iDreamPost

ప్రకాశంలో టీడీపీకి వలస నేతలే దిక్కయారు..!

ప్రకాశంలో టీడీపీకి వలస నేతలే దిక్కయారు..!

గడచిన సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని జరుగుతున్న పరిణామాలు ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కాడె మోసే నాయకుడే పలు జిల్లాల్లో కరువయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఏదైనా నేతల్లో కొంత నిరుత్సాహం ఉండడం సహజమే కానీ టీడీపీలో అంతకు మించిన పరిస్థితులు ఉన్నాయి.

పార్టీలో తాము ఉన్నామనే విషయాన్ని కూడా తెలిపేందుకు టీడీపీ నేతలు ఇష్టపడడం లేదు. చంద్రబాబు నాయుడే అంతా తానై నడిపిస్తున్నారు. జిల్లాల్లో ఆది నుంచి ఉన్న నేతలు భవిష్యత్‌పై క్లారిటీతో తమ దారి తాము చూసుకోగా.. మరికొంత మంది స్తబ్ధుగా ఉంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు కొత్త నేతలను వెతుక్కోవాల్సి వస్తోంది. కొత్త నేతల జాడ కూడా కనిపించకపోవడంతో పలు జిల్లాలో వలస నేతలే దిక్కవుతున్నారు.

తాజాగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అ«ధ్యక్షులు, సమన్వయకర్తల పదవుల నియామకంలో కనిపించిన పేర్లతో టీడీపీ పరిస్థితి అర్థం అవుతోంది. కొత్త మొఖాలు.. వలస నేతలే పదవుల్లో కనిపించడం ఆ పార్టీ కార్యకర్తలనే ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందని లిస్టులో పేర్లను బట్టి చెబుతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి ముగ్గురుకు పదవులు లభించాయి. ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడుగా నూకసాని బాలాజీ, బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ (ఎస్సీ రిజర్వ్‌డ్‌) అధ్యక్షుడుగా పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయ కర్తగా ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి పదవులు లభించాయి.

ఈ ముగ్గురి నియామకంతో ప్రకాశం జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. ఇందులో ఒకరు టీడీపీలో ఆది నుంచి ఉన్న నేత అవగా, మిగతా ఇద్దరు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కావడం గమనార్హం. ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడుగా ఎన్నికైన నూకసాని బాలాజీ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. 2014 జడ్పీ ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన నూకసాని బాలాజీ ఆ పార్టీ జడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా ఉన్నారు. అయితే మారిన రాజకీయ పరిణామాలతో ఆ తర్వాత జడ్పీ చైర్మన్‌ పదవి కోసం టీడీపీలోకి ఫిరాయించారు. టీడీపీలో ఈ పదవి ఆశించిన ఆ పార్టీ సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబును సైడ్‌ చేసేందుకు టీడీపీ నూకసాని బాలాజీని పార్టీ ఫిరాయించేలా ప్రోత్సహించింది.

చిత్తూరు, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయ కర్తగా పదవి పొందిన ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి కనిగిరి నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు. 2009లో కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. 2014లో వైసీపీ టిక్కెట్‌ ఆశించినా.. రాకపోవడంతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఆఖరు నిమిషంలో కనిగిరి టిక్కెట్‌ దక్కించుకున్నారు. ఇప్పుడు ముక్కు ఉగ్రనరసింహా రెడ్డికి టీడీపీలో పదవి రావడం ఆయన అభిమానులకు ఆనందంగా ఉన్నా.. టీడీపీ శ్రేణులు మాత్రం పార్టీ పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ఉన్న 12 సీట్లలో టీడీపీ ఆరు గెలిచింది. 2019 ఎన్నికల్లో జగన్‌ హవాలోనూ 4 సీట్లు గెలుచుకుంది. అయితే జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కులుగా ఉన్న కరణం బలరాం, శిద్ధా రాఘవరావులు వైసీపీలో చేరడంతో ప్రకాశంలో టీడీపీకి పెద్ద దెబ్బ తగిలింది. అంతకు ముందు దాదాపు పదేళ్ల పాటు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తదితర సీనియర్‌ నాయకులు పార్టీలో ఉంటున్నా.. ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు ఆసక్తి చూపలేదనే టాక్‌ ప్రకాశం జిల్లాలో నడుస్తోంది. సమన్వయకర్త పదవి పై కూడా ఈ నేతలు ఆసక్తి చూపకపోవడం ఆ పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తోంది. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో చంద్రబాబుకు కాంగ్రెస్, వైసీపీ నుంచి వచ్చిన నేతలే ప్రస్తుతం దిక్కయ్యారనే విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి