iDreamPost

అప్పుడు రెండు కళ్లు.. ఇప్పుడు మూడు నాల్కలు..

అప్పుడు రెండు కళ్లు.. ఇప్పుడు మూడు నాల్కలు..

కర్నూలులో హైకోర్టు పెట్టేందుకు నాకు అభ్యంతరం లేదు. హైకోర్టు రాయలసీమలో పెట్టాలని నేనూ చెప్పా. రాయలసీమ అభివృద్ధి చెందాలి.

విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే స్టీల్‌ ప్లాంట్‌ అమ్మేందుకు అనుమతి ఇచ్చినట్లే. విశాఖ ప్రజలు వైసీపీని ఓడించాలి.

అమరావతి నా కోసం కాదు మీ కోసం నిర్మించాలని మొదలు పెట్టాను. విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే అమరావతిని తరలించేందుకు అనుమతి ఇచ్చినట్లే.

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్నూలు, విశాఖ, విజయవాడ నగరాల్లో మాట్లాడిన మాటలివి.

ఏ విషయంలోనూ సూటిగా సుత్తిలేకుండా మాట్లడకపోవడం బాబు నైజమని చెప్పేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శం. రాష్ట్ర విభజన సమయంలోనూ, తాజాగా మూడు రాజధానుల విషయంలోనూ చంద్రబాబు అనుసరించిన వైఖరి అందరికీ విధితమే. రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు.. మూడు రాజధానుల విషయంలో మూడు నాల్కల ధోరణిని అవలంభిస్తున్నారు. అవసరానికి తగినట్లు ఎప్పటికప్పుడు మాట్లాడడంతో చంద్రబాబు దిట్ట.

వైసీపీ ప్రభుత్వం 2019 డిసెంబర్‌లో చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు.. అమరావతిలో ఉద్యమాన్ని మొదలుపెట్టారు. తన భార్య చేతి గాజులను విరాళంగా ఇప్పించారు. జోలె పట్టి ఉద్యమానికి విరాళాలు సేకరించారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్‌ చేశారు. రిఫరెండం నిర్వహించాలని, అసెంబ్లీని రద్దు చేయాలని సవాళ్లు విసిరారు.మూడు రాజధానులు వల్ల ఏమొస్తుందని ప్రశ్నించారు. అమరావతిని బంగారు బాతుతో అభివర్ణించారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రులదన్నారు.

దాదాపు ఏడాది రెండు నెలల పాటు ఇదే పాట చంద్రబాబు పాడారు. అమరావతి తప్పా రాజకీయంగా మరే అంశాన్ని పట్టించుకోలేదు. కరోనా సమయంలోనూ పోరాటాలు చేయాలంటూ ప్రజలను పదే పదే అభ్యర్థించారు. విశాఖ అంటే తనకు ఇష్టమని చెప్పారు తప్పా కార్యనిర్వాహక రాజధానికి అనుకూలమా..? వ్యతిరేకమా..? అనేది మాత్రం చెప్పలేదు. కర్నూలులో హైకోర్టు పెడితే.. రెండు జెరాక్స్‌ సెంటర్లు తప్పా ఏమొస్తుందని ఎద్దేశా చేశారు.

కట్‌ చేస్తే మున్సిపల్‌ ఎన్నికలు వచ్చాయి. బాబు స్వరం మారింది. ఒకటి కాదు మూడు స్వరాలతో చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నారు. రాయలసీమపై ఎనలేని ప్రేమను కురిపిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటున్నారు. ఇక్కడ న్యాయ రాజధానిపై మాట్లాడిన చంద్రబాబు.. విశాకు వచ్చే సరికి కార్యనిర్వాహక రాజధాని విషయం ప్రస్తావించలేదు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారు. కేంద్రం స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించే ఏర్పాట్లు చేస్తుంటే.. మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే.. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మేందుకు అనుమతి ఇచ్చినట్లేనంటూ పొంతనలేని మాటలు మాట్లాడారు.

అక్కడ నుంచి విజయవాడకు వచ్చి.. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలన్నారు. విజయవాడ కార్పొరేషన్‌లో వైసీపీ గెలిస్తే.. అమరావతి తరలించేందుకు అనుమతి ఇచ్చినట్లేనని మాట్లాడారు. పోరాటం చేయలేరా..? మీకు పౌరుషం లేదా..? అంటూ బెజవాడ వాసులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇలా మున్సిపల్‌ ఎన్నికల వేళ మూడు రాజధానులపై పొంతలేని మాట్లాడిన బాబు లక్ష్యం ఏమిటో అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల తర్వాత మళ్లీ అమరావతి పాటకే చంద్రబాబు రావడం సహజంగా జరిగేదే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి