iDreamPost

Sutradharulu : విశ్వనాథ్ మార్కు రంగస్థలం

Sutradharulu : విశ్వనాథ్ మార్కు రంగస్థలం

రామ్ చరణ్ రంగస్థలంలో ఊరి పెద్ద జగపతిబాబు చేసే ఆగడాలకు హీరో, అతని అన్నయ్య ఎదురుతిరిగే క్రమాన్ని చూసి ప్రేక్షకులు దాన్ని బ్లాక్ బస్టర్ చేయడం చూశాంగా. కానీ ఇలాంటి కథాంశంతో ముప్పై ఏళ్ళ క్రితమే కళాతపస్వి కె విశ్వనాథ్ ఓ దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించారు. ఆ విశేషాలు చూద్దాం. 1989. అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పటికే హీరో పాత్రల నుంచి పక్కకు వచ్చేశారు. కథాబలం ఉంటే చాలు తనకు ప్రాధాన్యత ఎంత ఉందన్నది పట్టించుకునేవారు కాదు. ఆ క్రమంలో చాలా గ్యాప్ తర్వాత కె విశ్వనాథ్ తో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. ఈ అరుదైన కాంబినేషన్ తో దాన్ని సాకారం చేసుకున్న నిర్మాతలు కరుణాకరన్, సుధాకర్ లు.

అప్పట్లో ప్రతి గ్రామంలో హరిదాసుల సందడి ఎక్కువగా ఉండేది. సంక్రాంతి పండగనే కాదు ఊళ్ళో మంచైనా చెడైనా వీళ్ళ మేళతాళాలు పాటలు లేకుండా అసలేదీ జరిగేది కాదు. ఈ నేపధ్యాన్ని తీసుకున్నారు విశ్వనాథ్. నీలకంఠం(సత్యనారాయణ)దుర్మార్గాలకు ఆ ఊళ్ళో అడ్డు చెప్పేవారుండరు. మానాలు ప్రాణాలు ఎన్ని పోయినా అడిగే నాథుడు ఉండడు. గంగిరెద్దులను తీసుకుని డోలు వాయించుకునే హనుమద్దాసు(ఏఎన్ఆర్)కొడుకు తిరుమలదాసు(భానుచందర్)అదే ఊరికి కలెక్టర్ గా వస్తాడు. తేనె పూసిన కత్తితో కుట్రలు చేసే నీలకంఠంకు అదే సూత్రం ఉపయోగించి బుద్ది చెబుతాడు. ప్రాణనష్టం కలగకుండా కథను కంచికి చేరుస్తాడు.

ప్రధాన తారాగణంగా నటించిన వాళ్ళలో మురళీమోహన్, రమ్యకృష్ణ, సుజాత, కోట శంకర్ రావు, అశోక్ కుమార్, వై విజయలు ఆయా పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. కథ మొత్తం తన చుట్టూ తిరిగే నీలకంఠంగా సత్యనారాయణ నటన గురించి చెప్పేదేముంది. మామ కెవి మహదేవన్ పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. జోలాజో లమ్మజోలా, లాలేలో రామాలాలమ్మాల పాటలు క్లాసు మాస్ తేడా లేకుండా ఊపేశాయి. సహజమైన గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ దృశ్యకావ్యం 1989 మే 11న విడుదలై మంచి విజయం అందుకుంది. ఒక్క రోజు గ్యాప్ తో వచ్చిన గీతాంజలితో పోటీ పడటం విశేషం. సూత్రధారులుకు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుతో పాటు మూడు నంది పురస్కారాలు దక్కాయి. సంగీతం కన్నా ఎక్కువ సందేశానికి పెద్దపీఠ వేసిన విశ్వనాథ్ సినిమాగా ఇది ప్రత్యేకత సంతరించుకుంది

Also Read : Chevilo Puvvu : మొదటి సినిమాలో తడబడిన ఈవివి – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి