేయడం శానససభల విధి. శాసన సభలు, పార్లమెంట్‌లు ఉన్నది అందుకే. ఒక ప్రభుత్వం తీసుకున్న విధానం.. తర్వాత ప్రభుత్వం మార్చడానికి వీల్లేదు అంటే.. ప్రభుత్వాలను ఎన్నుకోవడం ఎందుకు..? ఒక ప్రభుత్వం విధానాలు తీసుకుని.. అమలు చేయాలని ఎగ్జిక్యూటివ్‌కు చెబితే చాలు కదా..? మళ్లీ ఐదు ఏళ్లకు ఎన్నికలు ఎందుకు..?

బ్యాంకుల జాతీయం చేయడం, రాజభరణాల రద్దు అలాంటిదే. ఆర్థిక విధానం మార్పు లేకపోతే.. దేశం దివాళా తీసేది. పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజస్‌ను ప్రైవేటీకరణ చేయడం ఇప్పుడు చూస్తున్నాం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వద్దని పార్లమెంట్‌లో సభ్యులు డిమాండ్‌ చేస్తుంటే.. అది మా ప్రభుత్వ పాలసీ అని చెబుతున్నారు. మద్యపాన నిషేధం తెచ్చారు. ఆ తర్వాత మద్యపానం తేవడం ఒక పాలసీ. పేదలకు వైద్య సేవలు అందించేలా వైఎస్సార్‌ చేయడం ఒక పాలసీ. పేదలకు ఉన్నత విద్యను అందించడం, సమాన హక్కులు, కనీస మౌలిక వసతుల కల్పన లెజిస్లేటివ్‌ చేస్తుంది. సమాజంలో అసమానతలను తగ్గించేలా పాలసీలు తయారు చేస్తుంది.

స్టేట్‌ ఆఫ్‌ ఉత్తరప్రదేశ్‌ వర్సెస్‌ విజయ్‌ బహుదూర్‌ సింగ్‌ కేసులో.. ఈ వేళ ఒక ప్రభుత్వం ఒక విధానం అనుకోవచ్చు. మళ్లీ కొన్నాళ్ల తర్వాత దాన్ని మార్చవచ్చు. పాలసీ తీసుకున్నారు కాబట్టి.. మార్చడానికి లేదని చెప్పలేము అని సుప్రీంకోర్టు చెప్పింది. పరిస్థితులను బట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలసీని మార్చవచ్చు.

ప్రాథమిక హక్కులకు, సహజ న్యాయసూత్రాలకు భంగం కలగనంత వరకూ చట్టాలు చేసుకునే అధికారం శాసన వ్యవస్థలకు ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇలాంటి అధికారం రాజ్యాంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. విధానం అనేది అనంతమైన సముద్రం లాంటిది.. దానిలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదు. అందులో లోపాలు ఉంటే సరిచేయవచ్చు. ప్రభుత్వ చర్యలు చట్ట వ్యతిరేకమని, పాత విధానమే మంచిదని కోర్టులు దాడి చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ప్రభుత్వం ఏది మంచిది అనుకుంటే అది చేస్తుంది. ఆర్థిక విధానాల రూపకల్పన ఎగ్జిక్యూటివ్‌ పని.. దానిలోకి కోర్టులు జోక్యం చేసుకోకూడదు. ప్రజాస్వామంలో ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు విధానాలను తీసుకుని, అమలు చేసే అధికారం ఉంటుంది. అందులో జోక్యం చేసుకుని ఆటంకం కలిగించకూడదు. న్యాయ సమీక్ష అధికారం అనేది పరిధిలో ఉన్నప్పుడు మాత్రమే అన్ని వ్యవస్థలు సమర్థవంతంగా పని చేస్తాయని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.

ఒక వ్యక్తిగాని, సంస్థ గాని తమకు న్యాయం జరగనప్పుడు లేదా అన్యాయం జరిగినప్పుడు కోర్టుకు వెళతారు. శాసన సభ.. ఎప్పుడు కూడా రేపు ప్రజలకు ఏమి కావాలో అంచనా వేసి ప్రజలముందు ఉంచుతుంది. ఇది శాసన వ్యవస్థ మాత్రమే చేయగలదు. కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు తీసుకున్న ముందస్తు చర్యలు అలాంటివే. అలాంటిది శాసనవ్యవస్థను అడ్డుకుంటే..ప్రజలకు అన్యాయం చేసినట్లు అవుతుంది. ప్రజలకు నష్టం చేకూర్చుతుంది. అందుకే అనేక తీర్పుల్లో సుప్రీంకోర్టు వ్యవస్థల అధికారాలపై స్పష్టత ఇచ్చింది.

అధికారంలోకి రాకముందు వెనుకబడిన ప్రాంతాలకు వెళ్లి.. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేయకపోతే ఎలా..? విధానాలు తీసుకోకుండా వారి వెనుకబాటు తనం ఎలా రూపుమాపగలం..? రాష్ట్ర విభజన సమయంలో ఏడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయని చెప్పారు. ఆయా జిల్లాలను అభివృద్ధి చేయాలంటే ఏదో ఒక పాలసీని తీసుకోవాలి. అలా తీసుకుంటే.. న్యాయవ్యవస్థ సమర్థించాలి. మా (శ్రీకాకుళం) ప్రాంతంలోని ప్రజలు దేశంలోని వివిధ నగరాల్లో భవనాలను నిర్మించే పనిలోనే ఉండాలా..? వారి బతుకులు మారకూడదా..?

ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల కోసం ప్రజల ముందుకు ఎలా వెళ్లాలి..? ఐదేళ్ల ముందు అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పి.. చేయకపోతే ప్రజల ముందుకు ఎలా వెళ్లగలం..? ప్రజల వద్ద పరీక్ష నెగ్గాలంటే.. వారి ఆకాంక్షలను, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఇది మీరు చేయకూడదు అంటే ఈ సభ పని అయిపోయినట్లే కదా..?

మన దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఎవరి పరిధిలో వారు పని చేయాలి. రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడే అందరి గౌరవాలు నిలబతాయి. రాజ్యాంగాన్ని గౌరవించకపోతే.. మనకు ఆ గౌరవం లభించదు. వ్యవస్థలు, వ్యక్తులు.. ఇలా ఎవరికి తగినట్లుగా వారికి అధికారం, గౌరవం రాజ్యాంగం కల్పించింది. వందల ఏళ్ల వరకూ మన వ్యవస్థలు గొప్పగా ఉండేలా రాజ్యాంగాన్ని బిఆర్‌ అంబేద్కర్ అధ్యక్షతన రచించారు. ఇలాంటి రాజ్యంగంలో, శాసన వ్యవస్థలో నాకు ఉన్న గౌరవం కాపాడుకునేందుకు నేను ఇలా చర్చించాను. అంతేకానీ ఎవరినీ కించపరిచేందుకు కాదు. వ్యవస్థలు శతాబ్ధాలు కొనసాగాలి. వాటిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిదీ..’’ అని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి