iDreamPost

తమిళనాట పొద్దు పొడుస్తోంది.. డీఎంకే ఆధిక్యంతో స్టాలిన్ కల నెరవేరబోతోంది..

తమిళనాట పొద్దు పొడుస్తోంది.. డీఎంకే ఆధిక్యంతో స్టాలిన్ కల నెరవేరబోతోంది..

తమిళనాడులో ఉద్దండులైన రాజకీయ దిగ్గజాలు జయలలిత, కరుణానిధి లేకుండా జరిగిన తొలి ఎన్నికల్లో అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయి. డీఎంకే అధికార పీఠానికి చేరువవుతోంది. ఆపార్టీ నాయకుడు స్టాలిన్ సీఎంగా ఎన్నికయ్యేందుకు వీలుగా ఓటర్లు తీర్పునిచ్చారు. దాంతో సంపూర్ణ ఆధిక్యం దిశగా సాగతున్న డీఎంకే దశాబ్దకాలం విరామం తర్వాత అధికారంలోకి రాబోతోంది.

తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలకు గానూ తొలి రౌండ్లలో డీఎంకే కూటమికి 120 కి పైగా స్థానాల్లో ఆధిక్యం దక్కింది. అన్నాడీఎంకే కి 75 చోట్ల మెజార్టీ దక్కింది. దాంతో తమిళనాడు ఓటర్లు ఈసారి ఏకపక్ష తీర్పు ఇవ్వలేదని స్పస్టమవుతోంది. సహజంగా ఏదో ఒకపార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టే తమిళులు ఈసారి దానికి భిన్నంగా ప్రతిపక్షానికి కూడా బలమైన పాత్ర పోషించడానికి అవకాశం ఇవ్వబోతున్నట్టు కనిపిస్తోంది.

Also Read : నాగార్జున సాగ‌ర్ బై పోల్ : దూసుకెళ్తున్న కార్‌

తమిళనాడులో బీజేపీ తో కూటమి కట్టిన అన్నా డీఎంకే అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. పోలింగ్ ముందు వరకూ వివిధ ఎత్తులు వేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి డీఎంకేని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చివరకు డీఎంకే ఆధిక్యం సాధిస్తుండడం విశేషం. డీఎంకే, కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కలిపి కూటమిగా బరిలో దిగాయి. ప్రాధమిక సమాచారం ప్రకారం తమిళనాడు అసెంబ్లీలో బోణీ కొట్టాలనే బీజేపీ ప్రయత్నాలు ఇప్పటి వరకూ నెరవేరలేదు. కాంగ్రెస్ కూడా ఖాతా తెరుస్తుందా లేదా అన్నది చూడాలి.

భారీ సంక్షేమ పథకాలకు హామీలిచ్చి తమిళనాడు ఓటర్లను ఇరు కూటమిలు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాయి.కానీ చివరకు ఓటర్లు మాత్రం డీఎంకేని ఆదరించడంతో చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఎంకే స్టాలిన్ కల నెరవేరబోతోంది. ముఖ్యమంత్రి పీఠం కోసం సుదీర్ఘ ప్రయత్నాలు తర్వాత ఆయన లక్ష్యం చేరుతున్నారు. ఇప్పటికే తమిళనాడులో డీఎంకే శ్రేణులు విజయోత్సవాలు ప్రారంభించాయి.

Also Read : అంచనాలకు అనుగుణంగానే కేరళ ఎర్రబారుతోంది..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి