iDreamPost

ఇకపై అమెజాన్‌ నుంచి కార్లు కూడా కొనొచ్చు.. భారీ ఆఫర్లు కూడానా?

  • Published Nov 20, 2023 | 11:17 AMUpdated Nov 20, 2023 | 11:17 AM

ఇప్పుడున్నదంతా ఆన్‌లైన్‌ యుగం.. ఇంటి నుంచి కాలు కదపకుండా.. ఉన్న చోట నుంచే మనకు కావాల్సిన సమస్తం తెప్పించుకోవచ్చు. ఇకపై ఈ జాబితాలో కార్లు కూడా చేరనున్నాయి. ఆ వివరాలు..

ఇప్పుడున్నదంతా ఆన్‌లైన్‌ యుగం.. ఇంటి నుంచి కాలు కదపకుండా.. ఉన్న చోట నుంచే మనకు కావాల్సిన సమస్తం తెప్పించుకోవచ్చు. ఇకపై ఈ జాబితాలో కార్లు కూడా చేరనున్నాయి. ఆ వివరాలు..

  • Published Nov 20, 2023 | 11:17 AMUpdated Nov 20, 2023 | 11:17 AM
ఇకపై అమెజాన్‌ నుంచి కార్లు కూడా కొనొచ్చు.. భారీ ఆఫర్లు కూడానా?

నేటికాలంలో ప్రతిదీ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం సర్వసాధారణం అయ్యింది. గుండు పిన్ను నుంచి.. వాషింగ్‌ మిషన్ల వంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్‌ వస్తువుల వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఉప్పు, పప్పు వంటి వస్తువులను కూడా ఆన్‌లైన్‌లోనే కొంటున్నారు. దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌.. ఓ అడుగు ముందుకు వేసి.. కొన్ని రోజుల క్రితం నుంచి టూవీలర్లను కూడా అమ్మకానికి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ క్రమంలో అమెజాన్‌ మరో బిగ్‌ అప్డేట్‌ ఇచ్చింది. త్వరలోనే ఆన్‌లైన్‌లో కార్లు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. వచ్చే ఏడాది నుంచే తమ వెబ్‌సైట్‌లో కార్ల విక్రయాలు ప్రారంభించనున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

ఈకామర్స్‌ సంస్థ అమెజాన్ వచ్చే ఏడాది నుంచి తమ వెబ్‌సైట్‌లో కార్ల విక్రయాలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు హ్యూందాయ్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా హ్యూందాయ్ తన కారు మోడల్స్ వివరాలను వినియోగదారుల కోసం అమెజాన్‌లో అందుబాటులో ఉంచనుంది. ఇక కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు తమకు నచ్చిన మోడల్ కారును ఎంపిక చేసుకుని, ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించాలి. ఆ తర్వాత దగ్గర్లోని హ్యూందాయ్ డీలర్ నుంచి కారు డెలివరీ తీసుకోవచ్చు. లేదా వినియోగదారులు చెప్పిన అడ్రెస్‌కే కారు డెలివరీ చేస్తారని తెలిపారు.

అయితే ఈ సదుపాయం అన్ని దేశాల్లో ఇప్పుడే అమల్లోకి రాదని.. ఇది ముందుగా అమెరికాలోని వినియోగదారులకు అందుబాటులోకి రానుందని అమెజాన్‌ తెలిపింది. ఆ తర్వాత దీన్ని ఇతర దేశాలకు విస్తరిస్తామని వెల్లడించింది. వివిధ నగరాల్లోని హ్యూందాయ్ డీలర్ షిప్‌లకు, కొనుగోలుదారులకు మధ్య వారధిలా తాము వ్యవహరిస్తామని అమెజాన్‌ పేర్కొంది. అలాగే ఇతర కంపెనీల కార్లు విక్రయించేందుకు ఆయా సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. త్వరలోనే మరిన్ని కంపెనీల కార్లను అమెజాన్‌లో విక్రయించనున్నట్లు వెల్లడించింది.

ఈసందర్భంగా అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ మాట్లాడుతూ..‘‘తమ కస్టమర్లకు మెరుగైన, సులభతరమైన సేవలను అందించాలనే ఆలోచనకు హ్యూందాయ్ వంటి పెద్ద కంపెనీ మాకు తోడవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. మా రెండు కంపెనీల భాగస్వామ్యంతో ఆన్‌లైన్‌లో ఈజీగా కార్లు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో విక్రయించే హ్యూందాయ్‌ కార్లలో తీసుకురాబోయే అలెక్సా సాయంతో ఆకార్లు కొనే కస్టమర్లు వినోదం, షాపింగ్, స్మార్ట్ హోమ్ ఉపకరణాల నియంత్రణ, షెడ్యూలింగ్ వంటి ఎన్నో పనులను సులభంగానే చేసుకోవచ్చు. అమెజాన్- హ్యూందాయ్ భాగస్వామ్యంతో భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు తీసుకొస్తాం’’ అని తెలిపారు.

గత కొంత కాలంగా అమెజాన్‌.. ఆటోమొబైల్ రంగంలోని పలు ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలతో కలిసి వర్చువల్ షోరూమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటి ద్వారా యూజర్లు కార్లతోపాటు, విడి భాగాలు, యాక్ససరీలను కూడా కొనుగోలు చేయొచ్చు. మరోవైపు.. అమెజాన్‌లో కార్లు కొనుగోలు చేసే వారికి భారీ ఆఫర్లు సైతం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి ఇప్పటి వరకు అమెజాన్‌ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ కచ్చితంగా మంచి ఆఫర్లు ఉంటాయని భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి