iDreamPost

నాలుగు నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జులు

నాలుగు నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జులు

రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్తగా పార్టీ ఇంఛార్జులను నీయమిస్తున్నట్టు తెలుగుదేశం ప్రకటించింది. ఈ మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనని విడుదల చేసింది. ఏలూరు నియోజకవర్గానికి బడేటి రాధా కృష్ణయ్య (చంటి), గుడివాడ నియోజకవర్గానికి రావి వెంకటేశ్వరరావు, బాపట్ల నియోజకవర్గానికి వేగేశన నరేంద్ర వర్మ, మాచర్ల నియోజకవర్గానికి కొమ్మారెడ్డి చలమా రెడ్డి ని నీయమిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయ మీడియా సమన్వయకర్త దారపునేని నరేంద్ర బాబు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఒకప్పుడు ఫ్యాక్షన్, మావోయిస్టుల ప్రభావాలయం ఎక్కువగా ఉన్న మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పగ్గాలు మళ్ళీ కొమ్మారెడ్డి చలమారెడ్డి కే అప్పగించారు. పార్టీ సీనియర్ నాయకుడి గా ఉన్న చలమారెడ్డి 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తోలి జాబితాలోనే టికెట్ ఖరారైనట్టు వార్తలొచ్చినప్పటికీ, అప్పటి పార్టీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల రెడ్డి చివరి నిమిషంలో జూలకంటి బ్రహ్మారెడ్డి ని తెరపైకి తీసుకురావడంతో చలమారెడ్డికి రావాల్సిన టికెట్ అప్పటికే పార్టీ తరుపున ఒకసారి పోటీ చేసి ఓటమి పాలైన జూలకంటి బ్రహ్మారెడ్డినే వరించిందని ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో బ్రహ్మారెడ్డి ఓడిపోవడంతో రాజకీయాలకు దూరమయ్యారు. ఆతరువాత వచ్చిన ఉప ఎన్నికల్లో చిరుమామిళ్ళ మధుని అభ్యర్థిగా బరిలోకి దించినప్పటికీ అతను కూడా ఓటమి పాలయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి చివరి నిమిషంలో పార్టీ అభ్యర్ధిగా చలమారెడ్డి పేరు ఖరారయింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందినప్పటికీ ఆ తరువాత ఐదేళ్ల పాటు నియోజకవర్గ ఇంచార్జ్ గా కొనసాగారు. అయితే 2019 ఎన్నికల్లో చలమారెడ్డిని కాదని హైదరాబాద్ నుండి పారిశ్రామికవేత్త అంజి రెడ్డిని రంగంలోకి దింపారు. అయితే ఓటమి తరువాత అంజిరెడ్డి నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో చివరికి మాచర్ల తెలుగుదేశానికి చలమారెడ్డే దిక్కయ్యారు. 1999 తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించకపోవడం విశేషం.

బాపట్ల నియోజకవర్గ పార్టీ పగ్గాలను పార్టీనేత వేగేశన నరేంద్రవర్మ కు అప్పగించారు. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన అన్నం సతీష్ ప్రభాకర్ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆనియోజకవర్గంలో దాదాపు ఎనిమిది నెలలుగా పార్టీ కార్యకర్తలకు వేగేశన నరేంద్ర వర్మ అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికలకు రెండు మూడు సంవత్సరాల ముందునుండే నియోజకవర్గ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వేగేశన నరేంద్రవర్మ గత ఎన్నిలకల్లో టికెట్ ఆశించినప్పటికీ అతనికి టికెట్ లభించలేదు. వ్యాపారవేత్త అయిన నరేంద్రవర్మ వేగేశన ఫౌండేషన్ పేరుతొ గత కొంతకాలంగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కృష్ణాజిలా గుడివాడ నియోజకవర్గ ఇంచార్జ్ భాద్యతలను మరోసారి రావి వెంకటేశ్వరరావుకే అప్పగించారు. గతంలో గుడివాడ నుండి ప్రాతినిధ్యం వహించిన రావి వెంకటేశ్వరరావు మాజీ సశాసన సభ్యడు రావి శోభనాద్రి గారి కుమారుడు. ఎమ్మెల్యే గా ఎన్నికైన తన అన్న రావి హరి గోపాల్ అకాల మరణంతో 2000 లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టారు. తరువాత ప్రస్తుత రాష్ట్ర మంత్రి కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయంతో గుడివాడ టికెట్ దక్కడంతో రావి వెంకటేశ్వరరావు పోటీకి దూరంగా ఉన్నాడు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన తరువాత ఆయన చంద్రబాబు ఆహ్వానంతో తిరిగి తెలుగుదేశంలో చేరారు. 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసినప్పటికీ కొడాలి నాని చేతిలో ఓటమి పాలయ్యారు. తరువాత నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ గా కొనసాగినప్పటికీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు చివరి నిమిషంలో రావి వెంకటేశ్వరరావుని కాదని దేవినేని అవినాష్ ని తెరమీదకు తీసుకొచ్చారు.

ఏలూరు నియోజకవర్గానికి నూతన ఇంచార్జ్ గా పార్టీ అధిష్టానం బడేటి రాధాకృష్ణయ్య ( చంటి) ని నియమించింది. మొన్నటి వరకు పార్టీ ఇంచార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అకాలమరణంతో ఆ స్థానంలో కొత్తగా బడేటి రాధాకృష్ణయ్య ని నియమించింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి