iDreamPost

నేరం బాబుది, నెపం జగన్ పై – ఏపీ పాలిటిక్స్ లో నయా పోకడ.

నేరం బాబుది, నెపం జగన్ పై –  ఏపీ పాలిటిక్స్ లో నయా పోకడ.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. జగన్ ఏది చేసినా నేరమే అన్నట్టుగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం చుట్టూ న్యాయ పరమైన వివాదం రాజేయడం ఆనవాయితీగా తయారయ్యింది. అందుకు తోడుగా ఇప్పుడు గత ప్రభుత్వ నిర్ణయం అమలు చేసినా నేరమే అనే వరకూ వచ్చేసింది. పైగా ఆ నిర్ణయం చేసి,అమలు చేసిన వాళ్లే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. సామాన్య ప్రజలు కూడా ఆశ్చర్యపోయేలా విపక్షాలు వ్యవహరిస్తున్న తీరు విడ్డురంగా మారుతోంది.

చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నకాలంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. పైగా దేవాదాయ ధర్మాదాయ శాఖను ఆ పార్టీకే చెందిన మాణిక్యాలరావు నిర్వహించారు. ఆ కాలంలోనే 2016 జనవరి 30న రిజల్యుషన్ నంబర్ 253 విడుదల అయ్యింది. దాని ప్రకారం టీటీడీ కి చెందిన నిరర్ధక ఆస్తుల అమ్మకానికి అనుమతి ఇచ్చారు. పైగా పలుచోట్ల అమ్మకాలు కూడా సుదీర్ఘ కాలంగా సాగుతున్న వ్యవహారమే అని రికార్డులు చెబుతున్నాయి. అంతేగాకుండా విజయనగరం మాన్షాస్ ట్రస్ట్ భూములను ఏకంగా ఎయిర్ పోర్ట్ కి కేటాయించిన అనుభవం కూడా బాబు-బీజేపీ ప్రభుత్వానికి ఉంది. ఇక మహారాష్ట్ర లో మొన్నటి వరకు అధికారం వెలగబెట్టిన బీజేపీ ప్రభుత్వం శని సింగణాపూర్ సహా పలు దేవస్థానాల ఆస్తులు విక్రయించిన చరిత్ర ఉంది.

గతం పూర్తిగా విస్మరించి ఇప్పుడు ఇరు పార్టీలు నిజంగానే దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు పాటు పడుతున్నట్టు ప్రజలను నమ్మించేందుకు విశ్వయత్నాలు చేస్తున్నాయి. ఆయా పార్టీలు, నేతల మాదిరి ప్రజలంతా గత ప్రభుత్వ చర్యలు మరచిపోవాలని ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా తాజాగా టీటీడీ ఆస్తుల విషయంలో బోర్డు నిర్ణయాన్ని వివాదం గా మార్చేందుకు శతవిధాల యత్నిస్తున్నారు. అయితే తాజా పరిణామాలతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. విపక్షాల వింత పోకడలకు విరుగుడుగా గత సర్కారు జీవో ని నిలుపుదల కి పూనుకోవడం విశేషంగా మారింది.

నిరర్ధక ఆస్తుల అమ్మకాలకు మూలమైన చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని నిలుపుదల చేయడం తో టీడీపీ నేతలు ఖంగుతినాల్సి వచ్చింది. ఏపీలో పదే పదే మత సంబంధిత అంశాలను వివాదంగా మార్చేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు బట్టబయలు అయ్యాయి. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించిన ప్రభుత్వం ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకున్న తీరు చాటిచెప్పింది. అదే సమయంలో ఈ భూముల్లో టీటీడీ దేవాలయ నిర్మాణాలు, ధర్మ ప్రచారాలు, మతపరమైన అంశాలకు వినియోగించే అవకాశం ను పరిశీలించాలి అంటూ టీటీడీ ని కోరడం విశేషం. ఈ అన్ని అంశాలు పరిశీలించే వరకు భూముల విక్రయాల ప్రక్రియను నిలుపుదల చేసింది. జగన్ పాలనలో ప్రతీది వివాదం చేసేందుకు విపక్ష పార్టీల యత్నాలు ఈ వ్యవహారం తో మరోసారి స్పష్టం అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి