iDreamPost

రైతు ఉద్యమంపై సుప్రిం జోక్యం.. పరిస్కారం లభించబోతోందా..?

రైతు ఉద్యమంపై సుప్రిం జోక్యం.. పరిస్కారం  లభించబోతోందా..?

కార్పొరేట్‌ కంపెనీలు వ్యవసాయ రంగంలోకి వచ్చేందుకు అనువుగా ఉన్న నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని 23 రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చట్టాలను రద్దు చేయాలని రైతులు, సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ఎవరి వారు మంకుపట్టుదల పట్టిన సమయంలో ఇరు వర్గాలకు సున్నితంగా చురకలు వేసిన సుప్రిం కోర్టు.. సమస్య పరిష్కారం దిశగా చొరవ తీసుకుంది. రైతులతో చర్చించి, సమస్యను పరిష్కరించేందుకు వీలుగా నూతన చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించడం దాదాపు నెలరోజులుగా నెలకొన్న వివాదానికి పరిష్కారం లభించే పరిస్థితులు నెలకొనేలా చేసింది.

తాజాగా సుప్రిం కోర్టు చేసిన వ్యాఖ్యలు రైతు ఉద్యమానికి మద్ధతునిచ్చేలా ఉన్నాయి. దేశం యావత్తే కాదు సుప్రిం కూడా రైతులకు మద్ధతుగా నిలిచిందనేలా దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యవహరించింది. ‘‘ మేము కూడా భారతీయులమే. రైతుల దయనీయ స్థితి గురుంచి ఆందోళన చెందుతున్నాం. జరుగుతున్న పరిణామాల పట్ట కలవరపడుతున్నాం..’’ అంటూ సుప్రిం చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలు ఉద్యమం చేస్తున్న రైతుల్లో కొండంత భరోసాను కల్పించాయి. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని చెప్పిన సుప్రిం రైతు ఉద్యమానికి బాసటా నిలుస్తూనే.. అదే సమయంలో ఒకరి నిరసన మరొకరి స్వేచ్ఛను హరించేదిగా ఉండకూడదని రహదారుల దిగ్భంధాన్ని ఉదహరించింది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తేనే.. రైతు సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులు, పాలగుమ్మి సాయినాథ్‌ వంటి ప్రముఖులతో సమస్య పరిష్కారం కోసం కమిటీ వేస్తామని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయడం రైతు ఉద్యమంలో కీలక ఘట్టం నిలుస్తోంది.

ఇప్పటికే ఐదు సార్లు కేంద్ర మంత్రులు, రైతుల మధ్య చర్చలు జరిగినా ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఆరు నెలలైనా ఢిల్లీ సరిహద్దుల నుంచి కదిలేది లేదని రైతలు భీష్మించుకూర్చున్నారు. ఎముకలు కొరికే చలిలోనూ రైతులు చేస్తున్న ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలో ఉంది. కాలం గడిస్తే.. ఉద్యమం చల్లారిపోతుందనే భావనతో కాలయాపన చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినా.. ఆ దిశగా పరిణామాలు కనిపించకపోవడం ప్రభుత్వాన్ని ఆందోళనపరుస్తోంది. రైతు ఉద్యమం దెబ్బకు… పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కరోనా వల్ల రద్దు చేశామని చెబుతున్నా.. వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న సెప్టెంబర్‌లో పార్లమెంట్‌ సమావేశాలు జరగడం కేంద్ర చెబుతున్న కారణంలో వాస్తవంలేదని తేలిపోయింది.

రాబోయే రోజుల్లో రైతుల ఉద్యమం తీవ్రత పెరిగి.. ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న అన్నదాతలు నగరంలోకి ప్రవేశిస్తే.. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పుతుందనే ఆందోళన కేంద్ర ప్రభుత్వంలో నెలకొంది. ఇదే విషయాన్ని సుప్రిం కోర్టు కూడా ప్రస్తావించింది. అందుకే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రైతుల అందోళనపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహచర మంత్రులతో చర్చిస్తున్నారు. నిఘా వర్గాల నుంచి నివేదికలు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో సమస్య పరిష్కారం కోసం సుప్రిం కోర్టు చేసిన సూచనను కేంద్ర ప్రభుత్వం తప్పకుండా స్వీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత సుప్రిం కమిటీ వేస్తే.. ఉద్యమ తవ్రత తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సుప్రిం ప్రతిపాదన ఆచరణలోకి వస్తే.. నూతన సంవత్సరం ప్రారంభానికి ముందే సమస్యకు పరిష్కారం లభించే అకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి