iDreamPost

తమిళనాడు పోలింగ్ – బీజేపీపై నటుడు విజయ్ పెట్రో బాంబ్

తమిళనాడు పోలింగ్ – బీజేపీపై నటుడు విజయ్ పెట్రో బాంబ్

తమిళనాడు ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ సైకిల్ పై పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మామూలుగా అయితే ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. సినీ నటుడు కనుక వెరైటీగా.. అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇలా సైకిల్ పై వెళ్లారనుకోవచ్చు. కానీ దేశంలో పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా ఇలా సైకిల్ పై వచ్చినట్లు విజయ్ చెప్పుకొచ్చారు. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ లీటరు రూ. 95 పైనే ఉంది. కొన్ని చోట్ల రూ. 100 కూడా ఉందని.. ధరలను అదుపు చేయడంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ విఫలమైందని ఆయన పరోక్షంగా ఆరోపించారు. పోలింగ్ రోజే బీజేపీపై ఓ సెలెబ్రిటీ విమర్శలు గుప్పించడం కలకలం రేపింది. ఇంతకీ. విజయ్ కి బీజేపీపై అంత ఆగ్రహమెందుకన్న చర్చ ప్రారంభమైంది.

ఐటీ దాడులతో రచ్చ

బీజేపీ, విజయ్ ల మధ్య ప్రచ్ఛన్న యుద్దానికి ఫిబ్రవరిలో జరిగిన ఐటీ దాడులు ఆజ్యం పోశాయి. బిగిల్ సినిమా రెమ్యూనరేషన్, ఆ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ద్వారా వచ్చిన ఆదాయానికి పన్ను ఎగవేశారన్న ఆరోపణలతో చెన్నైలో నటుడు విజయ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. నైవేలిలో షూటింగ్ లో ఉన్న విజయ్ ని అక్కడి నుంచి ప్రశ్నించడానికని తీసుకెళ్లారు. బిగిల్ నిర్మాణ సంస్థ ఏజీఎస్ సినిమాస్, ఫిల్మ్ ఫైనాన్సియర్ అన్బు చేజియన్ కార్యాలయాల్లోనూ సోదాలు జరిపారు. అక్కడ రూ.77 కోట్ల నగదు, విజయ్ ఇంట్లో పన్ను ఎగవేతను నిర్ధారించి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడులపై విజయ్ స్పందిస్తూ రజనీకాంత్ లా సీఏఏను సమర్ధించి ఉంటే ఐటీ దాడుల నుంచి తప్పించుకునేవాడిని. కానీ నేను ద్రవిడుడిని.. మతతత్వ పార్టీల బెదిరింపులకు లొంగను..అని ప్రకటించడంతో కాక రేగింది. దాంతో విజయ్ పై తమిళనాడు బీజేపీ బహిరంగ యుద్ధానికి దిగింది. నిషేధిత ప్రాంతమైన నైవేలి లీగ్నైట్ సంస్థ ప్రాంగణంలో విజయ్ సినిమా షూటింగును నిలిపివేయాలంటూ అక్కడ ధర్నా చేసింది.

సినిమాల్లోనూ కేంద్రంపై సెటైర్లు..

తనపై ఐటీ రైడ్స్ జరిపించినందుకు విజయ్ బీజేపీపై కక్ష కడితే.. తన సినిమాల్లో కేంద్రంపై సెటైర్లు వేస్తున్నారని బీజేపీ ఆయనపై ఆగ్రహంతో ఉంది. అందుకు తగినట్లే.. బిగిల్, మాస్టర్, మెర్సెల్ సినిమాల్లో జీఎస్టీ, నోట్ల రద్దు, డిజిటల్ ఇండియా వంటి కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పలు డైలాగులు ఉన్నాయి. అలాగే బీజేపీ మతతత్వ వాదాన్ని ప్రశ్నించేలా ఆలయాలకు బదులు ఆస్పత్రులు కట్టాలని ఎందుకు ఆలోచించారని.. మెర్సెల్ సినిమాలో తన పాత్ర ద్వారా విజయ్ ప్రశ్నించడంతో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. విజయ్ అసలు పేరు విజయ్ జోసెఫ్ అని అతను ఫక్తు క్రిస్టియన్ అయినందున ఇలా ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు. అదే చర్చ్ ల ముందు ఆస్పత్రులు ఎందుకు కట్టడంలేదని ప్రశ్నించవచ్చు కదా అని నిలదీశారు. ఈ వివాదాల నేపథ్యంలోనే పెట్రో ధరలకు నిరసనగా విజయ్ సైకిల్ పై వచ్చి ఓటు వేయడం రాజకీయ రంగు సంతరించుకుంది.

Also Read : ఏ కూటమికి తమిళుల ఓటు