iDreamPost

నాటు.. నాటు నాటు.. నాటు అంటూ టీడీపీ రాజకీయం – ఈ అసెంబ్లీ సెషన్‌ను టీడీపీ జంగారెడ్డి గూడెంకు అంకితం చేసిందా?

నాటు.. నాటు నాటు.. నాటు అంటూ టీడీపీ రాజకీయం – ఈ అసెంబ్లీ సెషన్‌ను టీడీపీ జంగారెడ్డి గూడెంకు అంకితం చేసిందా?

ఏదో ఒక అసంబద్ధమైన అంశం తీసుకొని తన ప్రచార, ప్రసార సాధనాలతో ప్రభుత్వంపై బురదజల్లే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ఘటనపై ఫోకస్‌ పెట్టింది. జంగారెడ్డి గూడెంలో వరుస మరణాలకు నాటు సారాయే కారణమని ఆరోపిస్తూ ఆందోళనలు ప్రారంభించిన టీడీపీ నేతలు రోజురోజుకు దాని తీవ్రతను పెంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారు. నాటు సారా కారణంగా మరణించింది ఐదుగురేనని, మిగిలినవి సహజ మరణాలని ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నా వినకుండా తన రాద్ధాంతాన్ని కొనసాగిస్తూ ప్రజలదృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు.

అసెంబ్లీ వేదికగా ప్రచారం

తాను ముఖ్యమంత్రిని అయ్యేవరకు అసెంబ్లీకి హాజరుకానని చంద్రబాబు శపథం చేసిన నేపథ్యంలో అసలు బడ్జెట్‌ సమావేశాలకు టీడీపీ సభ్యులు హాజరవ్వాలా? మానాలా? అన్న ఊగిసలాట కొనసాగింది. ఎట్టకేలకు వారు సభకు వచ్చినా తొలిరోజు నుంచీ నాటుసారా అంశంపైనే సభను స్తంభింపజేస్తున్నారు. కీలకమైన బడ్జెట్‌ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షంగా తనవంతు పాత్రను పోషించడం లేదు. చర్చల్లో పాల్గొనడం లేదు. ఒక్క జంగారెడ్డిగూడెం ఘటనపైనే టీడీపీ దృష్టి సారించడం విమర్శలకు తావిస్తోంది. సభ ప్రారంభం కాగానే ఒక వాయిదా తీర్మానం ఇవ్వడం, దానిపై చర్చ జరపాలంటూ స్పీకర్‌ పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలు చేయడం సాధారణమైపోయింది. సమావేశాల‍ప్రారంభం రోజున గవర్నర్‌ పైన, ఆ తర్వాత స్పీకర్‌పై కాగితాలను విసిరి సభలో ప్రతిష్టంభన నెలకొల్పాలని టీడీపీ ప్రయత్నించింది. స్పీకర్‌ సహనాన్ని తీవ్రంగా పరీక్షించింది. టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయడం తప్ప వేరే మార్గంలేని స్థితికి ఆయనను నెట్టింది. ప్రజా సమస్యలపై చర్చించకుండా ఒక్క జంగారెడ్డి గూడెం అంశానికే టీడీపీ ఈ సెషన్‌ను అంకితం చేసిందా? అన్న అనుమానం కలిగేలా వ్యవహరిస్తోంది.

సభ బయటా రోజుకో రకంగా ప్రచారం

బాధితుల కుటుంబాల పరామర్శ పేరిట సోమవారం జంగారెడ్డిగూడెం వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు తన మార్కు ప్రచార ఆర్భాటం చేశారు. ఏదో దండయాత్ర మాదిరి మందీ మార్బలంతో అక్కడకు వెళ్లి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత రోజు నుంచి ఆ పార్టీ నేతలు ఇదే అంశం చుట్టూ రోజుకో రకంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం కోరుకుంటున్నారు. అసెంబ్లీలో సీఎం జగన్ అవాస్తవాలు చెప్పారని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ నేతల కనుసన్నల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారా దందా కొనసాగుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. అసత్యాలు చెప్పిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లి జనం, మీడియాలో ప్రచారం పొందారు.

ఒక్కోసారి ఒక్కోదానిపై రచ్చ

ఏపీ డ్రగ్‌ ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని కొన్నాళ్లూ, గంజాయి వ్యాపారాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని మరి కొన్నాళ్లూ టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, పోలీసులు ప్రభుత్వం కొమ్ము కాస్తున్నారని, సీఎం, డీజీపీ రాజీనామా చేయాలని కూడా టీడీపీ డిమాండ్లు చేసింది. అవన్నీ అవాస్తవాలని క్రమంగా జనానికి అర్థమయ్యాయి. ఇప్పుడు నాటు సారాను తన ప్రచార అస్త్రంగా చేసుకుంది. ఇలా ఏదో ఒక అంశంపై జనం దృష్టిలో పడాలనే ప్రచారయావ తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి