iDreamPost

యనమల ఆశకు అంతూపొంతూ లేదా..

యనమల ఆశకు అంతూపొంతూ లేదా..

ఏపీ లో శాసనమండలి రద్దు వ్యవహారం ఇప్పటికే సగం పూర్తయ్యింది. కేంద్రం నిర్ణయం తీసుకోగానే గతంలోనే ఎన్టీఆర్ చెప్పిన ఆరో వేలుకి మరోసారి ఏపీలో ముగింపు ఖాయం. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ అర్థాంతరంగా నిలిచిపోవడంతో మండలికి మంగళం పాడే బిల్లుకి ముగింపు దక్కలేదు. త్వరలో నిర్వహించబోయే సమావేశాల్లో దాదాపు నిర్ణయం ఖాయమని కొందరు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే జగన్ కూడా మండలి నుంచి తన మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కీలక నేతలను రాజ్యసభకు పంపించే నిర్ణయం తీసుకుని, ఎన్నికల్లో గెలిపించుకున్నారు.

ఇలాంటి సమయంలో మండలిలో టీడీపీ నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు ఆసక్తికర ప్రకటన చేశారు. శాసనమండలిని శాశ్వత సభగా ఉంచాలని ఆయన ఆశిస్తున్నారు. ఆశ తప్పు లేదు గానీ అత్యాశ కూడదన్నట్టుగా ఇప్పటికే మండలిని రద్దు చేసే ప్రక్రియ సాగుతున్న తరుణంలో మళ్లీ శాశ్వత సభ అంటూ యనమల చేసిన ప్రకటన కొందరిని ఆశ్చర్యపరుస్తోంది. రాజకీయంగా టీడీపీ ఇప్పటికే మండలి వ్యవహారాలతో ప్రజల్లో పలుచన అయ్యిందనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకోవాలని చూసి అభాసుపాలయ్యింది. ద్రవ్య వినిమయ బిల్లుని కూడా అడ్డుకునే యత్నం చేయడం ఆశ్చర్యం కలిగించింది. 14 రోజుల్లోనే మండలి అభిప్రాయంతో ప్రమేయం లేకుండా మండలి బిల్లులు ఆమోదం పొందుతాయని తెలిసినా టీడీపీ మండలిలో తనకున్న బలాన్ని ఉపయోగించడం పట్ల అధికార పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

అన్నింటికీ మించి రాజదాని బిల్లుల అంశంలో పాలకపార్టీ తీరు పలువురి రాజ్యాంగ నిపుణుల నుంచి కూడా విమర్శలకు కారణం అయ్యింది. రెండోసారి అసెంబ్లీ ఆమోదంతో మండలిలో టేబుల్ అయిన తర్వాత కూడా చర్చను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. నెల రోజుల్లో యధావిధిగా బిల్లు చట్టంగా మారేందుకు ఉన్న మండలి పరిమితులను గుర్తు చేస్తున్నప్పటికీ ఖాతరు చేయకుండా మండలిలో యనమల, లోకేశ్ వంటి వారి వ్యవహారం, దానికి అనుగుణంగా లాబీల్లో కూర్చుని చంద్రబాబు తీరు అనేకమందిని విస్మయానికి గురిచేసింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కీలకమైన బిల్లుల విషయంలో మండలి అభ్యంతరాలను ఖాతరు చేయకుండా ముందుకెళ్లిన ఘనత బాబు, యనమల ద్వయానికి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం తాము చెప్పినట్టు సర్కారు వ్యవహరించాల్సిందే అన్నట్టుగా వారివురూ పట్టుబట్టిన తీరు ద్వంద్వనీతికి నిదర్శనంగా కనిపించింది.

అన్నీ జరిగిన తర్వాత చివరకు ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ లో రాజ్యసభలా శాసనమండలి కూడా శాశ్వత సభలా ఉండాలని యనమల అనడం హాస్యాస్పదంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ, బీజేపీ అధిష్టానం కూడా మండలి వ్యవస్థకు సుముఖంగా లేరు. ఆమాటకొస్తే అసలు రాజ్యసభ పట్ల కూడా పలుమార్లు అసహనం ప్రదర్శించిన దాఖలాలున్నాయి. అలాంటి నేతలు గుజరాత్ లో కూడా శాసనమండలి ని నడపడానికి సుముఖత లేని వారు ఏకంగా అన్ని రాష్ట్రాల్లో రాజ్యసభ మాదిరిగా మండలి తీసుకొస్తారని యనమల ఆశించడం, అలాంటి ప్రకటనలు చేయడం గమనిస్తుంటే టీడీపీ నేతలు వాస్తవదూరంగా ఉన్నారనే సంగతిని చాటుతోంది. అయితే తమ పార్టీ నేతలను, శ్రేణులను మభ్యపెట్టేందుకు ఎలాంటి ప్రకటనలు చేస్తూ ఉండవచ్చనేది కొందరి సందేహం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి