iDreamPost

తెలుగుదేశానికి అది పెద్ద దెబ్బే..!

తెలుగుదేశానికి అది పెద్ద దెబ్బే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల ద్వారా ల‌క్ష‌లాది మంది ల‌బ్ధి పొందుతున్నారు. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఉప‌యోగం పొందుతున్నాయి. అతి పెద్ద కార్య‌క్ర‌మ‌మైన ఇళ్ల స్థ‌లాల పంపిణీకి మాత్రం ఆది నుంచీ అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. నిజానికి ఇళ్ల స్థలం లేని కుటుంబం రాష్ట్రంలో వుండకూడదు అన్నది సీఎం జగన్ ఆలోచన. నిజానికి ఎవరైనా సరే, పార్టీ బంధాలు, అభిమానాలు పక్కన పెట్టి మెచ్చుకోవాల్సిన సంగతి. ఇళ్ల స్థలం కొనడం అన్నది ఎంత మారుమూల పల్లెలో అయినా వేలు ఖర్చు చేయాల్సిన సంగతి. అలాంటిది ఫ్రీగా ఇవ్వడం, అది కూడా ఓ లే అవుట్ మాదిరిగా తయారుచేసి ఇవ్వడం అంటే మెచ్చుకోవాల్సిందే కదా. కానీ ఆది నుంచీ ప్రతిపక్షాలు ఆ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌కుండా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. వందలు.. వేలు.. కాదు ఏకంగా 30 ల‌క్ష‌ల కుటుంబాల‌కు చెందిన అంశం ఇది. దీన్ని అడ్డుకోవ‌డానికి చూస్తున్న తెలుగుదేశం పార్టీపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

ఎన్నో అడ్డంకులు..

జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మం కోసం చ‌ర్య‌లు ప్రారంభించిన నాటి నుంచే ఏదో ర‌కంగా టీడీపీ ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తోంది. ఇళ్ల స్థలాల కోసం ప్రయివేటు భూములు అధిక ధరలకు కొంటున్నార‌ని, కొండల్లో, ఊరికి దూరంగా, రాళ్లల్లో స్థలాలుచదును చేసి ఇస్తున్నారని… ఇలా ఏదో ఒక అంశం లేవ‌నెత్తుతూ పేద‌ల‌కు స్థ‌లాలు అంద‌కుండా చేస్తూ వ‌స్తోంది. కొంత మంది టీడీపీ నేత‌లు ఇదే అంశాల‌పై కేసులు వేశారు. ఓ కోస్తా జిల్లాలో 800 వైట్ రేషన్ కార్డులు వున్న ఓ చిన్న పల్లెటూరిలో 170 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. మనిషికి రెండు సెంట్లు (100 గజాలు) వంతున 340 సెంట్లు అంటే మూడున్నర ఎకరాలు స్థలం కావాలి. ఇంత స్థలం ఊరి నడిబొడ్డున దొరకుతుందా? అయితే కొనాలి. లేదా బంజరు వుంటే అది చదును చేసి ఇవ్వాలి. అంతే కదా? ఊరి చివర బంజరు దగ్గర 170 కుటుంబాలు ఇళ్లు కట్టుకుంటే అది ఊరుగా మారిపోతుంది. ఈ విష‌యం టీడీపీ పెద్ద‌ల‌కు తెలియ‌దా..? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు త‌లెత్తుతున్నాయి.

అప్ప‌ట్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఎలా ఉన్నాయి..?

సినిమా జనాలకు స్థలాలు ఇచ్చినపుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎలా వున్నాయి? మాకెందుకీ స్థలాలు అని ఆ కొండలను గుట్టలను వదిలేయలేకపోయారా? ఎగబడి మరీ ఎకరాలు ఎకరాలు ఎలా తీసుకున్నారు. ఇప్పుడు అవి ఎంత కోట్ల విలువ? పేదల అభివృద్ధి గిట్టని కొన్ని దుష్టశక్తులు కోర్టులకు వెళ్లి అడ్డుకోవడం వల్లే ‘పేదలకు ఇల్లు’ కార్యక్రమం ఆలస్యమవుతోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. పేద ప్రజల సంక్షేమ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సరికొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా పేదలకు ఇల్లు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కచ్చితంగా పూర్తి చేస్తారని పునరుద్ఘాటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి