iDreamPost

తిరుపతి ఉప ఎన్నిక : ముందు నుయ్యి.. వెనక గొయ్యి లా టీడీపీ పరిస్థితి

తిరుపతి ఉప ఎన్నిక : ముందు నుయ్యి.. వెనక గొయ్యి లా టీడీపీ పరిస్థితి

తిరుపతి ఉప ఎన్నిక మీద తెలుగు తమ్ముళ్లు ఆశలు నానాటికీ సన్నగిల్లుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థి విషయంలో కొంత మేర, స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి మరికొంత డీలా పడిన తెలుగుదేశం శ్రేణులకు తాజాగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలకు పార్టీ బాధ్యుడిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని చంద్రబాబు ప్రకటించడంతో పూర్తిగా ఆశలు వదులుకున్నట్లు అయింది. ఆయనను ఇంచార్జ్ గా ప్రకటించడం పట్ల తెలుగుదేశం పార్టీ నేతల్లో కార్యకర్తల్లో తీవ్రk అసహనం ఎదురవుతుంది.

1996, 99 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా లో గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తర్వాత వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ లో చంద్రబాబుకు అండదండగా నిలిచి, ఆయనకు అత్యంత దగ్గరగా మెలిగిన సోమిరెడ్డిని చంద్రబాబు అమితంగా నమ్ముతారు. 1999 ఎన్నికల్లో గెలిచిన ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టిన చంద్రబాబు, అనంతర కాలంలో నెల్లూరు జిల్లా బాధ్యతలను అప్పగించారు. 2004, 09, 14,19 ఎన్నికల్లో వరుసగా టిడిపి అభ్యర్థిగా సర్వేపల్లి నుంచి పోటీ చేసిన ఆయనను నియోజకవర్గ ప్రజలు ఎవరూ నమ్మలేదు.

1999లో మంత్రిగా పనిచేసిన ఆయన సర్వేపల్లి నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం తో ఆయనకు తర్వాత ఎన్నికల్లో అన్ని ప్రతికూల ఫలితాలే వచ్చాయి. చంద్రబాబు బినామీగా ఉంటారని పేరున్న ఆయన కు నెల్లూరు జిల్లా మొత్తం బాధ్యతలు అప్పగించడం పైన అప్పట్లో విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ నేతలు నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరుగా చేజారుతున్న చంద్రబాబు మాత్రం సోమిరెడ్డికి ప్రాధాన్యాన్ని తగ్గించలేదు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే సోమిరెడ్డిని నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ చేసి, కీలకమైన వ్యవసాయ శాఖ బాధ్యతలను అప్పగించారు.

ఈ పరిణామంతో నెల్లూరు జిల్లా టిడిపి నేతల్లో తీవ్ర అసహనం వచ్చింది. దీంతో పాటు కీలక నేతలు పార్టీకి దూరమయ్యారు. తన సొంత నియోజకవర్గంలోనే గెలవలేని సోమిరెడ్డి జిల్లా బాధ్యతలు అప్పగించడంతో పాటు, జిల్లాలోని అన్ని విషయాలపైనా సోమిరెడ్డి చెప్పిందే తుది నిర్ణయం అన్నట్లుగా చంద్రబాబు నిర్ణయాలు ఉండేవి. అందులోనూ సోమిరెడ్డి తన రాజకీయ ప్రత్యర్థుల తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకొని, బయట పడతారని పలుమార్లు చంద్రబాబుకు జిల్లా నేతలు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.

తాజాగా తిరుపతి లోక్ సభ ఎన్నికల బాధ్యుడిగా సోమిరెడ్డి పేరు ప్రకటించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. తన నియోజక వర్గంలోనే సొంత క్యాడర్ లేని సోమిరెడ్డి తిరుపతి లోక్సభ నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు ఎలా నిర్వహిస్తారని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యర్థుల కు ధీటుగా నిలబడేవారు, సరైన సమాధానం చెప్పేవారు ఉంటేనే పార్టీకి గౌరవప్రదమైన ఓట్లు వస్తాయని సోమిరెడ్డి వంటి వారు బాధ్యతలు తీసుకుంటే మొత్తంగా పార్టీ చతికల పడడం ఖాయం అంటూ తిరుపతికి చెందిన ఓ టిడిపి నేత వ్యాఖ్యానించారు.

ఇప్పటికే అధికార పార్టీ తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే చొప్పున సమన్వయ బాధ్యతలను అప్పగించింది. విపక్ష తెలుగుదేశం మాత్రం కేవలం కొందరు నేతలు మాత్రమే నమ్ముకుని రాజకీయాలు చేయడం పార్టీ వర్గాల్లో ఆవేదనను నింపుతోంది. మరోపక్క పనబాక లక్ష్మి సైతం నాయకులు కార్యకర్తలతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తుండడం, కొన్ని నియోజకవర్గాల్లో పైనే ప్రధానంగా దృష్టి పెట్టడం టిడిపి దిగువస్థాయి కార్యకర్తలను అయోమయంలోకి నెట్టి వేస్తోంది.

మరోపక్క శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు నియోజకవర్గాల్లోని టిడిపి బాధ్యులు మీద క్యాడర్లో విపరీతమైన కోపం ఉంది. కార్యకర్తలను సరిగా పట్టించుకోరని 2019 ఎన్నికల్లో ఒంటెద్దు పోకడల వల్లే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఓటమి చెందింది అని ఇప్పటికీ కార్యకర్తలు భావిస్తున్నారు. మళ్లీ ఇప్పుడు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సమయంలో ఆయా నియోజకవర్గాల బాధ్యుల ఈ విషయంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో పాటు, మొత్తంగా సోమిరెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో పార్టీ ఓటమి మీద అప్పుడే ఒక అంచనాకు టిడిపి కార్యకర్తలు వచ్చినట్లు కనిపిస్తోంది.

Also Read : వైఎస్ఆర్ అనుచరుడు సూరీడుపై దాడి..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి