iDreamPost

బాబు ఉసిగొల్పారు.. జడ్జి రామకృష్ణ బుక్కయ్యారు..

బాబు ఉసిగొల్పారు.. జడ్జి రామకృష్ణ బుక్కయ్యారు..

రాజ్యాన్ని, రాజ్య ధర్మం ప్రకారం పాలించే పాలకులపై చేసే అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగానే పరిగణించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో కీలకమైన స్థానంలో ప్రజా ప్రతినిధి, ఒక రాష్ట్రానికి పాలకుడి మీద ఇష్టానుసారం ఎంత మాట వస్తే అంత మాట అని.. దానిని భావప్రకటన స్వేచ్ఛ అనుకుంటే పొరపాటే అవుతుంది. నిత్యం వివాదంలో ఉండే చిత్తూరు జిల్లా పుంగనూరు జడ్జి రామకృష్ణ మరోసారి ముఖ్యమంత్రి జగన్ మీద నోరు పారేసుకుని అడ్డంగా బుక్కయ్యారు.

ఒక కీలకమైన న్యాయస్థానానికి జడ్జి గా పనిచేసిన వ్యక్తి రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రిని తల నరుకుతా అని అనడం నిజంగా పెద్ద మాటే. అప్పటికప్పుడు వచ్చిన ఆవేశం లో పాత విషయాలను మనసులో పెట్టుకొని, కక్షపూరితంగా జడ్జి రామకృష్ణ ఆ మాట అని ఉండవచ్చు గాని చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే. ఆ మాటను ఆయన ఏకంగా ఏబీఎన్ టీవీ డిబేట్లో అనడం, అందరూ చూస్తుండగా వ్యాఖ్యానించడం పెద్ద విషయంగానే ప్రభుత్వం పరిగణించింది.

దీనిలో భాగంగానే జడ్జి రామకృష్ణ మీద దేశద్రోహం అభియోగాలు మోపి గురువారం అరెస్టు చేశారు. దీని పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మీద ఇష్టానుసారం మాట్లాడితే ఎవరికైనా చట్టం ఒకేలా పనిచేస్తుందని ఈ ఘటన ద్వారా తెలియజెప్పినట్లు అయింది. ఇటీవల సోషల్ మీడియాలో సైతం పాలకులు, ప్రజా ప్రతినిధుల మీద ట్రోలింగ్ సాధారణం అయిన సమయంలో.. ఈ పరిణామాలపై కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జడ్జి రామకృష్ణ మీద మోపిన అభియోగాలు సరైనవే అన్నది న్యాయ నిపుణుల మాట.

గతంలో సెషన్స్ కోర్టు జిల్లా జడ్జి గా పనిచేసిన రామకృష్ణ ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రభుత్వం మీద నానా రకాల వ్యాఖ్యలు చేశారు. ఆయన కుటుంబ తగాదాలు, ఆస్తి వ్యవహారాలను, వ్యక్తిగత అంశాలను అందరికీ ముడిపెట్టి, టిడిపి అధినేత చంద్రబాబు డైరెక్షన్లో ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి దాని వల్ల ఒక రకమైన సానుభూతి పొందాలని మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన ఇప్పటికే నాలుగుసార్లు ప్రభుత్వం మీద చిత్తూరు జిల్లా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చేసిన ఆరోపణల విచారణలో తేలిపోయాయి. ఆయన దురుద్దేశ పూర్వకంగానే ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడానికే ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని పోలీసులు విచారణలో తేలింది. అయినప్పటికీ జడ్జి రామకృష్ణ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు.

తాజాగా తిరుపతి ఉప ఎన్నిక వేళ దళితుల్లో సానుభూతి పొందేందుకు, అధికార పార్టీని ఇరుకున పెట్టాలి అన్న లక్ష్యంతో ఏబీఎన్ డిబేట్ కి వెళ్ళిన జడ్జి రామకృష్ణ ముఖ్యమంత్రిని అనరాని మాటలు అన్నారు. దీంతో చట్టం తన పని తాను చేసుకు వెళ్లే ఈ సమయంలో దీనిని నానా రకాల యాగి చేసి, దళితుల్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అన్న కలరింగ్ ఇవ్వాలని, దానివల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత రాబట్టవచ్చని టిడిపి వ్యూహంలో భాగమే ప్రస్తుతం జరుగుతున్న రచ్చకు కారణం. అయితే తన రాజకీయం కోసం ఎవరినైనా వాడుకొని వదిలేసే గల సామర్ధ్యం ఉన్న చంద్రబాబు ఖాతాలో ఇప్పుడు జడ్జి రామకృష్ణ కూడా కలిసినట్లేనని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read : బుట్టా రేణుక పై మైండ్ గేమ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి