iDreamPost

కోర్టుకెళ్తే పోయేదానికి కుల రాజకీయమెందుకు..?

కోర్టుకెళ్తే పోయేదానికి కుల రాజకీయమెందుకు..?

అధికారుల వల్లో.. ప్రభుత్వ చర్యల వల్లో మనకు ఏదైనా అన్యాయం, నష్టం జరిగితే ఏం చేస్తాము. మనకు ఎలా నష్టం జరిగిందో సాధికారికంగా నేరుగా అధికారులకు.. వీలు కాకపోతే మీడియా ద్వారా వివరించి న్యాయం కోసం ప్రయత్నిస్తాం. దాని వల్ల ప్రయోజనం లేకపోతే కోర్టును ఆశ్రయించి న్యాయం పొందడానికి ప్రయత్నిస్తాం. కానీ టీడీపీ నేతలకు ఈ దారులేవీ కనిపించడం లేదు. వారికి కనిపించేది.. చేతనయ్యేది ఒక్క రాజకీయమే. అయినదానికీ కానిదానికీ రాజకీయం చేసి పబ్బం గడుపుకోవడానికి అలవాటు పడిన సదరు నేతలు విశాఖ నగరంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం కూల్చివేత ఘటనను రాజకీయ కోణంలోనే చూశారు. ఒక రోజంతా అవే ఆరోపణలు చేశారు. ఇప్పుడు మరింత దిగజారి.. దానికి కుల పైత్యం కూడా జోడించారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడాన్ని కులం కోణంలో చూపిస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నవ్వుల పాలవుతున్నారు.

వ్యాపారమంటే అక్రమాలు చేయడమా..

పాత గాజువాక జంక్షన్ లో టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ నిబంధనలను మీరి బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయం నిర్మిస్తున్నారన్నది జీవీఎంసీ ప్లానింగ్ అధికారుల అభియోగం. దీనిపై పలుమార్లు నోటీసులు ఇచ్చిన పల్లా స్పందించకపోవడంతో కూల్చివేయాల్సి వచ్చిందన్నది వారి వాదన. అయితే తాను అన్ని అనుమతులు పొందానని రోడ్డుకు స్థలం కూడా వదిలి నిర్మాణం చేపట్టానని పల్లా చెబుతున్నారు. రాజకీయ కక్షతో భవనాన్ని కూల్చేశారని ఆరోపించారు. కానీ తన వద్ద ఉన్నాయంటున్న అనుమతి పత్రాలను ఆయన ఇప్పటికీ బహిర్గతం చేయలేదు. పోనీ అధికారులే తప్పు చేశారనుకుంటే.. కోర్టును ఆశ్రయించే ప్రయత్నమైనా చేయలేదు.

రాష్ట్ర ప్రభుత్వం తుమ్మినా దగ్గినా ఏదో జరిగిపోతోందంటూ కోర్టుల్లో కేసులు వేసే అలవాటున్న టీడీపీ నేతలైనా.. పల్లాకు కోర్టుకు వెళ్ళమని సలహా ఇచ్చిన దాఖలాల్లేవు. భవనం కూల్చివేత అన్యాయమే అయితే.. వారి వద్ద అనుమతి పత్రాలే ఉంటే కోర్టుకు వెళ్ళడానికి ఎందుకు సందేహిస్తున్నారో పల్లావారు.. ఆయన్ను వెనకేసుకొస్తున్న టీడీపీ నేతలే సమాధానం చెప్పాలి. ఆ విషయం ప్రస్తావించకుండా బీసీలు వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి చెందడం ఇష్టం లేక జగన్ వారి వ్యాపార భవనాలను కూల్చి వేస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వ్యాపారం చేసుకోవడమంటే అక్రమ భవంతులు నిర్మించడమేనని ఆయన ఉద్దేశం కాబోలు. లేకపోతే బీసీ అయినంత మాత్రాన ఏం చేసినా అడగకూడదని రాజ్యాంగంలో ఏమైనా ఉందేమో యనమల వారే సెలవివ్వాలి. ఒకవైపు కులం పేరుతో ఆరోపణలు చేసిన నోటితోనే.. విశాఖ ఉక్కు పరిరక్షణకు దీక్ష చేశారన్న కక్షతో పల్లాను వేధిస్తున్నారని మరో ఆరోపణ కూడా చేశారు. పరస్పర విరుద్ధంగా ఉన్న ఈ ఆరోపణలే వారి రాజకీయ ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నాయి.

ఈ ప్రభుత్వంలోనే బీసీలకు మేలు

వ్యాపారాలు చేసుకోకుండా బీసీలపై కక్ష సాధిస్తున్నారని మరో టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపించారు. సీఎం జగన్ ను బీసీ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ వైఎస్సార్సీపీ పార్టీగానీ, ప్రభుత్వం గానీ గతంలో ఏ ప్రభుత్వం, పార్టీ ఇవ్వనంత ప్రాధాన్యాన్ని బీసీలకు ఇస్తున్నాయి. వారికి రాజకీయాధికారం అందించేందుకు అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో రిజర్వ్ చేసిన సీట్లకు మించి కేటాయించారు. నామినేటెడ్ పదవుల్లోనూ సామాజిక న్యాయం చేస్తున్నారు. ఈ వాస్తవాలను విస్మరించి..  తమ పార్టీ నేతలు పాల్పడిన అక్రమాలు, హత్య రాజకీయాల నుంచి విషయాన్ని పక్కదారి పట్టించేందుకు తెలుగుదేశం నేతలు కుల, రాజకీయ ఆరోపణలకు పాల్పడుతుండడం గమనార్హం.

Also Read : ప్రమాణాలు ఎందుకు పల్లా..? సక్రమమైతే పత్రాలు చూపిస్తే సరిపోతుంది కదా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి