iDreamPost

పెళ్ళికొడుకు అమ్మకాలపై విశ్వనాథ బాణం – Nostalgia

పెళ్ళికొడుకు అమ్మకాలపై విశ్వనాథ బాణం – Nostalgia

వరకట్నం ఒకప్పుడు ఎన్నో లక్షల జీవితాలను నాశనం చేసిన మహమ్మారి. అలా అని ఇప్పుడు లేదని కాదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఆడపిల్ల తండ్రులు సొమ్ములు కానుకలు ఇచ్చే విషయంలో ఇప్పటికీ వందల ఏళ్ళ నాటి పాత సాంప్రదాయాన్నే పాటిస్తున్నారు. కాకపోతే సగటు మనిషి ఆదాయ స్థితికి అప్పటికన్నా ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉండటంతో ఇవేవి బయటికి కనిపించకుండా స్మార్ట్ గా మేనేజ్ చేస్తున్నారు. 80వ దశకంలో మాత్రం ఇది తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి కానీ గుర్తుండిపోయే స్థాయిలో ప్రేక్షకులను మెప్పించినవి తక్కువ. అందులో చెప్పుకోదగ్గ ఒక చక్కని చిత్రం శుభలేఖ.

1982 నాటికి చిరంజీవి నటించిన సినిమాలు నలభైకి దగ్గరలో ఉన్నాయి. మినిమమ్ గ్యారెంటీ హీరో అనే మార్కెట్ వచ్చింది కానీ మెగాస్టార్ స్థాయి కాదు. అప్పటికి ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్ఆర్ ల హవా కొనసాగుతోంది. ఆ టైంకి కళాతపస్వి విశ్వనాథ్ గారి పేరు దేశమంతా మారుమ్రోగుతోంది. శంకరాభరణం దెబ్బకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆయనతో సినిమా చేయిస్తే బావకు మంచి పేరొస్తుందన్న నమ్మకం అల్లు అరవింద్ కు బలంగా ఉంది. ఏదైతేనేం ఒకపట్ఠాన అంగీకరించని విశ్వనాథ్ గారితో ఫైనల్ గా కాంబినేషన్ సెట్ చేసి శుభలేఖకు శ్రీకారం చుట్టారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా ఇది.

అప్పుడప్పుడే పైకొస్తున్న సుమలతను హీరోయిన్ గా తీసుకున్నారు. కట్నం కోసం పాకులాడే రాజకీయ నాయకుడి పాత్రకు సత్యనారాయణ తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు విశ్వనాథ్ గారికి. శుభలేఖ సుధాకర్, రమణమూర్తి, సాక్షి రంగారావు, వంకాయల, రాళ్ళపల్లి, తులసి తదితరులను ఇతర తారాగణంగా ఎంపిక చేసుకున్నారు. గొల్లపూడి మాటలు సమకూర్చగా కెవి మహదేవన్ అద్భుతమైన పాటలు అందించారు. 1982 జూన్ 11న శుభలేఖ రిలీజై కుటుంబ ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకుంది. అదే రోజు పోటీగా వచ్చిన రాధమ్మ మొగుడు, కలియుగ జాంబవంతుడు, మరుసటి రోజు విడుదలైన కోరుకున్న మొగుడు పోటీని తట్టుకుని మరీ ఘనవిజయం సాధించింది.  కమర్షియల్ యాంగిల్ కాకుండా చిరంజీవిలోని మరో నటుడిని పరిచయం చేసింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి