iDreamPost

చంద్రబాబు పొత్తుల కసరత్తు

చంద్రబాబు పొత్తుల కసరత్తు

పెళ్లి, రెండు,మూడు నెలలు ఆలస్యం అయినా పరవాలేదు ముందు నిశ్చితార్థం జరిపించాలని ఆడపిల్ల తండ్రి ఆతృత పడతాడు. అచ్చంగా అలాగే ఉంది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరిస్థితి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పరవాలేదు ముందుగా పొత్తులు ఖాయం చేసుకోవాలని ఆయన కంగారు పడుతున్నారు. ఏ పార్టీతో పొత్తు లేకుండా మొట్టమొదటి సారిగా 2019 ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. మళ్లీ అలాంటి సాహసం చేయడానికి బాబు ఇష్టపడడం లేదు. అందుకే సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలతో పొత్తుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా బీజేపీ చంద్రబాబును దరి చేరనివ్వడం లేదు. దీంతో ఆయన ఆశలన్నీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒత్తిడితో ఈ రెండు పార్టీల నేతల మధ్య ఇటీవల సంప్రదింపులు జరిగాయని సమాచారం.

రెండున్నరేళ్ల ఫార్ములాపై చర్చ..

టీడీపీతో పొత్తుకు జనసేన అంగీకరిస్తే 40 సీట్లు ఇచ్చేలా, ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ల వంతున రెండు పార్టీలు పంచుకొనేలా తెలుగుదేశం తరపున ప్రతిపాదించారట. అయితే చెరి సగం సీట్లలో పోటీ చేద్దామని జనసేన నాయకులు సూచించారు. పొత్తుకు కలసి వచ్చే సీపీఐ వంటి ఇతర పార్టీలకు కూడా కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది కనుక జనసేనకు అంతకుమించి ఇవ్వలేమని టీడీపీ చెప్పిందట. తమ పార్టీకి కనీసం 75 సీట్లకు తక్కువ కాకుండా కేటాయించాలని, మొదటి దఫా రెండున్నరేళ్ల ముఖ్యమంత్రి అవకాశం పవన్ కల్యాణ్ కు ఇవ్వాలని జనసేన తరపున కోరారట.

అయితే జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, దాన్ని గాడిలో పెట్టాలంటే అనుభవం ఉన్న చంద్రబాబుకే మొదటి దఫా ముఖ్యమంత్రి ఛాన్స్ ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారట! ఇప్పటికే తమ అధినేత పవన్ ను సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిందని, ఆ పార్టీతో తెగతెంపులు చేసుకొని టీడీపీతో పొత్తుకు సిద్ధపడుతున్నందున తమకే తొలి రెండున్నరేళ్ల సీఎం ఛాన్స్ ఇవ్వాలని జనసేన పట్టుబడుతోందట. ఈ దశలో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్టు సమాచారం. త్వరలోనే చర్చలు మళ్లీ కొనసాగిద్దాం అని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి.

ఈ నెలలోనే ప్రకటిస్తారా?

జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 14న, టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 29న జరుగనున్న నేపథ్యంలో పొత్తుల ప్రకటన ఈ రెండింటిలో ఏదో సందర్భంలో చేయాలని చంద్రబాబు భావిస్తున్నారట. గతంలో పవన్‌ కల్యాణ్‌ కూడా మార్చి 14న జరిగే సమావేశంలో అందరితో చర్చించాకే పొత్తులపై నిర్ణయం తీసుకుందాం. అంతవరకు దీనిపై ఎవరూ ప్రకటనలు ఇవ్వొద్దు అని జనసేన నేతలకు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల ఫార్ములా ద్వారా పవన్‌ను ఆకర్షించి పొత్తును ఖరారు చేసుకోవాలని చంద్రబాబు యత్నిస్తున్నారు.

బీజేపీ నేత సోమువీర్రాజు పవన్‌ను గతంలో ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆ పార్టీతో కలసి ఎన్నికలకు వెళితే అధికారంలోకి వచ్చే అవకాశం లేనందున జనసేన కమలనాథులకు కటీఫ్‌ చెప్పడానికే మొగ్గు చూపుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయని ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన చంద్రబాబు జనసేనపై ఒత్తిడి పెంచి త్వరగా పొత్తు ప్రకటన చేయించాలని చూస్తున్నారని అంటున్నారు. అయితే చంద్రబాబును నమ్మి ఇంత ముందుగా బీజేపీకి దూరం జరగడం కరెక్టేనా? అని జనసేన నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ సమీకరణల నేపథ్యంలో ఈ నెలలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి