iDreamPost

థ్రిల్లింగ్ టైం పాస్ – ‘స్పెషల్ OPS’

థ్రిల్లింగ్ టైం పాస్  –  ‘స్పెషల్ OPS’

కరోనా దెబ్బకు థియేటర్లు మూతబడిన వేళ జనం పూర్తిగా డిజిటల్ హోం ఎంటర్ టైన్మెంట్ మీదే ఆధారపడుతున్నారు, . అందులోనూ ఏకంగా మరో 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించడంతో టీవీ లేదా స్మార్ట్ ఫోన్ ఈ రెండింటి మీదే వినోదం కోసం చూడాల్సి వస్తోంది. ఈ అవకాశాన్ని వీడియో స్ట్రీమింగ్ సైట్స్ చక్కగా వాడుకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో కొత్తగా రిలీజైన కొన్ని వెబ్ సిరీస్ లు బాగా ఆకట్టుకుంటున్నాయి. అందులో చెప్పుకోవాల్సినది స్పెషల్ OPS. నీరజ్ పాండే మరియు శివం నాయర్ సంయుక్త దర్శకత్వంలో రూపొందించిన ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లకు కలిపి 6 గంటల 30 నిమిషాల దాకా నిడివి ఉంది. ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా. అక్కడికే వద్దాం.

దేశభద్రతను సవాల్ చేస్తూ 2001లో పార్లమెంట్ మీద జరిగిన తీవ్రవాద దాడులను కాన్సెప్ట్ గా తీసుకుని దీన్ని రూపొందించారు. ఎటాక్ చేసిన ఐదుగురిని అక్కడిక్కడే మనవాళ్ళు హతం చేసినప్పటికీ మరొకడు తప్పించుకున్నాడన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు రా ఆఫీసర్ హిమ్మత్ సింగ్(కేకే మీనన్). తన ఐదుగురు ఏజెంట్లను తీవ్రవాదులు తలదాచుకునే ఐదు దేశాల్లో ప్లాంట్ చేసి ఇక్కడి నుంచి వాళ్ళకు కావలసిన సహాయం అన్ని రూపాలలోనూ అందజేస్తూ ఉంటాడు.

ఇలా 19 ఏళ్ళు గడిచిపోతాయి. ఖర్చు 28 కోట్లు దాటిపోతుంది. ప్రభుత్వం లెక్కలు కోరుతూ విచారణ కమిటీని నియమిస్తుంది. దాడి కుట్రలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఇక్లా ఖాన్ మాత్రం ఎంతకీ దొరకడు. దుబాయ్ ఏజెంట్ అయిన ఫారుక్(కరణ్ థాకర్)ప్రాణాలకు తెగించి అతని దాకా వెళ్తాడు. సహాయంగా మిగలిన నలుగురు అక్కడికి చేరుకుంటారు. అసలు ఇక్లాఖాన్ ఎవరు, వీళ్ళందరూ అతన్ని ఎలా పట్టుకున్నారు లాంటి ప్రశ్నలకు సమాధానమే స్పెషల్ OPS.

మొదట్లో కొంచెం ల్యాగ్ అనిపించినా క్రమంగా చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే నడిపించారు నీరజ్ మరియు శివం. ఒక్కో ఎపిసోడ్ ఒక్కొక్కరు డైరెక్ట్ చేసినప్పటికీ ఆ వ్యత్యాసం తెలియనివ్వకుండా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఏ వెడ్నెస్ డే, స్పెషల్ చబ్బీస్ లాంటి సినిమాల ద్వారా గొప్ప పేరు సంపాదించుకున్న నీరజ్ పాండే ఇందులో తనదైన మార్కు చూపించాడు. కథనంతో పాటు భారీ బడ్జెట్ సినిమా స్థాయిలో ఏ మాత్రం రాజీ పడని లొకేషన్స్ లో చిత్రీకరించిన తీరు అబ్బురపరుస్తుంది.

కాకపోతే గతంలో అమెజాన్ ప్రైమ్ లో చూసిన ది ఫ్యామిలీ మ్యాన్, నెట్ ఫ్లిక్స్ లో చూసిన బార్డ్ అఫ్ బ్లడ్ తరహాలోనే ఇది కూడా సాగుతుంది. క్యాస్టింగ్ లో తీసుకున్న జాగ్రత్తల వల్ల ఆర్టిస్టుల నుంచి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇందులో చూడొచ్చు. విలన్ కు సంబంధించిన ట్విస్ట్ షాక్ ఇస్తుంది. కేకే మీనన్ తో పాటు అందరు నటీనటులు చాలా మంచి అవుట్ పుట్ ఇచ్చారు. లాక్ డౌన్ టైం బోర్ కొడుతూ సినిమాల పరంగా పెద్దగా ఆప్షన్ లేకుంటే హాట్ స్టార్ లో స్పెషల్ OPSని హ్యాపీగా ట్రై చేయొచ్చు. హింది కదా ఎలా అని టెన్షన్ పడకండి. చక్కని డబ్బింగ్ క్వాలిటీతో తెలుగు వెర్షన్ ను సైతం అందుబాటులో ఉంచారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి