iDreamPost

ఆ ఊరివాళ్లు నటి సూర్యకాంతాన్ని రాళ్లతో కొట్టారు.. ఎందుకో తెలుసా?

ఆ ఊరివాళ్లు నటి సూర్యకాంతాన్ని రాళ్లతో కొట్టారు.. ఎందుకో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో గయ్యాలి అత్తగా పేరు తెచ్చుకున్న నటీమణి సూర్యకాంతం గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. వెండితెరపై గయ్యాలి అత్తగా, చెల్లిగా, తల్లిగా నటించేవారు. అప్పట్లో వెండితెరపై ఆమెనుచూసిన వాళ్లు నిజంగానే తిట్టుకునేవాళ్లు. నిజ జీవితంలో కొంతమంది కోడళ్ళు తమ అత్తలను సూర్యకాంతంతో పోల్చేవారు.. అంటే అలాంటి పాత్రలో ఆమె ప్రభావం అంతలా ఉండేది. సాధారణంగా సినీమాల్లో విలన్లుగా నటించే వారికి నిజ జీవితంలో కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. వారు నిజంగానే బయట కూడా విలన్ అని భావించి వారిపై దాడులు చేయడం, బండ బూతులు తిట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎంతోమంది నటులు తమ జీవితంలో అలాంటి అనుభవాలు ఎదుర్కొన్నామని చెబుతుంటారు. అలాంటి ఓ చేదు అనుభవం అలనాటి నటి సూర్యకాంతానికి కూడా జరిగిందట. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ ఒకప్పటి హాస్య నటీనటుల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు ప్రముఖ నటి సూర్యకాంతం. జెమినీ స్టూడియో నిర్మించిన ‘చంద్రలేఖ’ మూవీలో డ్యాన్సర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. తెలుగులో గృహ ప్రవేశం మూవీలో సహాయ నటిగా అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత సౌదామిని చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.. దురదృష్ట వశాత్తు రోడ్డు ప్రమాదంలో ముఖానికి గాయం కావడంతో ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. తర్వాత సంసారం మూవీలో మొదటిసారిగా గయ్యాలి అత్త పాత్రలో నటించింది. ఆ తర్వాత సూర్యకాంతం తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. కాకపోతే వరుసగా నెగిటీవ్ పాత్రలే ఆమెకు వచ్చాయి.. దాంతో ఆమె చనిపోయే వరకు అవే పాత్రలలో నటించింది. సూర్యకాంతం ప్రభావం ఎంతగా చూపించిందంటే.. అప్పట్లో తమ ఇంట్లో పుట్టిన ఆడపిల్లకు సూర్యకాంతం అని పేరు పెట్టాలంటే తల్లిదండ్రులు భయపడేవారట.. ఒకవేళ ఆ పేరు పెట్టినా వెంటనే మార్చేవారట. ఒకానొక సందర్భంలో నటి సూర్యాకాంతాన్ని ఓ ఊరివాళ్లు రాళ్లతో కొట్టినట్లు అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. అసలు విషయానికి వస్తే..

నటిగా వెండితెరపై సూర్యకాంతం వరుస సినిమాలతో దూసుకు పోతుంది. ఏ సినిమా అయినా సరి అందులో ఏదో ఒక లేడీ నెగిటీవ్ పాత్రలో సూర్యకాంతం ఉండి తీరాల్సిందే అన్న పరిస్థితి అప్పట్లో ఉండేది. సూర్యకాంతం నటించే పాత్రలు మరెవరూ నటించలేరని.. తమ సినిమాకు ఆమె అవసరం ఉంటుందని, ప్రేక్షకులకు బాగా దగ్గరవుతామని నిర్మాతలు భావించేవారు. అందుకే ఆమె కోసం ప్రత్యేక పాత్రలు కల్పించి మరీ తీసుకునేవారని అంటారు. కోడల్ని రాచి రంపాన పెట్టడం, పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టి విడగొట్టడం, భార్యా భర్తల మధ్య చాడీలు చెప్పి వారి బంధాలు వేరు చేయడం ఇలా ఎన్నో రకాల నెగిటీవ్ పాత్రలకు ఆమె జీవం పోసేవారు. దీంతో చాలా మంది జనాలు ఆమె నిజ జీవితంలో కూడా అలాగే ఉంటుందని భావించేవారు. ఒకసారి సినిమా షూటింగ్ కోసం ఓ గ్రామానికి వెళ్లారు. ఆ మూవీ హీరో నాగేశ్వరరావు. ఆ గ్రామంలో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకొని కొంతమంది ఆడవాళ్లు, మగవాళ్లు వచ్చారు. అక్కడ సూర్యకాంతాన్ని చూసి ఒక్కసారే ఆగ్రహం వ్యక్తం చేసి ఆమెపై రాళ్లు విసిరారు. దీంతో షూటింగ్ సభ్యులంతా ఆశ్చర్యపోయారు.

తనపై గ్రామస్థులు ఎందుకు రాళ్లు విసిరారో సూర్యాకాంతానికి అర్థం కాలేదు.. అంతలోనే అక్కడికి హీరో నాగేశ్వరరావు వచ్చి గ్రామస్థులు ఆపారు. ఎందుకు ఆమెను రాళ్లతో కొడుతున్నారని అడిగారు నాగేశ్వరరావు. దానికి సమాధానంగా కొంతమంది మహిళలు ఆమె తన కోడళ్లను ఏడిపిస్తుంది.. పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతుంది, నిండు సంసారాలను కూల్చి వేస్తుందని చెప్పారు. దీంతో నాగేశ్వరరావు, సూర్యకాంతం మొదట షాక్ తిన్నా.. నెమ్మదిగా వారికి సర్ధి చెప్పారు. తాము కేవలం ఆ సినిమాకు సంబంధించిన పాత్రల్లో మాత్రమే నటిస్తాం.. నిజ జీవితంలో సూర్యకాంతం చాలా మంచిది.. అందరినీ దగ్గరకు తీసుకుంటుంది.. అందరితో స్నేహంగా ఉంటుంది. ఆమె స్వయంగా అందరికీ వంటలు చేసుకొని మరీ తీసుకు వస్తుంది.. ఎంతోమందికి ఆర్థిక సహాయం చేశారు అని చెప్పారు. దీంతో జనాలు శాంతించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఈ విషయం గురించి సూర్యాకాంతం ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తాను చేస్తున్న అత్త క్యారెక్టర్ జనాల్లో అంత ప్రభావం చూపించిందా అందుకే నన్ను రాళ్లతో కొట్టారు. నేను చేస్తున్న పాత్రలకు తగు న్యాయం చేస్తున్నానని అప్పుడు అనిపించిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి