iDreamPost

బాబు ఆశలకు సోషల్‌ మీడియా గండి..!

బాబు ఆశలకు సోషల్‌ మీడియా గండి..!

గడిచిన సాధారణ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో 2014లో అధికారంలోకి వచ్చేందుకు కారణమైన బీజేపీని, నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచుకున్న ఎన్డీఏని వదిలి బయటకు వచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీని విమర్శిస్తే ఓట్లు పడతాయనుకున్న బాబు దాదాపు ఏడాది పాటున మోడిని టార్గెట్‌గా చేసుకుని దుర్భాషలాడారు. కానీ బాబు అంచనా తప్పింది.

ఘోర పరాజయం వల్ల పార్టీ నేతలు ఒక్కొరుగా జారీ పోతున్నారు. ఫలితాలు రాగానే రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. తమ హాయంలో జరిగిన అవినీతి,అక్రమాలు, కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. టీడీపీ తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరుగా అరెస్ట్‌ అవుతున్నారు. ఇదే సమయంలో వైసీపీప్రభుత్వం మరింత దూకుడుగా వెళుతూ నాటి చంద్రబాబు ప్రభుత్వంలోని అక్రమ వ్యవహారాలపై సీబీఐ విచారణకు నిర్ణయించింది.

అవినీతి అక్రమాలపై ఏసీబీ, సీఐడీతోపాటు సీబీఐలు రంగంలోకి దిగాయి. ఈ సంస్థలకు తోడుగా ఈడీ వస్తోంది. ఈఎస్‌ఐ స్కాంలో ఏసీబీ విచారణ జరుగుతుండగా.. 150 కోట్ల రూపాయలపై ఈడీ విచారణ చేస్తోంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ఈడీ అధికారులు ఏసీబీ నుంచి వివరాలు తీసుకున్నారు. అదే సమయంలో అగ్రిగోల్ట్‌ స్కాం, రాజధాని అమరావతి భూ కుంభకోణంపై కూడా సీఐడీ నుంచి వివరాలు తీసుకున్నారని వార్తలోచ్చాయి.

ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నోటి నుంచి మరోసారి మోడీ మాట వెలువడింది. మోడీతో తనకు వ్యక్తిగత విభేధాలు ఏమీ లేవంటూ నిన్న ఏపీ బడ్జెట్‌పై జూమ్‌లో మాట్లాడే సమయంలో అన్నారు. రాష్ట్రం కోసమే పోరాడానంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి చంద్రబాబు మోడీకి, బీజేపీకి మళ్లీ దగ్గర కావాలని ప్రయత్నించారు. అ క్రమంలోనే ఆయన బినామీలుగా ప్రచారంలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్‌లను బీజేపీలోకి పంపారని ప్రత్యర్థి పార్టీ నేతలు విమర్శించారు. ఈ ఏడాది జనవరి ప్రారంభంలోనే స్వయంగా చంద్రబాబే.. ‘ కేంద్రంతో విభేదించి నష్టపోయాం’ అంటూ మాట్లాడారు. ఆ మాటలను బాబు అనుకూల మీడియా పతాకశీర్షికగా ప్రచురించిది. అనుకూల మీడియా కూడా బాబును మళ్లీ బీజేపీకి దగ్గర చేర్చాలనే లక్ష్యంతో పని చేస్తోంది.

ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడాలంటే మోడీనే దిక్కని గతనెలాఖరులో జరిగిన మహానాడులో టీడీపీ సీనియర్‌ నేత జ్యోతుల నెహ్రూ నేరుగా చంద్రబాబుకు సలహా ఇచ్చారు. మోడీతో మాట్లాడితే క్షమించకుండా ఉండరని కూడా ఆయన జూమ్‌లో అందరూ చూస్తుండగానే చెప్పారు. చంద్రబాబే జ్యోతులతో అలా చెప్పించి ఉంటారని అందరూ అనుకున్నారు. ఏది ఏమైనా గతం అంతా మరిచిపోయి.. మళ్లీ మోడీకి, బీజేపీకి దగ్గర కావాలని చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నిస్తుంటే ఆయనంటే గిట్టని వారు, వైసీపీ, బీజేపీ సానుభూతి పరులు చంద్రబాబు ప్రయత్నాలకు గండికొడుతున్నారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు మోడీని ఏమన్నది, ఏ స్థాయిలో దూషించారనే విషయాన్ని సోషల్‌ మీడియాలో వైరస్‌ చేస్తున్నారు.

‘‘ మోడీ అహంకారి, నాకన్నా జూనియర్, మోడీ దేశాన్ని నాశనం చేశాడు, మోడీ తప్పా ఎవరైనా బీజేపీతో నాకు ఓకే, మోడీ మతతత్వశక్తి, మోడీ పెళ్లాంను వదిలేశారు. మోడీకి కుటుంబం లేదు’’ ఇలా నాడు చంద్రబాబు వివిధ సభల్లో అన్న మాటలను సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మోడీని వ్యక్తిగతంగా దూషించి ఇప్పుడు మోడీతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు, రాష్ట్రం కోసం పోరాడాను అంటే మోడీ ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టులకు టీడీపీ సోషల్‌ మీడియా నుంచి కౌంటర్లు కూడా ఉండడంలేదు. మొత్తం మీద ఈ పోస్టులు చంద్రబాబు ఆశలకు గండికొట్టేలాగే ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి