iDreamPost

జగన్ కోరుకున్న అధికారిని రాష్ట్రానికి కేటాయించనున్న కేంద్రం

జగన్  కోరుకున్న అధికారిని రాష్ట్రానికి కేటాయించనున్న కేంద్రం

ఏపీలో విజ‌యం సాధించిన త‌ర్వాత తొలిసారిగా హ‌స్తిన‌లో అడుగుపెట్టిన నాటి నుంచి కేంద్రానికి విన్న‌విస్తున్నారు. ప్ర‌ధాని మోడీతో ముఖ్య‌మంత్రి హోదాలో భేటీ అయిన మొద‌టి స‌మావేశం నుంచి ఆ అంశాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. కానీ ఫ‌లితం క‌నిపించ‌లేదు. దాంతో ప్ర‌త్యామ్నాయం కూడా చూసుకున్నారు. ఈలోగా సీన్ మారింది. మ‌ళ్లీ కేంద్రంలో క‌ద‌లికి వ‌స్తోంది. సీఎం జ‌గ‌న్ విన‌తికి తుది రూపం వ‌స్తోంది. తెలంగాణా సీనియ‌ర్ ఐపీఎస్ స్టీఫెన్ ర‌వీంద్ర‌కు ఏపీ క్యాడ‌ర్ అధికారిగా డిప్యుటేష‌న్ ఖ‌రార‌వుతోంది. దాంతో న‌వ‌మాసాల త‌ర్వాత జ‌గ‌న్ కోరిక‌ను తీర్చేందుకు కేంద్రం సుముఖ‌త వ్య‌క్తం చేస్తున్న‌ట్టుగా చెబుతున్నారు.

సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో సంపూర్ణ మెజార్టీ సాధించిన ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అధిష్టించిన జ‌గ‌న్ త‌న టీమ్ ని ఎంపిక చేసుకోవ‌డంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నారు. అటు అడ్మినిస్ట్రేష‌న్, ఇటు లా అండ్ ఆర్డ‌ర్ విభాగాల్లో ప‌లు మార్పులు చేశారు. నిఘా విభాగంలో దానికి అనుగుణంగా స్టీఫెన్ ర‌వీంద్ర‌ను రంగంలోకి తీసుకురావాల‌ని ఆశించారు. గ‌తంలో రాయ‌ల‌సీమ లో ప‌నిచేసిన నాటి నుంచి జ‌గ‌న్ తో స్టీఫెన్ కి స్నేహం ఉంది. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న తెలంగాణా క్యాడ‌ర్ అధికారిగా ఉన్నారు. ఇటీవ‌ల బ‌దిలీల సంద‌ర్భంగా ఆయ‌న్ని రాచ‌కొండ సీపీగా కూడా నియ‌మించారు. దాంతో స్టీఫెన్ ని ఏపీలో కీల‌క‌మైన బాధ్య‌త‌ల్లో నియ‌మించుకోవాల‌ని ఆశించిన జ‌గ‌న్ ఆశ‌లకు బ్రేకులు ప‌డ్డాయి.

స్టీఫెన్ ర‌వీంద్ర డిప్యుటేష‌న్ కోసం జ‌గ‌న్ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. ఆయ‌న్ని ఇంటిలిజెన్స్ చీఫ్ గా నియ‌మించుకోవాల‌నే ల‌క్ష్యంతో జ‌గ‌న్ చేసిన ప్ర‌య‌త్నాలు ఇప్ప‌టి వ‌ర‌కూ ఫ‌లించ‌లేదు. ప‌దే ప‌దే ప్ర‌ధాని, హోం మంత్రి అమిత్ షాని క‌లుస్తూ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించినా ప్ర‌యోజనం ద‌క్క‌లేదు. దాంతో ఇక ఏపీలో స్టీఫెన్ రాక‌కి కేంద్రం కొర్రీలు వేస్తుంద‌నే అభిప్రాయం వినిపించింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా కొన్నాళ్ల పాటు వేచి చూసిన త‌ర్వాత ఇంటిలిజెన్స్ చీఫ్ బాధ్య‌త‌ల‌ను తొలుత విశ్వ‌జీత్ కి అనంత‌రం మ‌నీష్ కుమార్ సిన్హాకి అప్ప‌గించింది.

తాజాగా జ‌గ‌న్ కేంద్రం పెద్ద‌ల‌కు మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌పడే అవ‌కాశాలున్నందున అనూహ్యంగా స్టీఫెన్ ర‌వీంద్ర మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చారు. ఆయ‌న్ని ఏపీ క్యాడ‌ర్ కి త‌ర‌లించేందుకు కేంద్రంలో సానుకూల‌త ఏర్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లో ఆ ప్ర‌క్రియ పూర్తి చేస్తే జ‌గ‌న్ ఆశించిన‌ట్టుగా స్టీఫెన్ ర‌వీంద్ర‌కు ఏపీలో ప్ర‌ధాన బాధ్య‌త‌లు ద‌క్క‌డం అనివార్యంగా క‌నిపిస్తోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి