iDreamPost

రైతులపై ప్రేమకు ఇదే నిదర్శనం ‘కళా’..!

రైతులపై ప్రేమకు ఇదే నిదర్శనం ‘కళా’..!

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏ మంచి పని చేసినా, కొత్త పథకం ప్రవేశపెట్టినా సరే వాటిపై విమర్శలు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉంటున్నారు. ఇటీవల వరుసగా జరిగిన పరిణామాలను చూస్తే ఈ భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. జగనన్న చేదోడు, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ కాపు నేస్తం.. ఈ రోజు రైతులకు బకాయలున్న పంట బీమా ప్రిమియం చెల్లింపు.. ప్రతి అంశంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొసారి సెల్ఫ్‌ గోల్‌ కూడా వేసుకుంటున్నారు.

2018–19 పంట ఏడాదికిగాను అప్పటి ప్రభుత్వం బకాయలు పెట్టిన బీమా ప్రీమియం సొమ్ము 596.36 కోట్ల రూపాయలను ఈ రోజు జగన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. ఫలితంగా రాష్ట్రంలో దాదాపు 5.94 లక్షల మంది రైతులకు మేలు జరిగింది. ఈ సొమ్ములు ఆయా రైతుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాది నుంచే రైతులకు పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోంది. కేవలం రూపాయికే బీమా అందిస్తోంది. దీని కోసం ప్రభుత్వం గత ఏడాది 1200 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. ఈ ఏడాది కూడా ఉచిత బీమా కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.

ఇలా రైతులకు బకాయలున్న బీమా నగదును వైసీపీ ప్రభుత్వం చెల్లించిందో లేదో వెంటనే మాజీ మంత్రి, టీడీపీ నేత కళా వెంకటరావు లైన్‌లోకి వచ్చారు. వైసీపీ ప్రభుత్వం రైతులపై పేమ్రను మాటల్లో తప్పా చేతల్లో చూపడంలేదని విమర్శించారు. ఇది రైతు ప్రభుత్వం కాదని, రైతు దగా ప్రభుత్వమని పడికట్టు పదాలతో విమర్శలు గుప్పించారు. ఖరీఫ్‌ ప్రారంభమైన రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేవని, మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తూ వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడైన కళా వెంకటరావుకు ప్రస్తుత ప్రభుత్వం రైతుల కోసం గ్రామ సచివాలయాల్లోనే ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల గురించి తెలియక విమర్శలు చేస్తున్నారా..? లేక తెలిసే విమర్శిస్తున్నారా..? అర్థం కావడంలేదు. రైతులకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అన్నీ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. రైతులకు తమకు కావాల్సిన వాటిని రైతు భరోసా కేంద్రాల్లోని కియోస్క్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.

గతంలో రైతులకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల కోసం సమీపంలోని పట్టణాల్లో ఉన్న వ్యాపారుల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. సమయం వృథాతోపాటు, రవాణా ఖర్చులు రైతులపై పడేవి. కానీ ఇప్పుడా సమస్య లేదు. తమ ఊరిలోనే అన్నీ లభిస్తున్నాయి. ఇక పంట భీమా కూడా సచివాలయంలోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ రైతుల వెంటపడి మరీ వారి పాస్‌బుక్, ఆధార్‌ కార్డు నఖళ్లు తీసుకుని చేస్తున్నారు. గత ఏడాది యూరియా 50 కేజీ బస్తా వ్యాపారుల వద్ద ఎంతకు కొన్నది.. ఈ ఏడాది రైతు భరోసా కేంద్రాల్లో యూరియా బస్తా ధర ఎంత..? అనేది తమకు తెలిసిన రైతును కళా వెంకటరావు అడిగితే.. ఇది రైతు ప్రభుత్వామా..? లేదా రైతు దగా ప్రభుత్వమా..? అనేది తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి