iDreamPost

TCSలో రూ.100 కోట్ల భారీ స్కామ్‌.. లంచం ఇస్తేనే ఉద్యోగం

  • Published Oct 16, 2023 | 11:05 AMUpdated Oct 16, 2023 | 11:05 AM
  • Published Oct 16, 2023 | 11:05 AMUpdated Oct 16, 2023 | 11:05 AM
TCSలో రూ.100 కోట్ల భారీ స్కామ్‌.. లంచం ఇస్తేనే ఉద్యోగం

టాటా సంస్థ అంటే.. నమ్మకానికి మారు పేరు అన్నట్లుగా పేరు సంపాదించుకుంది. ఉప్పు మొదలు.. టాటా సంస్థలు ఎంట్రీ లేని రంగం లేదు అంటే అతిశయోక్తి కాదు. మరీ ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్‌ రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సంస్థకు ఉన్న గుర్తింపు ఎంతో గొప్పది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 46 దేశాల్లో.. ఏకంగా 150కి పైగా ప్రాంతాల్లో టీసీఎస్‌ బ్రాంచ్‌లు ఉన్నాయి. దేశంలోనే అతి పెద్దదయిన ఈ ఐటీ కంపెనీలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ కంపెనీలో జాబ్‌ అంటే.. ఇక భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం లేదు అనేలా పేరు సంపాదించుకుంది.

ఇన్నాళ్లు టీసీఎస్‌ అనగానే అందరికి లాభాలు అనే గుర్తుకు వస్తుంది. కానీ తొలిసారి టీసీఎస్‌ సంస్థకు సంబంధించి సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థలో ఏకంగా 100 కోట్ల రూపాయల స్కామ్‌ వెలుగు చూసింది. విశ్వసనీయత, నమ్మకానికి మారు పేరుగా గుర్తింపు తెచ్చుకున్న టీసీఎస్‌లో లంచం ఇస్తేనే ఉద్యోగం అనే వార్త.. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ వివరాలు..

బ్రైబ్స్ ఫర్ జాబ్స్(ఉద్యోగం కావాలంటే లంచం ఇవ్వాల్సిందే) కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ స్కామ్‌ వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో.. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు తేలిన 16 మంది ఉద్యోగులను తొలగించింది టీసీఎస్‌. అలాగే 6 నియామక సంస్థలను డిబార్ చేసింది. అక్టోబర్ 15న అనగా ఆదివారం నాడు ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఇందుకు సంబంధించిన విషయాన్ని వెల్లడించింది టీసీఎస్.

కంపెనీలో ఉద్యోగుల నియామకంలో చూసిచూడనట్లు వ్యవహరించేందుకు గాను కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు.. కొన్ని నియామక సంస్థలు లంచాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై టీసీఎస్ దర్యాప్తు చేపట్టింది. నెలల పాటు సాగిన ఈ దర్యాప్తు తాజాగా ముగింపు దశకు వచ్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న 19 మంది ఉద్యోగులపై టీసీఎస్‌ చర్యలు తీసుకుంది. వీరిలో ఏకంగా 16 మందిని ఉద్యోగంలోంచి తొలగించగా.. ముగ్గురిని నియామకాలకు సంబంధించిన విధుల నుంచి మార్చింది.

ఈ సందర్భంగా టీసీఎస్‌ ఎక్సేంజ్‌ ఫైలింగ్‌కు ఇచ్చిన సమాచారంలో ‘‘బ్రైబ్స్‌ ఫర్‌ జాబ్స్‌ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ స్కామ్‌లో 19 మంది ఉన్నట్లు తేలింది. వారందరిపై చర్యలు తీసుకున్నాం. అందులో 16 మందిని కంపెనీ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో.. వారందరిని ఉద్యోగంలోంచి తొలగించాం. ముగ్గురిని మానవ వనరుల విభాగం నుంచి మార్చాం’’ అని వెల్లడించింది.

అలాగే 6 నియామక సంస్థలు, వాటి ఓనర్ల గుర్తింపును రద్దు చేసినట్లు ప్రకటించింది. లంచం ఆరోపణలు వచ్చిన క్రమంలో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మానవ వనరుల విభాగంలో తరుచుగా రొటేషన్ పద్ధతిలో సిబ్బందిని మార్చుతామని వెల్లడించింది. అలాగే నియామక సంస్థల వివరాలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. టీసీఎస్ కోడ్ ఆఫ్ కండక్ట్ కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని సంస్థ చెప్పుకొచ్చింది. ఈ కుంభకోణం వల్ల కంపెనీలో ఎలాంటి మోసం జరగలేదని, సంస్థపై ఎలాంటి ఆర్థిక ప్రభావం ఉండదని పేర్కొంది. ఏది ఏమైనా టీసీఎస్‌లో ఇలాంటి స్కామ్‌ వెలుగు చూడటం మాత్రం సంచలనంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి