iDreamPost

డీఎంకే నేతల ఇళ్లపై వరుస ఐటీ రైడ్స్ దేనికి సంకేతం..?

డీఎంకే నేతల ఇళ్లపై వరుస ఐటీ రైడ్స్ దేనికి సంకేతం..?

తమిళనాడులో ఎన్నికల హడావుడి.. ప్రచారంలో రాజకీయ నేతలు బిజీ బిజీగా వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే నాయకులపై వరుస ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కుమార్తె ఇంట్లో ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్నారు.

కాగా ఏప్రిల్ 6 న జరిగనున్న ఎన్నికలకు ముందు డీఎంకే నేతలు, పార్టీతో సంబంధం ఉన్న వారి ఇళ్లపై ఐటీ దాడులు జరగడం ఇది రెండవసారి. గ‌త నెల‌లో డీఎంకే నేత ఈ వేలూ నివాసంతోపాటు 10కి పైగా చోట్ల ఐటీశాఖ సోదాలు చేసింది. పోలింగ్ దగ్గరపడుతున్న వేళ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ అల్లుడు శబరీశన్‌ నివాసంలో ఆదాయ పన్నుశాఖ శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది. నీలంగరాయ్‌లోని శబరీశన్‌ నివాసంతో పాటు చెన్నైలో ఆయనకు సంబంధించిన మరో మూడు కార్యాలయాల్లో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.

స్టాలిన్ ఎన్నికల కోర్ కమిటీలో శబరీశన్ కీలక వ్యూహకర్తగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఆస్తులు ఒక్కసారిగా ఎలా పెరిగాయని స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ప్రశ్నించిన మర్నాడే శబరీశన్ నివాసంలో దాడులు జరగడం గమనార్హం. కోయంబత్తూరు సమీపంలోని గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read : రంగస్వామే మా నాయకుడు ,సీఎంని మాత్రం అమిత్ షా నిర్ణయిస్తాడు అంటున్న బీజేపీ

గత నెల ఆ పార్టీ సీనియర్‌ నేత ఈవీ వేలు నివాసంలో ఆదాయ పన్ను అధికారులు మెరుపు దాడి చేసి, తనిఖీలు నిర్వహించారు. వేలు నివాసం సహా ఆయన కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మొత్తం 10 చోట్ల సోదాలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో నగదు ప్రవాహం జరగుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు.

తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 6న ఓకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 2న వెల్లడికానున్నాయి. పదేళ్లుగా 2011 నుంచి అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. కాంగ్రెస్‌, వాపక్షాలు, ఎండీఎంకే, వీసీకే వంటి పార్టీలతో కూటమిగా ఏర్పడి ప్రచారంలో దూసుకెళుతోంది. స్టాలిన్‌ కొలతూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ చెపాక్‌ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పాల్గొంటున్నారు.

డీఎంకే విజయావకాశాలను దెబ్బ తీయడానికి బీజేపీ నే ఇలా ఐటీ దాడులు చేపిస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎలాగైనా సరే డీఎంకే ఆర్థిక వనరులను అడ్డుకొని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తోంది. బీజేపీ వ్యూహాలు ఎంత మేరకు ప్రభావం చూపిస్తాయో మే 2వ తేదీ తేలనుంది.

Also Read : తమిళుల ఓట్ల కోసం బీజేపీ పాట్లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి