iDreamPost

YSR పౌష్టికాహారంలో ఉంది పాము కళేబరం కాదు.. ఇది అసలు నిజం!

YSR పౌష్టికాహారంలో ఉంది పాము కళేబరం కాదు.. ఇది అసలు నిజం!

ఆంధ్రప్రదేశ్ లోని ఏపీ ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్బిణీలకు పౌష్టికాహారం అందిస్తున్న సంగతి విదితమే. గర్బిణీలు ప్రతి నెలా ఆ పౌష్టికాహార ప్యాకెట్లను తీసుకుంటూ ఉంటారు. అయితే చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మండలం జంబువారి పల్లె పంచాయతీలోని శాంతినగర్ అంగన్ వాడీ కేంద్రంలో పౌష్టికాహారం కిట్‌లో పాము కళేబరం ఉందంటూ ప్రచారం జరిగింది. మానస అనే గర్బిణీ ఆ కిట్ తీసుకుని.. తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లాక.. కిట్‌లో ఎండు ఖర్జూరం ప్యాకెట్ తెరిచి చూడగా.. ఆమెకు పాము కళేబరంలా అనిపించి.. అంగన్ వాడీ కార్యకర్త జానకి దృష్టికి తీసుకెళ్లింది. జానకి.. అంగన్ వాడీ సూపర్ వైజర్ కళ్యాణికి ఫోన్ చేసి చెప్పింది. మానస పంపిన ఫోటోలను ఫార్వర్డ్ చేసింది. దీనిపై ఉన్నతాధికారులు విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పౌష్టికాహారంలో పాము కళేబరం అంటూ వస్తున్న వార్తలపై ఐసీడీఎస్ పీడీ నాగ శైలజ స్పందించారు. అది పాము కళేబరం కాదని, ప్లాస్టిక్ అని ఆమె స్పష్టం చేశారు. ఈ పౌష్టికాహారాన్ని ఈ నెల నాల్గో తేదీన గర్బిణీ మాససకు పంపిణీ చేశారని, అందులో ఎండు ఖర్జూరం ప్యాకెట్ ను ఆమె మంగళవారం తెరచినట్లు పేర్కొన్నారు. పాము లాంటి వస్తువు ఉండటంతో ఆ విషయాన్ని అంగన్ వాడీ కార్యకర్తకు చెప్పారని, దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారని పేర్కొన్నారు. పాము లాంటి వస్తువును చేతిలో తీసుకుని కళేబరమా లేక ఇతర వస్తువేదైనా అని పరిశీలించారన్నారు. దాని వాసన చూసి, చేతిలో గట్టిగా విరవగా..విరగక పోవడంతో పాము కళేబరం కాదని నిర్ధారించారు.

పాము కళేబరం అయితే విరిగి, ముక్కలు ముక్కలుగా విరిగిపోయేదని నాగ శైలజ తెలిపారు. ప్యాకింగ్ సమయంలో ప్లాస్టిక్ లాంటి వస్తువు ఎండు ఖర్జూరం ప్యాక్‌లో ఉండిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ వస్తువు గట్టిగా, అంగుళంపైనే ఉందని, అక్కడక్కడ పచ్చ చుక్కలు ఉన్నాయని, దాన్ని ల్యాబ్‌కు పంపుతామన్నారు. అది పాము కళేబరం అయితే వాసన వస్తుందని పేర్కొన్నారు. అంగన్ వాడీ సిబ్బంది.. పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కొన్నిపచ్చ పత్రికలు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి