iDreamPost

అయినా తీరు మార‌లేదు..టీడీపీ రాత మార‌లేదు

అయినా తీరు మార‌లేదు..టీడీపీ రాత మార‌లేదు

క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తున్న ద‌శ‌లో చిన్న ఆస‌రా కూడా పెద్ద ఆధారం అవుతుంది. అనేక‌మందికి ప్రాణ‌ర‌క్ష‌ణ‌గా నిలుస్తుంది. అందుకే జ‌న శ్రేయస్సు కోరేవారంతా ప్ర‌తీదానిని వినియోగించుకోవాల‌ని చూస్తుంటారు. కొంద‌రు మాత్రం ఆ వినియోగించుకున్న దాని చ‌రిత్ర త‌వ్వి, ఆ ఘ‌న‌త‌ను త‌మ‌కే ఆపాదించుకోవ‌డం ద్వారా ఆత్మ సంతృప్తి చెందుతుంటారు. వందిమాగ‌ధుల‌తో ప‌దే ప‌దే చెప్పించుకుని భుజాలు చ‌రచుకుంటారు. కానీ జ‌నం ఏమనుకుంటున్నారో అనేది మాత్రం వారికి ప‌ట్ట‌దు.

వ‌ర్త‌మానంలో ఈ విష‌యంలో మ‌రోసారి రుజువ‌య్యింది. క‌రోనా బాధితుల చికిత్స కోసం త‌గిన సామాగ్రి ఎందెందు వెదికినా దొర‌క‌డం లేదు. కేంద్రాన్ని ప్రాధేయ‌ప‌డినా క‌నిక‌రించ‌డం లేదు. దాంతో సొంతంగా పీపీఈలు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేట‌ర్లు , మాస్కులు స‌హా స‌ర్వం త‌యారీ కోసం ఏపీ సర్కారు స‌న్న‌ద్ధ‌మ‌య్యింది. ఇప్ప‌టికే కొంత ఫ‌లితం వ‌స్తోంది. కాకినాడ ఎస్ ఈ జెడ్ ప‌రిధిలోని చైనా బొమ్మ‌ల కంపెనీలో ఇప్పుడు పీపీఈల త‌యారీ జ‌రుగుతుందంటే ప్ర‌భుత్వ ప్రణాళిక అర్థం చేసుకోవ‌చ్చు. ప‌రిశ్ర‌మ‌ల శాఖ ఆధ్వ‌ర్యంలో ఉన్న అవ‌కాశాల‌న్నీ వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల్లో ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగానే విశాఖ మెడ్ టెక్ జోన్ లో టెస్టింగ్ కిట్లు సిద్ధం చేశారు. వెంటిలేట‌ర్ల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇత‌ర ప్రాంతాల్లో కూడా మ‌రిన్ని రూపాల్లో చొర‌వ చూపుతున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ కొలిక్కిరాలేదు. అయినా ఆశావాహ‌కంగా ఆలోచిస్తూ ప్ర‌య‌త్నాలు ఆప‌డం లేదు.

ఇదంతా నాణానికి ఒక‌వైపు మాత్ర‌మే. రెండో వైపు ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాల కార‌ణంగా ద‌క్కుతున్న ఫ‌లితాల క్రెడిట్ కూడా త‌న‌కే ద‌క్కాల‌న్న‌ట్టుగా మాజీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఆయ‌న అనుకూల మీడియా, సోష‌ల్ మీడియా చురుగ్గా సాగుతున్నారు. చివ‌ర‌కు మెడ్ టెక్ జోన్ లో సాగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై ప్ర‌సారం చేసిన క‌థ‌నాలు తొల‌గించేసుకుని మ‌రీ బాబు భ‌జ‌న సాగిస్తున్నారు. వారికితోడుగా టీడీపీ నేత‌లంతా అదే స్వ‌రం వినిపిస్తున్నారు. బాబు గారి ఘ‌న‌త వ‌ల్లే ఇప్పుడు క‌రోనా చికిత్స‌కి అవ‌స‌ర‌మైన సామాగ్రి సిద్ద‌మ‌య్యింద‌ని చెప్పుకోవ‌డానికి సంకోచించ‌డం లేదు. అంటే క‌రోనా వ‌స్తుంద‌ని ముందే గ్ర‌హించిన చంద్ర‌బాబు మెడ్ టెక్ జోన్ నిర్మించారా అనే సందేహం ఎవ‌రికైనా వ‌స్తే పాపం టీడీపీ నేత‌లు ఏం చేయ‌గ‌ల‌రు. టీడీపీ ఆఫీస్ నుంచి వ‌చ్చిన స్క్రిప్ట్ తో నేత‌ల‌తా ఒక‌టే పాట పాడుతున్న తీరు విస్మ‌య‌క‌రంగా ఉంది. మా తాత‌లు నేతలు తాగారు అనే చందంగా .. ఓవైపు జ‌గ‌న్ స‌ర్కారు అన్నింటా విఫ‌లం అయ్యింద‌ని చెబుతూనే, రెండోవైపు దేశానికి స్పూర్తి నింపే స్థాయిలో ఉన్న చ‌ర్య‌లు మాత్రం చంద్ర‌బాబు ఖాతాలో వేసేందుకు క‌ష్ట‌ప‌డుతున్నారు.

చంద్ర‌బాబు, టీడీపీ, వారి సొంత మీడియా చెబుతున్న దాని ప్ర‌కారం గ‌త ప్ర‌భుత్వం ఏద‌యినా ప్రారంభిస్తే, దాని త‌ర్వాత చేసే కృషి మొత్తం ప్రారంభ‌కుల్లో ప‌డుతుంద‌నే లెక్క అయితే ఇప్పుడు మ‌నం బుల్లెట్ ట్రైన్ త‌యారుచేసుకుంటున్న క్రెడిట్ బ్రిటీష్ వారికి ద‌క్కుతుంద‌ని చెప్పాల్సి వ‌స్తుందేమో. ఎందుకంటే మొద‌టి రైల్వే లైన్ వాళ్లే వేయించారు కాబ‌ట్టి, ఆ పునాదుల మీద ఎదిగిన ప్ర‌తీది బ్రిటీష్ వారి ఘ‌న‌త‌గా చెప్పుకున్నా త‌ప్పులేద‌నేది టీడీపీ విధానంగా ఉంది. అందుకే ఆపార్టీ అధినేత తీరు మార‌క‌పోవ‌డంతో టీడీపీ రీతి మార‌డం లేద‌నేది స్ప‌ష్టం అవుతోంది. అధినేత‌ను సంతృప్తి ప‌రిచే క్ర‌మంలో ఇలాంటి చౌక‌బారు ప్ర‌య‌త్నాలు చేస్తున్న తీరు టీడీపీ కీర్తి పెంచ‌క‌పోగా ప్ర‌జ‌ల్లో మ‌రింంత ప‌లుచ‌న‌య్యే ప్ర‌మ‌దం తెస్తోంది. జ‌గ‌న్ కానీ, మ‌రెవ‌ర‌యినా ముఖ్య‌మంత్రి గానీ వ్య‌క్తిగ‌త దృష్టితో కాకుండా ఏపీలో సాగుతున్న ప్ర‌య‌త్నాల‌న్నీ స‌మిష్టికృషిగా చూడాలి. మంచి ఫ‌లితాలు రాగానే అభినందించాలి. మ‌రింత మంచిగా చేయ‌డానికి తోడ్ప‌డాలి. అంతే త‌ప్ప క్రెడిట్ కోసం ఎంత‌కైనా తెగించాల‌నే టీడీపీ ధోర‌ణి హాస్యాస్ప‌దంగా మిగులుపోతుంద‌ని గ‌మ‌నించ‌డం మంచిదేమో !

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి