iDreamPost

కొత్త జిల్లాలకే కమిట్ అయిన టీడీపీ, పదవుల వద్దంటున్న తెలుగు తమ్ముళ్లు

కొత్త జిల్లాలకే కమిట్ అయిన టీడీపీ, పదవుల వద్దంటున్న తెలుగు తమ్ముళ్లు

పీకల్లోతు కష్టాల్లో ఉన్న పార్టీని కాపాడేందుకు టీడీపీ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. ఏదో రకంగా గట్టెక్కాలని శతవిధాలా చూస్తోంది. జగన్ కి వ్యతిరేకంగా వేస్తున్న ఎత్తులన్నీ ఫలించకపోవడంతో సతమతం అవుతోంది. ఇటు అంతర్గతంగానూ, ఇటు ప్రజాక్షేత్రంలోనూ పార్టీ పుంజుకునే అవకాశం లేదని అర్థమవుతున్నా తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. అందుకు తగ్గట్టుగా తాజాగా మరో ప్రయత్నంతో ముందుకు వస్తోంది. పార్టీ నిర్మాణం విషయంలో మార్పులు చేస్తోంది. కొత్త నేతలకు పట్టం గట్టే పని మొదలుపెట్టింది.

ఏపీలో తాము అధికారంలోకి వస్తే జిల్లాల పునర్నిర్మాణం చేస్తామని జగన్ ప్రకటించారు. తన మ్యానిఫెస్టో అమలుకి పూనుకున్నారు. ఇప్పటికే కమిటీ వేసి రాబోయే ఆర్థిక సంవత్సరం నాటికి కొత్త జిల్లాల్లో పాలన వైపు అడుగులేస్తున్నారు. ఈ తరుణంలో టీడీపీ కూడా తన పార్టీలో మార్పులు చేసుకుంటూ జిల్లా అధ్యక్షుల స్థానంలో కొత్తగా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులను ప్రకటించాలని నిర్ణయించింది. ఇప్పటికే వైఎస్సార్సీపీ ఈ విధానం అమలు చేస్తోంది. కాగా త్వరలో రాబోయే కొత్త జిల్లాలకు అనుగుణంగా ఇప్పుడు టీడీపీ కూడా అదే దారిలో నడుస్తోంది.

ఏపీలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులను ప్రకటించేందుకు చంద్రబాబు జాబితా సిద్ధం చేశారు. అయితే ఈ లిస్టులో కొందరు నేతలు తమకు పదవులు వద్దని నిరాకరించడంతో పలు మార్పులు చేయాల్సి వచ్చిందని సమాచారం. టీడీపీలో ఇన్నాళ్లుగా పదవుల కోసం పోటీ పడిన నేతలు ఇప్పుడు తమకు అవసరం లేదని చెప్పడం , బాధ్యతల నుంచి దూరమయ్యేందుకు మొగ్గు చూపడం విశేషంగా మారింది. దాంతో పలు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో తగిన నాయకత్వం లేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఉన్నవారిలో కాస్త మెరుగైన వారితో పోస్టు నింపాలని నిర్ణయించుకున్న చంద్రబాబు తుది జాబితా ప్రకటిస్తున్నారు.

ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండడం, మళ్లీ కోలుకుంటుందో లేదోననే సందేహాలు చుట్టుముట్టడం, పైగా జగన్ సర్కారు దూకుడు చూసిన చాలామంది నేతలు పార్టీ బాధ్యతలకు ససేమీరా అనడంతో టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారుతున్నట్టు చెప్పవచ్చు. అదే సమయంలో టీడీపీ కొత్త బాధ్యతల్లోకి వచ్చే వారికి పార్టీ కార్యాలయాల నిర్వహణ పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంటుందని ఆశ చూపుతున్న తీరు ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. ఏమయినా టీడీపీ నేతలు జగన్ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు సమాయత్తమవుతుండగా, పార్టీలో ఉన్న పరిస్థితి ఏమేరకు దానికి అనుకూలిస్తుందనేది అనుమానంగా మారుతోంది. అంతేగాకుండా కొత్త నేతల సారధ్యంలో ఆయా కమిటీల పునరుత్తేజం సాధ్యమేనా అనే సందేహౄలు కూడా వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి