iDreamPost

నీతి ఆయోగ్ కు కొత్త చైర్మన్.. సన్నిహితుడికి కీలక బాధ్యతలు అప్పగించిన మోడీ

నీతి ఆయోగ్ కు కొత్త చైర్మన్.. సన్నిహితుడికి కీలక బాధ్యతలు అప్పగించిన మోడీ

కేంద్రంలో కీలక వ్యవస్థ అయిన నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీనామా చేశారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ గా కొనసాగుతున్న రాజీవ్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఆయన స్థానంలో కేంద్రం కొత్త వైస్ ఛైర్మన్ ను నియమించింది.ఆయన స్థానంలో సుమన్‌ బెరీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్​కుమార్ ​ఈనెల 30 వరకు పదవిలో కొనసాగనున్నారని ఆ తర్వాత కొత్త ఉపాధ్యక్షుడిగా సుమన్‌ బెరీ మే 1 నుంచి బాధ్యతలు తీసుకుంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

2017 ఆగ‌ష్టులో అప్ప‌టి నీతి ఆయోగ్ వైస్‌చైర్మ‌న్‌గా అర‌వింద్ ప‌న‌గ‌రియా రాజీనామా చేయ‌డంతో రాజీవ్ కుమార్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ల‌క్నో యూనివ‌ర్సిటీ నుంచి పీహెచ్డీ చేసిన రాజీవ్ కుమార్‌.. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో డీఫిల్ పూర్తి చేశారు. సెంట‌ర్ ఫ‌ర్ పాల‌సీ రీసెర్చ్ సీనియ‌ర్ ఫెలోగా ఉన్నారు. వ్య‌వ‌సాయ రంగం, పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ వంటి నిర్ణయాల్లో నీతి ఆయోగ్ వైస్ చైర్మ‌న్‌గా రాజీవ్ కుమార్ కీల‌క పాత్ర పోషించారు. రాజీవ్ కుమార్ రాజీనామాను ఆమోదిస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

కొత్త‌గా నీతి ఆయోగ్ వైస్‌చైర్మ‌న్‌గా నియ‌మితులైన సుమ‌న్ కే బెరీ ఇంత‌కుముందు నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ అప్ల‌యిడ్ ఎక‌న‌మిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్‌) డైరెక్ట‌ర్ జ‌న‌రల్ (చీఫ్ ఎగ్జిక్యూటివ్‌)గా ప‌నిచేశారు. ప్ర‌ధాని ఆర్థిక స‌ల‌హా మండ‌లి స‌భ్యుడిగానూ సేవ‌లందించారు. ఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌లో విజిటింగ్‌ ఫెలోగా ఉన్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో, స్టాటిస్టికల్‌ కమిషన్‌, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్య విధానానికి సంబంధించి సాంకేతిక సలహా కమిటీలోనూ సభ్యుడిగా పనిచేశారు.

2014 లో మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అప్పటివరకు ఉన్న ప్రణాళికాసంఘం స్థానంలో నీతి ఆయోగ్ ను ప్రవేశపెట్టారు. దీనికి తొలి ఉపాధ్యక్షుడిగా అరవింద్ పనగరియా వ్యవహరించారు. ఆ తరువాత ఆయన స్థానంలో 2017 నుంచి రాజీవ్ కుమార్ ఈ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. రాజీవ్ కుమార్ పలు రాష్ట్రాల్లో స్వయంగా పర్యటించి..క్షేత్ర స్థాయిలో అంశాలను స్వయంగా పరిశీలించారు. తెలుగు రాష్ట్రాల్లో అమలుచేస్తున్న పలు పథకాల తీరును ఆయన స్వయంగా సమీక్షించారు. ఇక, ఇప్పుడు ఆ స్థానంలో నియమితులైన సుమన్ బెరీ భారత ద్రవ్య విధానంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి