iDreamPost

మనసున్న మారాజులు టాటాలు

మనసున్న మారాజులు టాటాలు

ఒకప్పుడు ఐశ్వర్యవంతులు అన్న పదానికి పర్యాయపదంగా టాటాలు, బిర్లాలు అనేవారు. కాలం గడిచేకొద్థీ కొత్త వ్యాపారాలు వచ్చాయి: పవర్, మీడియా, సాఫ్టువేర్ లాంటివి. కొత్త వ్యాపార కుటుంబాలు, గ్రూపులు వచ్చి ఐశ్వర్యవంతుల జాబితాలో కొందరు టాటా, బిర్లాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఈ నూతన ఐశ్వర్యవంతులకీ టాటాలకీ ఉన్న ముఖ్యమైన తేడా కోర్ వాల్యూస్. సామాజిక బాధ్యత, దాతృత్వం అనేవి అందులో ముఖ్యమైనవి.

1870లో టాటా గ్రూప్ ఫౌండర్ జెంషెట్జీ టాటా 21 వేల రూపాయలతో ఒక ట్రేడింగ్ కంపెనీ నెలకొల్పడంతో టాటా గ్రూపుకి పునాది వేసినప్పుడు నాలుగు లక్ష్యాలు పెట్టుకున్నాడు. ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ, ఒక ఉక్కు పరిశ్రమ, ప్రపంచ స్థాయి విద్యా సంస్థ, ఒక మంచి హోటల్ నిర్మించడం ఆ నాలుగు లక్ష్యాలు.

జెంషెట్జీ జీవితకాలంలోనే హోటల్ తాజ్ నిర్మాణం 1903లో జరిగింది. ఆయన తదనంతరం కుమారుడు డోరాబ్జీ టాటా టాటా స్టీల్ కంపెనీ, హైడ్రో ఎలక్ట్రిక్ కంపెనీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిర్మించి మిగిలిన మూడు లక్ష్యాలు పూర్తి చేశారు. 

టాటాలు వ్యాపార విస్తరణతో పాటు అనేక దాన ధర్మాలు కూడా చేస్తూ వచ్చారు. దేశ విదేశాల్లో అనేక విద్యాలయాలకు ఆర్థిక సహాయం చేశారు. జేఆర్డీ టాటా ప్రారంభించిన విమానయాన సంస్థ అ తర్వాత కాలంలో ఎయిర్ ఇండియాగా మారింది.

ఇలా కేవలం ధనార్జన మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకుండా విపత్కర కాలంలో చేతికి ఎముక లేదన్నట్టుగా వితరణ చేయడమనే టాటాల సంప్రదాయం రతన్ టాటా గారు కొనసాగించి తమ ప్రతిష్ఠను మరింత పెంచారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి