iDreamPost

రైతు హక్కుల కోసం తుపాకీకి ఎదురునిలిచిన వీరనారి… ఉద్దానం ఆడపడుచు గున్నమ్మ

రైతు హక్కుల కోసం తుపాకీకి ఎదురునిలిచిన వీరనారి… ఉద్దానం ఆడపడుచు గున్నమ్మ

రైతుల హక్కుల కోసం జమిందారీ వ్యవస్థపై తిరగబడింది. వారికి మద్దతుగా వచ్చిన బ్రిటీష్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. తన వారి అక్రమ అరెస్టులను అడ్డుకునేందుకు తుపాకులకు ఎదురు నిలిచింది. నిండు చూలాలుగా ఉన్నా లెక్కచేయకుండా.. ముందు నన్ను కాల్చండి అంటూ గుండె చూపిన ధీర వనిత.. చివరికి బ్రిటీష్ ముష్కరులు కరకు తూటాలకు బలైంది. 81 ఏళ్ల క్రితమే బలిదానం చేసిన ఆ ధీరురాలు గున్నమ్మ నేటికీ ఉద్దానం గుండెల్లో కొలువై ఉంది.

సాధారణ రైతు కుటుంబం

శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని గుడారి రాజమణిపురం గున్నమ్మ స్వగ్రామం. ఆమెది సాధారణ రైతు కుటుంబం. రెక్కాడితే గానీ డొక్క నిండని పరిస్థితి. అటువంటి కుటుంబంలో పుట్టిన గున్నమ్మకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు వివాహం చేశారు. ఆమె యుక్తవయస్సులో ఉండగానే భర్త మాధవయ్య కన్నుమూశారు. అప్పటికి ఆమె నిండు గర్భవతి. భర్త మరణంతో ఏకాకి అయిన గున్నమ్మ రైతు పోరాటాల్లో పాల్గొనడం ప్రారంభించింది.

జమిందారీ వ్యతిరేక ఉద్యమం

మందస జమీందారు జగన్నాధ రాజమణి బ్రిటిష్ పాలకుల అండతో నిరంకుశంగా వ్యవహరించేవారు. రైతులు పండించే పంటలో మూడో వంతు కప్పంగా లాక్కొనేవారు. వంట చెరకు తదితర అటవీ ఉత్పత్తులు తెచుకోకుండా ఆంక్షలు విధించారు. వీటిపై అసంతృప్తితో ఉన్న రైతులను గున్నమ్మ కూడదీయడం ప్రారంభించింది. అదే సమయంలో 1940 మార్చి 27, 28 తేదీల్లో పలాసలో అఖిలభారత రైతు మహాసభలు జరిగాయి. ఆ సభకు హాజరైన గున్నమ్మ అక్కడ ఎన్ జీ రంగా, ప్రకాశం పంతులు, గౌతు లచ్చన్న, మార్పు పద్మనాభం తదితర ప్రముఖులు చేసిన ప్రసంగాలతో స్ఫూర్తి పొందింది. అదే ఊపులో మార్చి 29న మందస సంస్థానంలో కిసాన్ సభ నిర్వహించింది. మార్పు పద్మనాభం నాయకత్వంలో జరిగిన ఆ సభలో గున్నమ్మ ఉత్తేజపూరిత ప్రసంగం చేసింది. మందస కొండల్లోని రుక్కమెట్ట అడవికి వెళ్లి వంద ఎడ్ల బళ్లతో కలప తరలించుకురావాలని ఆ సందర్బంగా పిలుపునిచ్చింది.

అడ్డుకున్న పోలీసులను ఛేదించుకొని..

గున్నమ్మ నేతృత్వంలో రైతులు అడవికి వెళ్లి కలప తీసుకొస్తుండగా జమీందారు సూచన మేరకు బ్రిటిష్ పోలీసులు వెళ్లి వారిని అడ్డుకున్నారు. అయితే రైతులు వారి అడ్డంకులను అధిగమించి కలప బళ్ళను గ్రామానికి చేర్చారు. ఈ విజయం నేపథ్యంలో మార్చి 30న గ్రామంలో గున్నమ్మకు అభినందన సభ పెట్టి ఆమె నుదుటన వీర తిలకం దిద్దారు. అయితే కలప తరలింపును అడ్డుకోవడంలో విఫలమైన జమిందార్ కలెక్టర్, మేజిస్ట్రేట్ లకు ఫిర్యాదు చేయడంతో పెద్ద సంఖ్యలో పోలీసులను పంపించి కలప స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. దీన్ని కూడా రైతులు వమ్ము చేశారు. ఇక లాభం లేదని ఎస్పీ, సబ్ కలెక్టర్ తదితరులు సాయుధ పోలీసు బలగాలను వెంటేసుకొని వెళ్లారు. రైతులు ఈటెలు, బల్లాలతో వారిని ఎదుర్కొన్నారు. ఇరుపక్షాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు రైతులను పోలీసులు పట్టుకుని బేడీలు వేసి పోలీసు వాహనంలోకి నెట్టారు.

తూటాలకు గుండె అడ్డుపెట్టి..

ఆ సమయంలో గున్నమ్మ బ్రిటిష్ పోలీసులకు ఎదురు నిలిచింది. రైతులకు బేడీలు వేయడానికి ఎంత ధైర్యం అని గర్జించింది. వాహనం కదలకుండా అడ్డుపడింది. అడ్డుతప్పుకోకుంటే కాల్చేస్తామంటూ పోలీసులు తుపాకీ ఎక్కుపెట్టినా వెరవకుండా దమ్ముంటే కాల్చమని సవాల్ చేసింది. ఆమె తెగువకు ఆశ్చర్యపోయిన పోలీసులు గర్భిణీ అన్న కనికరం మాత్రం చూపలేదు. తూటాల వర్షం కురిపించారు. దాంతో గున్నమ్మ నెలకొరిగింది. అమెతోపాటు మరో ఐదుగురు అసువులు బాశారు.

గ్రామానికి ఆమె పేరు

1940 ఏప్రిల్ ఒకటో తేదీ సాయంత్రం 6.30 గంటలకు సూర్యుడితోపాటే అస్తమించిన వీర గున్నమ్మ వీరత్వం మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది. గుడారి రాజమణిపురం పేరు ఆమె పేరిట వీరగున్నమ్మ పురంగా మారింది. గున్నమ్మ స్మారకంగా గ్రామ ముఖద్వారం, మసీదు, స్థూపం నిర్మించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి