iDreamPost

మీరే బాగుంటే సర్వేపల్లి ప్రజలు ఎందుకు తిరస్కరించారు?

మీరే బాగుంటే సర్వేపల్లి ప్రజలు ఎందుకు తిరస్కరించారు?

ఎవరిమీదో ఒకరి మీద బురద జల్లితే ఆ బురద అవతలి వ్యక్తి కడుక్కునే సమయానికి ఏదో ఒకటి జరగకపోదా అన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయానికి, ఫైర్ బ్రాండ్గా పేరు ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ధీటు గా సమాధానం చెబుతుండడంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఒకపక్క తమ సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతున్న వేళ వ్యక్తిగత ఆరోపణలు చేసి, ఎలాగోలా పబ్బం గడుపుకునేందుకు నెల్లూరు జిల్లా టీడీపీ నేత సోమిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలిచడం లేదు.

నెల్లూరు జిల్లా రాజకీయాలు ఇప్పుడు ప్రధానంగా సర్వేపల్లి నియోజకవర్గం వేదికగా వాడివేడిగా కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి వరుసగా నాలుగుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నా కాకాని గోవర్ధన్ రెడ్డి పై వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో పాటు, అవినీతి విషయాలను ఆయన కు అంట గట్టేలా మాట్లాడుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో నోటికి ఎంత వస్తే అంత, ఏ ఆరోపణ పడితే అది కాకాని పై చేస్తూ నిందలు వేయడానికి ప్రయత్నించారు. అయితే దీనిని తిప్పికొట్టడం లో కాకాని గోవర్ధన్ రెడ్డి విజయవంతమయ్యారు. సోమిరెడ్డి ఎన్ని ఆస్తులు కూడబెట్టారో, ఎంత సంపాదించారో దేవుడు మీద ప్రమాణం చేయాలని కాకాని విసిరిన సవాల్ లో సోమిరెడ్డి స్వీకరించ లేకపోయారు. దీంతో ఆయన చర్చ లో తేలిపోయినట్లు అయ్యారు.

చంద్రబాబు అనుంగు అనుచరుడిగా ఉండే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో 1994, 99 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. ఆ రెండు పర్యాయాలు కే సర్వేపల్లి ప్రజలకు అసలు విషయం అర్థమైంది. నియోజకవర్గానికి గాని, అక్కడి ప్రజలకు గానీ కనీసం కనిపించని రీతిలో రాజకీయాలు చేసిన సోమిరెడ్డి ని సర్వేపల్లి ప్రజలు నమ్మడం మానేశారు.

Also Read : సీనియర్లకు కళా ఎసరు?

2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో సోమిరెడ్డి ఓడిపోయారు. అనంతరం 2014 లో టిడిపి ప్రభుత్వం వచ్చినప్పటికీ సోమిరెడ్డి ని సర్వేపల్లి ప్రజలు నమ్మలేదు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. సర్వేపల్లి లో వరుస ఓటములు వస్తున్నా దానిని సమీక్షించుకుని లోపాలను సరిదిద్దుకో వలసిన సోమిరెడ్డి దానిని పక్కన పెట్టి, తన రాజకీయ ప్రత్యర్థుల మీద బురదజల్లే పని పెట్టుకున్నారు. దీని ద్వారా ఆయనకు ప్రజల్లో సానుభూతి మద్దతు వస్తుందని భావిస్తున్నా ప్రజలు కనీసం ఆయనను ఒక నాయకుడిగా కూడా గుర్తించడం లేదు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో టిడిపి క్యాడర్ మొత్తం వైస్సార్సీపీ వైపు తిరిగిపోవడం వెనుక సోమిరెడ్డి స్వీయ తప్పిదాలే ఉన్నాయి.

2006లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ని నమ్ముకుని, ఆయన మీద అభిమానంతో జడ్పీ చైర్మన్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అప్పటికే ఆర్థికంగా స్థితిమంతులు గా ఉన్న కాకాని కుటుంబం రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు ప్రజా సేవ లోకి వచ్చింది. అనంతరం వైయస్ మరణం తర్వాత కాకాని జగన్ వెంట నడిచారు. 2014లో తన సొంత నియోజకవర్గం సర్వేపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. అంతేకాకుండా పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో నెల్లూరు జిల్లా పార్టీ బాధ్యతలను స్వీకరించి అంతే దీటుగా రాజకీయాలు నడిపారు. మొదట్నుంచి మంచి స్థితిలో ఉన్న కాకాని కుటుంబం మీద సోమిరెడ్డి కావాలనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు అనేది జిల్లా ప్రజలు గమనిస్తున్నారు.

నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకంగానే కనిపిస్తాయి. ఇక్కడ నేతల మధ్య మాటల తూటాలు పేలుతాయి. జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం సోమిరెడ్డి, కాకాని మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో సాగుతోంది. నెల్లూరు జిల్లా టిడిపి కు ప్రధాన నాయకుడిగా సోమిరెడ్డి ఉంటే అదే స్థాయిలో కాకాని సైతం దీటుగా బదులిస్తూ హీట్ పెంచుతున్నారు.

Also Read : తప్పించుకుతిరుగుతున్న దేవినేని..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి