iDreamPost

స్టార్ యాక్టర్ ని చేసిన లారీ – Nostalgia

స్టార్ యాక్టర్ ని చేసిన లారీ – Nostalgia

గతంలో కొన్ని సంఘటనలు లేదా వ్యక్తులు తారల జీవితాలను సమూలంగా ఎలా మారుస్తాయా చూశాం కదా. ఇది కూడా అలాంటి ఒక ఆసక్తికరమైన కథే. దానికోసం టైం మెషిన్ లో బాగా వెనక్కు వెళ్ళాలి. అనగనగా ప్రకాశం జిల్లాలో రావినూతల అనే పల్లెటూరిలో శేషయ్య అనే యువకుడికి నాటకాలు, నటన అంటే మహా పిచ్చి. ఎలాగైనా తెరమీద తనను తాను చూసుకోవాలన్నది లక్ష్యం. అందులో భాగంగా మిత్ర బృందంతో కలిసి ఊళ్ళలో డ్రామాలు వేసేవాడు. విషకుంభాలు లాంటివి మంచి ప్రజాదరణ కూడా దక్కించుకున్నాయి. ఎప్పటికైనా అవసరం పడతాయని శేషయ్య కొన్ని ఫోటోలు తీయించుకుని రెడీ గా ఉంచుకున్నాడు.

1964లో ఓ మదరాసు సినిమా కంపెనీ వాళ్ళు కొత్త నటీనటుల కోసం వెతుకుతున్నారని తెలిసి శేషయ్య ఫోటోలను పంపించాడు ఫోటోగ్రాఫర్. పిలుపు వచ్చింది. కొద్దిరోజులు శేషయ్యకు జానపద విద్యల్లో శిక్షణ కూడా ఇప్పించారు. అయితే షూటింగ్ ప్రారంభం కాలేదు. ఆ తర్వాత తప్పటడుగులు, స్వర్గానికి నిచ్చెనలు అనే మరో రెండు ఆఫర్లు వచ్చాయి కానీ అవి కూడా సగంలోనే ఆగిపోయాయి. ఇక నా రాత ఇంతే అనుకుని శేషయ్య ఊరికెళ్ళిపోయాడు.

1970లో అట్లూరి పూర్ణచంద్రరావు కొత్త నటీనటుల ఆల్బంని తిరగేస్తున్న సమయంలో తన జగమే మాయ సినిమాకు శేషయ్య సరిపోతాడని భావించి ఓ మనిషిని రావినూతలకు పంపించాడు.సరిగ్గా అదే సమయంలో ఆంధ్రా-తెలంగాణ వేర్పాటు ఉద్యమం జోరుగా సాగుతోంది. రైళ్లు, బస్సులు తిరగడం లేదు. ఎక్కడ చూసినా రాస్తారోకోలు. శేషయ్య అష్టకష్టాలు పడి ఓ లారీ పట్టుకుని అక్కడికి చేరుకున్నాడు. కానీ అప్పటికే లేట్ అయ్యింది.

తీరా వెళ్లేసరికి మురళీమోహన్, ప్రసాద్ బాబు ఇంకొందరికి ఆడిషన్ జరుగుతోంది. లాభం లేదని రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకున్నాడు. ఈలోగా అదే సినిమాలో నటించాల్సిన శ్రీకాంత్ అనే నటుడు తప్పుకోవడంతో లాస్ట్ మినిట్ లో శేషయ్యను తీసుకున్నారు పూర్ణచంద్రరావు. లేదంటే కథ వేరుగా ఉండేది. ఆ శేషయ్యే తర్వాతి కాలంలో గిరిబాబుగా మారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా ఆపై దర్శకుడిగా, నిర్మాతగా ఇలా వివిధ రంగాల్లో తన ప్రతిభను చాటుకుని కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఒకవేళ ఆ శ్రీకాంత్ అనే తమిళ నటుడు కొనసాగి ఉంటే అప్పటికే విరక్తి వచ్చేసిన శేషయ్య యాక్టర్ అయ్యేవాడు కాదేమో, మనకు ఇంత గొప్ప టాలెంట్ పరిచయం అయ్యేదే కాదేమో. అందుకే అంటారు తారల జీవితాలు విచిత్ర విధి లిఖితాలు అని.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి