iDreamPost

సుప్రిం నడుంబిగించింది..!

సుప్రిం నడుంబిగించింది..!

కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ.. దాన్ని అరికట్టడంలోనూ, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ల ధర లు, ఆక్సిజన్‌ సరఫరాలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అస్తవ్యస్త విధానాలను సరిచేసేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నడుం బిగించింది. కరోనా కట్టడి చర్యలపై విచారణ జరుపుతున్న కేంద్రం ఈ రోజు కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కేంద్ర దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలించిన తర్వాత.. సుప్రిం ఈ ప్రశ్నలు సంధించడం సదరు అఫిడవిట్‌లో సమగ్ర సమాచారం లేదన్న విషయాన్ని తెలియజేస్తోంది. కరోనా చికిత్స, ఆస్పత్రులు, సిబ్బంది కొరత, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ల ధరలు, సోషల్‌ మీడియాలో సమాచార పంపిణీ.. అంశాలపై సుప్రిం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.

చికిత్స పరిస్థితి ఏమిటి..?

దేశంలో వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ కేంద్రాన్ని సుప్రిం ప్రశ్నించింది. కరోనా చికిత్స ధరలను నియంత్రించడంలో ఎలాంటి విధానం అవలంభిస్తున్నారు..? ధరల నియంత్రణ వ్యవహారాన్ని రాష్ట్రాలకు వదిలేశారా..? తాత్కాలిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారా..? వైద్యులు, సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఏం చేశారు..? వైద్యులకు ౖÐð రస్‌ సోకితే వారిని రక్షించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు..? అంటూ సుప్రిం ప్రశ్నల వర్షం కురిపించింది. లాక్‌ డౌన్‌ తరహా ఆంక్షల అమలు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల ఫలితం ఏమిటో చెప్పాలని కోరింది.

Also Read : ఉన్నది ఉన్నట్లు.. జగన్ చేయలేదు కనికట్టు

జాతీయ టీకా విధానం ఏమైంది..?

వ్యాక్సినేషన్, టీకా ధరల అంశంపై అనేక ప్రశ్నలను సుప్రిం కేంద్ర ప్రభుత్వానికి సంధించింది. టీకాల ధరల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఎందుకు..? జాతీయ టీకా విధానం ఏమైంది..? టీకాలను కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయదు..? కొన్ని రాష్ట్రాలకు టీకా సరఫరాలో ప్రాధాన్యత ఇస్తున్నారా..? 18–45 ఏళ్ల మధ్య ఎంత మంది ఉన్నారు..? పేదలు, నిరక్షరాస్యుల వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ ఎలా..? వారికి నెట్‌ సౌకర్యం ఉందా..? శ్మశాన వాటిక సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ఎలా..? టీకాల ఉత్పత్తిలో కేంద్రం పెట్టుబడి పెడుతోందా..? అంటూ ప్రశ్నించిన సుప్రిం కోర్టు.. టీకాల ధరల నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండాలని తేల్చి చెప్పింది. ధరల నిర్ణయాధికారం ఉత్పత్తి సంస్థలది కాదని స్పష్టం చేసింది.

సోషల్‌ మీడియాను ఆపితే ధిక్కరణే..

కరోనాకు సంబంధించిన సమాచారాన్ని తొలగించేలా ట్విట్టర్, ఫేస్‌బుక్‌ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందన్న విమర్శల నేపథ్యంలో.. సుప్రిం కోర్టు ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా సాయం కోరడం తప్పుకాదని సుప్రిం స్పష్టం చేసింది. కోవిడ్‌పై సోషల్‌ మీడియాలో వచ్చే సమాచారాన్ని ఆపాలనుకోవడం లేదని తేల్చి చెప్పింది. ట్వీట్లు, ఫేస్‌బుక్‌ పోస్టులపై చర్యలు తీసుకుంటే ధిక్కరణగా భావిస్తామని హెచ్చరించింది. ఈ విషయం అన్ని రాష్ట్రాల డీజీపీలకు పంపాలని ఆదేశించింది. సమాచారాన్ని నిలువరించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేసిన సుప్రిం కోర్టు… తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలను అఫిడవిట్‌లో పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి, విచారణను వాయిదా వేసింది.

Also Read : హెల్త్ ఎమర్జెన్సీలో కార్పొరేటు ఆస్పత్రులను అదుపు చేయలేరా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి