iDreamPost

హైకోర్టు ఉత్తర్వులపై కలవరపడుతున్నాం…సుప్రీంకోర్ట్ సంచలన వ్యాఖ్యలు

హైకోర్టు ఉత్తర్వులపై కలవరపడుతున్నాం…సుప్రీంకోర్ట్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వంపై విచారణ సందర్భంగా, తీర్పులు వెలువరించే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేయడంలో ఏపీ హైకోర్టులు కొందరు న్యాయమూర్తులు అలవాటుగా మార్చుకున్నారనే విమర్శలను ఏకంగా సీఎం కూడా చేశారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కానీ తాజాగా ఏపీ హైకోర్ట్ తీర్పుపై మరోసారి సుప్రీంకోర్ట్ సంచలన కామెంట్ చేసింది. ఇప్పటికే గ్యాగ్ ఆర్డర్లు జారీ చేసిన సమయంలో కూడా హైకోర్ట్ ఉత్తర్వులను సుప్రీంకోర్ట్ కొట్టేసింది. తాజాగా మరోసారి రాజ్యాంగ విచ్ఛిన్నం వంంటి అంశాలలో సుప్రీంకోర్ట్ సీరియస్ గా స్పందించింది.

హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. దానిపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. విధానపరమైన అంశాలలో ప్రశ్నలకు తావిచ్చేలా హైకోర్ట్ వ్యవహరించకూడదని స్పష్టం చేసింది. అదే సమయంలో హైకోర్టు ఆదేశాల పట్ల తాము కలత చెందుతున్నామనే రీతిలో వ్యాఖ్యలు చేసింది.

కేసుకి సంబంధించి వివరాల స్టేట్ మెంట్ గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సరైన నోటీసు లేకుండా హైకోర్టు దానిని పరిగణలోకి తీసుకోవడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వం కోర్టుకి వెళ్లింది. అడ్వకేట్ జనరల్ కి గానీ కనీసం జనటార్నీ జనరల్ కి గానీ నోటీసుకూడా లేకుండా ఈ కేసు పరిగణనలోకి తీసుకునే ప్రయత్నం చేయడం సరికాదని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం తన పిటీషన్ లో పేర్కొంది. అదే సమయంలో రాజ్యాంగం ప్రకారం పాలనలో మూడు విభాగాల మధ్య సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తుందని ప్రభుత్వం సుప్రీంకోర్ట్ దృష్టికి తీసుకొచ్చింది. హైకోర్ట్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజ్యాంగ విచ్ఛిన్నం పేరుతో ఏపీ హైకోర్టు ఉత్తర్వులు కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాల ఉల్లంఘన అవుతుందని ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది. తక్షణం వాటిని నిలిపివేయాలని కోరింది.

దాంతో సుప్రీంకోర్ట్ ఈ ఉత్తర్వులపై స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా?.. అన్నది తేలుస్తామంటూ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లు దాఖలు చేస్తే ఆ వ్యాజ్యాల్లో ఓ న్యాయస్థానం ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎప్పుడైనా, ఎక్కడైనా మనం చూశామా? అంటూ విస్మయం వ్యక్తం చేసింది. ఇన్నేళ్ల మీ అనుభవంలో మీరైనా ఇలాంటి ఉత్తర్వులు చూశారా? అంటూ ప్రతివాదుల తరఫు న్యాయవాదిని కూడా ప్రశ్నించింది.

రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని అనడగానికి ఆధారాలు ఏంటో అర్థం కావడం లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వాటిపై ‘స్టే’ విధించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ ‘స్టే’ ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సెలవుల తర్వాత తుదపరి విచారణ ఉంటుందని పేర్కొంది.

పోలీసులు తమ వారిని అదుపులోకి తీసుకున్నారంటూ దాఖలయిన హెబియస్ కార్పస్ పిటీషన్లపై విచారణ సందర్భంగా అక్టోబర్ 1 ఏపీ హైకోర్ట్ రాజ్యాంగ వైఫల్యం అంశాలను ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరిపే పరిధి హైకోర్టుకు లేదని, అందువల్ల అక్టోబర్‌ 1న జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రీకాల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ రీకాల్‌ పిటిషన్‌ను జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ఒక్క నిమిషంలోనే కొట్టి వేశారు. కావాలంటే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించింది.

దానిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ (శాసన, న్యాయ, కార్యనిర్వాహక) కుప్పకూలిపోయానని భావించినప్పుడు హైకోర్టు మాత్రం రాజ్యాంగ వైఫల్యంపై అలాంటి ఉత్తర్వులు ఎలా ఇవ్వగలదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సబబేనా? అని అడిగారు. అసలు రాజ్యాంగం వైఫల్యం చెందిందని భావించేందుకు న్యాయమూర్తులను ప్రభావితం చేసినంత అంశాలు ఏమున్నాయో తమకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

కాగా రాజ్యాంగం వైఫల్యంపై హైకోర్టు కేవలం ప్రశ్న మాత్రమే లేవనెత్తిందని, అవి ఆదేశాలు కాదని సిద్దార్థ లూథ్రా పేర్కొనగా.. మీరెంత కాలం నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారని సీజే ప్రశ్నించారు. 29 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నానని లూథ్రా బదులివ్వడంతో ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఏ కోర్టయినా ఇలాంటి కేసుల్లో (హెబియస్‌ కార్పస్‌) రాజ్యాంగం వైఫల్యంపై విచారణ జరుపుతామంటూ ఉత్తర్వులు ఇవ్వడం చూశారా? అంటూ జస్టిస్‌ బాబ్డే తిరిగి ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు అత్యున్నత న్యాయస్థానమైన తమకు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి