iDreamPost

Squid Game : స్క్విడ్ గేమ్స్ సంచలనం – నెట్ ఫ్లిక్స్ బంగారు బాతు

Squid Game : స్క్విడ్ గేమ్స్ సంచలనం – నెట్ ఫ్లిక్స్ బంగారు బాతు

వినోదం అంటే థియేటర్ టీవీనే కాదు దానికి మించి అనే స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఓటిటి వెబ్ సిరీస్ ల ట్రెండ్ విపరీతంగా పాకిపోతోంది. దానికి సాక్ష్యంగా గత రెండేళ్లలో వచ్చిన ఎన్నో సిరీస్ లు ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ పొందుతున్నాయి. మన దేశంలోనూ ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, స్కామ్ 1992 లాంటివి భారీ చిత్రాల రేంజ్ లో హైప్ ని రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఇక నెట్ ఫ్లిక్స్ లో స్క్విడ్ గేమ్స్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. చిన్నపిల్లల ఆటలను పెద్ద వాళ్ళ ప్రాణాలు తీసే స్కిట్లుగా మారిస్తే ఎలా ఉంటుందోననే ఆలోచన వరల్డ్ వైడ్ ఆడియన్స్ నుంచి జేజేలు అందుకుంటోంది. దానికి సాక్ష్యంగా ఫిగర్స్ నిలుస్తున్నాయి.

నెట్ ఫ్లిక్స్ అధికారిక లెక్కల ప్రకారం స్క్విడ్ గేమ్ ఇప్పటిదాకా 1.65 బిలియన్ల వాచ్ అవర్స్ దక్కించుకుంది. అంటే అక్షరాల 1 లక్ష 82 వేల సంవత్సరాల నిడివితో ఇది సమానం. మతి పోతోంది కదూ. కానీ ఇది నిజం. ఒక కొరియన్ డ్రామాకు ఈ స్థాయి స్పందన రావడం హాలీవుడ్ దిగ్గజాలను సైతం నివ్వెరపోయేలా చేస్తోంది. ఇప్పటిదాకా ఇంగ్లీష్ కొరియన్ హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్న స్క్విడ్ గేమ్ ని అతి త్వరలో తెలుగు తమిళంలో కూడా అందించబోతున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్లు కూడా నిన్న రిలీజయ్యాయి. ఇది వ్యూయర్ షిప్ అమాంతం పెంచుతుందనే నమ్మకంలో ఉంది నెట్ ఫ్లిక్స్ టీమ్. నిజమైనా ఆశ్చర్యం లేదు.

దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. సీరియల్ ఫార్మట్ లో ఎపిసోడ్ల వారిగా ఉండే వెబ్ సిరీస్ లలో కనక కంటెంట్ బలంగా ఉంటే భాషతో సంబంధం లేకుండా జనం ఎగబడి చూస్తారని. ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ గా నెట్ ఫ్లిక్స్ లో పేరున్న మనీ హీస్ట్, డార్క్, స్ట్రేంజర్ థింగ్స్ లాంటివి ఈ స్క్విడ్ గేమ్స్ దెబ్బకు వెనుకబడి పోయాయి. ప్రస్తుతం దీనికి సీక్వెల్ ప్లానింగ్ జరుగుతోంది. 2023 విడుదలని లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ చేస్తున్నారు. ఫస్ట్ సీజన్ కు మించి రెట్టింపు యాక్షన్ ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. ఈ పరిణామాలు గమనిస్తే రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్ ట్రెండ్ ఏ స్థాయికి చేరనుందో అర్థమవుతుంది

Also Read : Shyam Singha Roy : కొత్త అవతారంలో న్యాచురల్ స్టార్ ప్రయోగం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి