iDreamPost

వెంకటేష్ కెరీర్లోనే మొదటిసారి

వెంకటేష్ కెరీర్లోనే మొదటిసారి

గత ఏడాది ఎఫ్2తో ఒక ఇండస్ట్రీ హిట్ ని, వెంకీ మామతో ఓ డీసెంట్ కమర్షియల్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప షూటింగ్ లో యమా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కీలక భాగం మొత్తం పూర్తి చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ రీమేక్ గా రూపొందుతున్న నారప్పకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. సాఫ్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని తెరకెక్కించడంలో పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ ఇంత రా సబ్జెక్టుని ఎలా డీల్ చేస్తాడా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. దానికి పోస్టర్ల రూపంలోనే సగం చెక్ పెట్టేశారు. నారప్ప సమ్మర్ లోనే వచ్చేస్తుంది.

దీని తర్వాత వెంకీ ఏ సినిమా చేస్తాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు త్వరలోనే ఆ గుడ్ న్యూస్ అందేలా ఉంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మించే సినిమా తాలుకు స్క్రిప్ట్ ఆల్మోస్ట్ ఓకే అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని మీద గత ఏడాదిగా వర్క్ చేస్తున్న తరుణ్ భాస్కర్ కథను ఆశించిన విధంగా ఓ కొలిక్కి తెచ్చాడట. సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నారప్ప విడుదల కాగానే దీన్ని మొదలుపెట్టొచ్చని వినికిడి. ఇందులో మరో విశేషం ఉంది. వెంకటేష్ ఇందులో గుర్రాలను నడిపే రైడర్ గా ఓ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడట. ఇప్పటిదాకా వెంకీ ఇలాంటి జాకీ పాత్రలో ఎప్పుడూ నటించలేదు.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తీసుకుని ఈ క్రీడను స్టోరీలో కీలక భాగంగా నడిపిస్తాడట తరుణ్ భాస్కర్. గురు లాంటి జానరే అనిపిస్తున్నా ఇందులో చాలా డిఫరెంట్ ట్రీట్ మెంట్ ఉంటుందని తెలిసింది. పెళ్లి చూపులుతో మొదటి సినిమాకే పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైందితో జస్ట్ పాస్ అనిపించుకున్నాడు. హీరోగా మీకు మాత్రమే చెప్తా ట్రై చేశాడు కానీ అది వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడో టీవీ ఛానల్ కోసం యాంకర్ గా కూడా మారాడు. ఇన్ని పాత్రల మధ్య వెంకటేష్ స్క్రిప్ట్ రెడీ చేయడం విశేషమే. ఇంకో ఫైనల్ సిట్టింగ్ అయ్యాక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ మధ్య కొంత గ్యాప్ తీసుకున్న వెంకీ ఇకపై ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లానింగ్ లో ఉన్నారట. అన్ని కన్ఫర్మ్ అయ్యాక హీరొయిన్, టెక్నికల్ టీం తదితర వివరాలు ప్రకటిస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి