iDreamPost

తమిళుల ఓట్ల కోసం బీజేపీ పాట్లు

తమిళుల ఓట్ల కోసం బీజేపీ పాట్లు

ఓట్ల కోసం రాజకీయ నాయకులు పడే పాట్లు మామూలుగా ఉండవు. నానా ఫీట్లు చేస్తుంటారు. ఓటర్ల ఇండ్లలో పనులు చేస్తూ ఫొటోలకు పోజులిస్తుంటారు. ఇక తమిళనాడులో ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. చోటామోటా నాయకులే కాదు.. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకోసం రంగంలోకి దిగింది.

రజనీపై రాజకీయం కలిసొస్తుందా?

తమిళనాడులోనే కాదు.. దేశ విదేశాల్లోనూ క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్. తాను పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించి.. తర్వాత మనసు మార్చుకున్నారాయన. రాజకీయాల్లోకి రావట్లేదని చెప్పి సంచలనం సృష్టించారు. ఈ క్రమంలో తమిళనాడులో లక్షలాది మంది రజనీ ఫ్యాన్స్ ను తమ వైపు తిప్పుకునేందుకు.. బీజేపీ గట్టి ప్లాన్ వేసింది. ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించి.. ఆశ్చర్యం కలిగించింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు రజనీ అన్నివిధాలుగా అర్హులే అయినా.. అవార్డు ప్రకటించిన సందర్భమే విమర్శలకు దారి తీసింది. ఓట్ల కోసమే రజనీకి బీజేపీ అవార్డు ప్రకటించిందనే ఆరోపణలు మొదలయ్యాయి. ఒకవేళ రజనీ రాజకీయాల్లో కొనసాగి ఉంటే.. ఇదే బీజేపీ అవార్డు ప్రకటించి ఉండేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

కొనుగోలు పాలిటిక్స్.. 

గత నెలలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తయారు చేసిన వస్తువులను ప్రధాని మోడీ కొన్నారు. తమిళనాడులోని తోడా తెగ చేతివృత్తులవారు తయారు చేసిన శాలువ అద్భుతంగా ఉందని, తాను ఒకదాన్ని కొనుగోలు చేశానని తెలిపారు. వీటిని ‘ట్రైబ్స్ ఇండియా’ అమ్ముతుందని చెప్పారు. తమిళనాడు మాత్రమే కాదు.. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు చెందిన వస్తులను ఆయన కొన్నారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో ఓట్ల కోసమే మోడీ తరహా రాజకీయం చేస్తున్నారని అప్పుడే విమర్శలు వచ్చాయి.

తమిళ భాషపై ప్రేమ.. 

గతంలో మన్ కీ బాత్ ప్రోగ్రామ్​లో మాట్లాడిన మోడీ.. తమిళ భాష నేర్చుకోనందుకు బాధపడ్డానని అన్నారు.‘‘ఏదైనా చేయాలనుకున్నది మీరు చేయలేకపోయారా అని ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం నన్ను అడిగారు. దానికి నన్ను నేను ప్రశ్నించకున్నా. ప్రపంచంలోనే అతి పురాతమైన తమిళ భాషను నేను నేర్చుకునేందుకు తగినంత ప్రయత్నం చేయలేకపోయా. ఇది నన్ను బాధించిన విషయం. తమిళ సాహిత్యం అందమైనది’’ అని అప్పట్లో చెప్పారు. తమిళ భాషపై ఇప్పుడే ప్రేమ పుట్టుకొచ్చిందా? అంటూ ప్రతిపక్షాల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తాయి.

అభ్యర్థుల తిప్పలే తిప్పలు.. 

234 సీట్లు ఉన్న తమిళనాడులో బీజేపీ 20 సీట్లలో పోటీ చేస్తోంది. ఇక్కడ ఆ పార్టీ బలం చాలా తక్కువ. హిందీ భాష అంటేనే తమిళ ప్రజలకు చాలా కోపం. అప్పట్లో ఆ భాషను తమపై రుద్దేందుకు ప్రయత్నించిన బీజేపీ అన్నా అంతే కోపం. బీజేపీ కూడా ఇక్కడ ప్రధాన పార్టీ కాదు. అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తోంది. ఈ మధ్యే కాంగ్రెస్ నుంచి కుష్బూను పార్టీలోకి చేర్చుకుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో అభ్యర్థులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. చాలా చోట్ల అభ్యర్థులు అన్నాడీఎంకే కండువాలతో ప్రచారానికి వెళ్లాల్సిన పరిస్థితి. ఫ్లెక్సీల్లో కనీసం మోడీ ఫొటో కూడా పెట్టట్లేదు. ప్రచారంలో కూడా మోడీ కన్నా.. మాజీ సీఎం జయలలిత గురించే మాట్లాడుతున్నారట. తమ వ్యక్తిగత స్టామినా, అన్నాడీఎంకే మద్దతుతో గెలవాలని చూస్తున్నారట. అట్లుంది మరి తమిళనాడులో బీజేపీ ప్రచార తీరు.

Also Read : ర‌జనీకాంత్ ఓ మెస్మ‌రిజం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి